'మొంథా తుపాను'ను దెబ్బతీసిన విండ్ షీర్ అంటే ఏమిటీ?
ఏమిటీ విండ్ షీర్.. తుపాన్లను ఎలా దెబ్బతీస్తాయి ఈ గాలులు
మనం బొంగరం (స్పిన్నింగ్ టాప్) విసిరామనుకోండి. దాని ములికి భూమిలోకి సరిగా దిగితే చక్కగా గిరగిరా తిరుగుతుంది. ఒకవైపుకే దిగిందనుకోండి.. వంకరగా దిగితే కాసేపు తిరిగి పక్కకి ఒరిగిపోతుంది. ఈ సూత్రాన్నే తుపాన్లకి వర్తింపజేస్తుంటారు. కింద, పైన గాలులు వేర్వేరు దిశల్లో ఉంటే అది “spin balance” కోల్పోయి బలహీనమవుతుంది. దీన్నే “విండ్ షీర్” (Wind Shear) అంటారు వాతావరణ శాస్త్రవేత్తలు. విండ్ షీర్ అంటే గాలుల కోత. దీనివల్లే మొంథా తుపాను తీరాన్ని తాకేటపుడు ఉండాల్సిన తీవ్రత తగ్గిందని విశ్లేషిస్తున్నారు. ఏమైనప్పటికి మొంథా తుపాను తీరం దాటింది. ఆ సమయంలో మొంథా వల్ల అపార నష్టం జరక్కుండా ఈ విండ్ షీర్ ఉపయోగపడింది.
2023లో మిచాన్ తుపాను వేగం, గమనం మాదిరే ఈ మొంథా కూడా హడలెత్తించింది. దీని తీరు చూసినపుడు రాష్ట్రంలోని అనేక తీర ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోతాయా అన్నంతగా మొంథా భయపెట్టింది. అయితే తీరానికి 70 నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విండ్ షీర్ (గాలుల కోత) మొదలైంది. తుపానులో కీలకమైన సైక్లోన్ ఐ పై విండ్ షీర్ పంజా విసిరింది. దీంతో తుపాను గాలులు చీల్చుకుపోయి మొంథాను చెల్లాచెదరు చేశాయి. ఫలితంగా మొంథా తుపాను తీరం దాటకముందే బలహీనపడింది. విండ్ షీర్ ప్రభావంతో మొంథా తీరం తాకే సమయానికి శక్తిని కోల్పోయింది. వంద నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయనుకున్న గాలులు కాస్తా విండ్ షీర్ తో వేగంతో పాటు, బలం కూడా కోల్పోయాయి. ఫలితంగా తీరప్రాంతాలు ఊపిరి పీల్చాయని అంటున్నారు.
అసలింతకీ ఏమిటీ విండ్ షీర్..
తీరానికి సమీపంగా గాలి దిశల్లో తేడా (Wind Shear) తుపాన్లకు ప్రాణాంతకం. తీరానికి చేరుకునే లోపే గాలి దిశ మారితే తుపాను తూలిపోతుంది. ఈసారి కూడా అదే జరిగింది.
వాతావరణ కేంద్రం తెలిపినట్లుగా, సముద్రపు వేడి తగ్గడం, గాలుల దిశల్లో విరుద్ధ మార్పులు రావడం వల్ల తుపాన్ శక్తి తగ్గింది. తీరాన్ని తాకిన తర్వాత తుపాన్ బలహీనపడి వాయుగుండం స్థాయికి చేరింది.
భారీ వర్షాలు కురిపించిన “మొంథా” తుపాన్ తర్వాత ఆంధ్ర–తెలంగాణ ప్రాంతాల వాయవ్య దిశగా కదిలింది. దీంతో గాలి వేగం గంటకు 70 నుంచి 80 కిమీకి తగ్గింది. సముద్రం నుంచి భూమి వైపు కదిలిన వెంటనే తుపాను శక్తిని ఎలా కోల్పోయిందో శాస్త్రీయంగా చూద్దాం.
“Wind Shear” అనేది వాతావరణంలో ఎత్తు మారే కొద్దీ గాలి వేగం లేదా దిశలో వచ్చే తేడా. సాధారణంగా సముద్ర మట్టానికి దగ్గరగా గాలి ఒక దిశలో వీస్తే, పై ఎత్తులో అది మరో దిశలో లేదా వేరే వేగంతో వీస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో తుపానులో ఏర్పడే గాలి చక్రం (vortex) చిందరవందరగా ఉంటుంది. ఫలితంగా తుపానులోని గాలి ప్రవాహం చెల్లాచెదురవుతుంది, తుపాను బలహీనమవుతుంది.
మొంథా తుపాన్ తీరాన్ని తాకే ముందు బంగాళాఖాతంలో బలంగా ఏర్పడింది. కానీ ఆ సమయంలో వాయుగుండం పైభాగంలో గాలి దిశ పశ్చిమం వైపు, క్రింద భాగంలో ఉత్తర–వాయువ్య దిశలో ఉండటంతో గాలి కోత ఎక్కువైంది. ఈ “vertical shear” తుపానులోని గాలి చక్రాన్ని సమతుల్యం కోల్పోయేలా చేసింది.
తీరాన్ని తాకిన తర్వాత సముద్రపు వేడి తగ్గడం, భూమి వత్తిడి పెరగడం వల్ల దాని శక్తిని త్వరగా తుడిచేశాయి.
తుపాన్లకు ఇంధనం లాంటిది సముద్రపు ఉపరితల వేడి (sea surface temperature). తుపాను తీరం దాటిన తర్వాత సముద్రపు ఆవిరి నిలిచిపోవడంతో వాయుమండల తేమ తగ్గింది. ఈ సమయంలో గాలుల కోత ఎక్కువగా ఉన్నందున తుపాన్‌లోని వేడి–తేమ చక్రం (heat–moisture cycle) ఆగిపోయింది. ఫలితంగా తుపాన్ 6 గంటల్లోనే తీవ్ర తుపాన్ నుంచి సైక్లోనిక్ స్టార్మ్ స్థాయికి బలహీనమైంది.
IMD, విశాఖ వాతావరణ కేంద్రం నిపుణుల ప్రకారం.. “మొంథా తుపాన్ తీరం తాకే ముందు నుంచే గాలుల దిశలు విరుద్ధంగా మారడం ప్రారంభమైంది. ఆ గాలుల కోత వల్ల తుపాన్ కంటి గోడలు చెదిరిపోయాయి”.
ఈ పరిస్థితి 2014లో “హుద్‌హుద్”, 2020లో “నివార్” తుపాన్ల సమయంలో కూడా కనిపించింది. తుపాన్ గాలి వేగం గంటకు 110 కిమీ నుంచి 70 కిమీకి తగ్గింది. తీరాన్ని తాకిన 8 గంటల్లోనే తుపాన్ “డిప్రెషన్” స్థాయికి చేరింది. కానీ వర్షపాతం కొనసాగింది.
మొంథా తుపాన్ శాంతించడానికి ప్రధాన కారణం సముద్రపు వేడి తగ్గడం, భూమిపై వత్తిడి పెరగడం, గాలులు వాటి ఇష్టం వచ్చినట్టు వీచడం వల్ల కేవలం 12 గంటల్లో “మొంథా” తుపాను బలహీన పడింది.
తుపాన్ బలహీనమైనా, దాని ప్రభావం మాత్రం ఉంటుంది. భారీ వర్షాలు కురవవచ్చు. వాటివల్ల జన జీవనం అస్తవ్యస్థం కావొచ్చు. తుపాను తీరం దాటేటపుడు విధ్వంసాన్ని ఇవి సృష్టించలేవు. వరదల ప్రమాదం ఉండవచ్చు.