శేషాచలం అడవిలో ‘బావికాడ లైను’ ను చేరుకోవడం గొప్ప అనుభవం!

ఏరులన్నీ కలిస్తేనే అడవి మధ్యలో ‘బావికాడ లైను’!

Update: 2025-12-15 09:58 GMT

అడవి మధ్యలో వెల్లివిరిసిన ఆనందం. పిల్లలు పెద్దలన్న తేడా లేదు, స్త్రీ పురుష భేదమూ లేదు. ప్రవహిస్తున్న ఏటి మధ్యలో ఎన్ని సంతోషాలు! ఎన్ని కేరింతలు! ఎన్ని తుళ్ళింతలు! శేషాచలం కొండల్లోని ఏరులన్నీ కలిసి ప్రవహిస్తున్న ‘బావికాడ లైను’.

మూడు దశాబ్దాలుగా శేషాచలం కొండలన్నీ తిరిగిన వాణ్ణి. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్టు, తిరుపతికి సమీపంలోనే ఉన్న ‘బావికాడ లైను’ను ఇంతమటుకు చూడకపోవడమేమిటి!? పోనీలే, ఇప్పటికైనా చూడగలుగుతున్నానని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. అటవీ శాఖ ఆంక్షల వల్ల కొన్ని నెలలుగా అడవి తల్లి మాకు దూరమైపోయింది. కాదు, మేమే దూరమైపోయాం.

అనేక ఏర్లు కలిసి ప్రవహిస్తున్న 'బావికాడి లైను

ఆదివారం పొద్దునే మధు ఫోన్ చేసి ‘‘మామండూరు అటవీ శాఖ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న చిన్న ట్రెక్ కు బయలుదేరుదామా.?’’ అన్నాడు. అడవికి వెళ్ళడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా, సర్వకాల సర్వావస్తల యందు సిద్ధంగా ఉంటారు మా తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ సభ్యులు.

తిరుపతి నుంచి స్కూటర్లలో బయలు దేరాం. నేను, మధు, మధు కొడుకు సాగర్, శివారెడ్డి, శివారెడ్డి కొడుకు, శ్రీహరి, శ్రీహరి పిల్లలు, భరత్, రవి, రవి పిల్లలు, ఆర్యా, కార్తీక్, కర్తీక్ ఆఫీసులో పనిచేసే మరొకరు ; అంతా కలిసి బొంతాలమ్మ గుడి వద్దకు చేరాం. పరీక్షలని భరత్ కొడుకు అహన్ గైర్హాజరు.

బొంతాలమ్మ గుడిదగ్గర నుంచి ఉదయం తొమ్మిదిన్నరకు మా స్కూటర్లు, మోటారు బైకులు కదిలాయి. కోడూరు దారిలో హైవేపై వెళుతున్నాం. దాదాపు 22 కిలోమీటర్లు దాటాక కుడి వైపున మామండూరు గెస్ట్ హౌస్ ఆర్చికి ఉన్న బోర్డు కనిపించింది. అక్కడి నుంచి మట్టి రోడ్డులోనే కిలో మీటరు సాగాం. ఆదివారం, వారాంతపు సెలవు. అప్పటికే అక్కడ చాలా మంది వచ్చారు. కొందరు తిరుగు ప్రయాణమై, మాకు ఎదురు పడ్డారు.

మామండూరు గెస్ట్ హౌస్ కు పెద్ద చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన పులులను వేటాడడానికి బ్రిటన్ కు చెందిన కెన్నెత్ అండర్సన్ వచ్చి, ఈ గెస్ట్ హౌస్ లోనే బసచేశాడు. ఈ గెస్ట్ హౌస్ నుంచి కుడివైపునకు వెళితే గుంటి మడుగు వస్తుంది. గెస్ట్ హౌస్ వెనుక నుంచి ‘బాయికాడ లైన్’ వస్తుంది.

బావికాడలైను కు వెళ్ళే దారి

అటవీ అధికారులు గుంటిమడుగులో ఉన్నారు. అడవి జంతువులను లెక్కపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో గుంటి మడుగు చూశాం. నేను చూడని ‘బాయికాడ లైన్’ కు బయలు దేరాం. గెస్ట్ హౌస్ వెనుక నుంచి అడవిలో నడక. ఇరువైపులా దట్టమైన అడవి. మధ్యలో నడక దారి. ఎత్తు నుంచిపల్లానికి నడుస్తున్నాం.

దారికి ఇరువైపులా దట్టంగా పెరిగిన వెదురుపొదలు. వెదురుపొదల మధ్య నుంచి వెళుతున్నాం. ఆకాశం కనపడకుండా వెదురు పొదలు కమ్మేశాయి. ఆ పొదల మధ్యనుంచి వీస్తున్న గాలికి వింత వింత శబ్దాలు. మాతో పాటు చాలా మంది నడుస్తున్నారు. దారికి అడ్డంగా ఏరు వచ్చింది. ఎడమ నుంచి కుడికి ప్రవహిస్తోంది.

అడివిలో వెదురు పొదల మధ్య నుంచి..

ఏటిలో అంతా గులకరాళ్ళు. గులకరాళ్ళ పైనుంచి అడుగు ఎత్తులో ప్రవహిస్తున్న ఏటిని నడుస్తూ దాటాం. నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో! నీటిలో గులకరాళ్ళ పై నుంచి నడుస్తున్నా ఏ మాత్రం బురదకావడం లేదు. ఎండ ఏ మాత్రం పడడం లేదు. మరి కాస్త దూరం వెళ్ళగానే అదే ఏరు మెలికలు తిరిగి, మా దారికి అడ్డంగా ప్రవహిస్తోంది. ఇక్కడ కాస్త లోతున్నట్టుంది. వెదుర్లతో అడ్డంగా వంతెలాగా కట్టారు. వాటి పైనుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళుతున్నాం.

ఆ వెదురు పొదల మధ్య నుంచే దాదాపు అరగంట పైగా నడిచాం. అడివిలో అలా నడుస్తుంటే ఎంత ఆనందంగా ఉందో! కుడి వైపున ఏరు ప్రవహిస్తోంది. ఒకరొకరుగా ఏటిలోకి దిగుతున్నాం. ముందుకు సాగుతున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ జనం ఏటిలోకి దిగుతున్నారు. మనం పైకి వెళదాం అన్నాడు మధు. మరి కాస్త దూరం నడిచి, కుడి వైపున ఏటి ఒడ్డున నిలిచి అన్ని వైపులా తేరిపారచూశాం.

ఏటికి ఈవల అడవి ఎంత దట్టంగా పెరిగిందో, ఏటికి ఆవల వైపు కూడా అంతే దట్టంగా పెరిగింది. మధ్యలో ఏరు సన్నని రొద చేస్తో ప్రవహిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన గులకరాళ్ళు నునుపు తేలాయి. పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తున్న ఆ ఏరు ఎన్ని మెలికలు తిరిగిందో ! ఎన్ని హొయలు పోతోందో!

ప్రవహిస్తున్న నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి! శేషాచలం కొండలనుంచి వచ్చిన ప్రవాహం ఇది. కుమారధార, పసుపు ధార, శక్తికటారి, తాంత్రికలోయ,రామకృష్ణ తీర్థం, తుంబురు తీర్థం మీదుగా వచ్చిన ఒక నీటి పాయ ఇందులో కలుస్తుంది. అలాగే జ్వరహార తీర్థం, కాయరసాయన తీర్థం, మలయప్ప కోన,మలయప్ప తీర్థం, అక్కగార్ల గుండాల నుంచి వచ్చిన నీటి పాయ తుంబురు వద్ద కలుస్తుంది. అలాగే మామండూరు నుంచి తుబురు వెళ్ళే దారిలో కనిపించే బండిరుసు నుంచి వచ్చిన నీటి పాయ కూడా చేరుతుంది.

మూడు దిక్కుల నుంచి వచ్చే నీటి పాయలు కలిసి ఏరులా వచ్చే ప్రవాహమే ‘బావికాడ లైను’. ఈ బావి కాడ లైను అనేక మెలికలు తిరిగి గుంటిమడుగులో కలుస్తుంది. అక్కడి నుంచి స్వర్ణముఖిలో కలిసి, అక్కడి నుంచి బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఈఏడాది వర్షాలు బాగా పడ్డాయి కనుక, ఏరు కూడా నిండుగా ప్రవహిస్తోంది.

'బావి కాడ లై ను' ఏరు లో ప్రకృతి ప్రేమికుల జలకాలాట లు.

ఒకరొకరు నీళ్ళలోకి దిగుతున్నా రు. పెద్దగా లోతు లేదు. ఒక్కొక్క చోట అయిదడుగుల లోతు వరకు ఉంది. నీటి ప్రవాహం మాత్రం వేగంగా సాగుతోంది. నీటి మధ్యలోకి వెళితే మనల్ని ఈడ్చుకుపోతోంది. పైకి పెద్దగా కనిపించడం లేదు కానీ, ప్రవాహ వేగం ఎక్కువగా ఉంది.

ప్రవాహానికి పై వేపు వెళ్ళి, నీటిపైన వెల్లకిలా పడుకుంటే చాలు, తెప్ప తేలినట్టు శరీరం అలల్లాగా సాగిపోతోంది. ఈత కొట్టాల్సిన అవసరమే లేదు. ఆప్రవాహమే మనల్ని లాక్కుపోతోంది. కాళ్ళు కింద పెడితే నేలకు తాకుతాయి. కాళ్ళను కింద పెట్టనిస్తే కదా ఆ ప్రవాహం! ఒడ్డు వైపునకు వెళుతూ కాళ్ళు నేలకు ఆనిస్తే తప్ప , ఆ ప్రవాహంలో శరీరం ఆగేలా లేదు.

 అవధులు లేని పిల్లల ఆనందం.

ప్రవహిస్తున్న ఏటిపై వెల్లకిలా పడుకుని సాగుతున్నప్పుడు, నీలాకాశంలో మెల్లగా కదులుతున్న మేఘాలు, అక్కడొక పక్షి, అక్కడొక పక్షి రెక్కలల్లారుస్తూ సాగిపోతున్న వైనం. అవి ఆకాశంలో, మనం నీటిపైన ఒకే సారి ఇలా..ఓహ్.. ఎంత వింతైన అనుభూతి!

గాలి నింపిన ట్యూబులపైన పడుకొని కొందరు, లైఫ్ జాకెట్లు వేసుకుని మరి కొందరు. ఏటి ఒడ్డున పై వరకు నడుచుకుంటూ వెళ్ళడం, అక్కడి నుంచి నీటి పై తేలాడుతూ ఇలా కిందకు రావడం. ఏటి పై వాలిన కొమ్మలు పట్టుకుని, నీటి ప్రవాహంలోకి వేలాడుతున్న పిల్లలు. ఒడ్డున బండపైనుంచి ప్రవహిస్తున్న ఏటి లోకి డై కొడుతున్న సాగర్ లాంటి పిల్లలు ఆనందం!

చెట్టు కొమ్మలు పట్టుకుని ప్రవాహం లో వేలాడుతూ..

ఏటి ఒడ్డున నడవకుండా, ఏటిలోనే ప్రవాహానికి ఎదురుగా ఈదుకుంటూ వెళితే ఎలా ఉంటుంది? ప్రయత్నించాను. నేనే కాదు, చాలా మంది ప్రయత్నించారు. శక్తినంతా కూడగట్టి ఏటికి ఎదురుగా ఈదుతున్నాం, అలిసిపోతున్నాం కానీ, ప్రవాహానికి ఎదురుగా అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఒక్క సాగర్ తప్ప.

కీలుగుర్రం సినిమా షూటింగ్ లా ఉంది మా పరిస్థితి. నేను పుట్టకముందు నాటి మాట ఇది. కీలు గుర్రం సినిమా షూటింగ్ ఎలా ఉందో, తరువాత ఒక రీల్ లో చూపించారు. నాగేశ్వరరావు గుర్రం ఎక్కి, సాహసోపేతంగా సాగుతున్న ధృశ్యాన్ని దగ్గరగా చూపిస్తున్నాడు కెమెరామెన్. నాగేశ్వరరావు గుర్రపు స్వారీ చేస్తూ అలసిపోతున్నాడు. కెమెరాను కా స్త దూరంగా చూపిస్తే, గుర్రం కదలడం లేదు. నాగేశ్వరరావు మాత్రం స్వారీ చేస్తున్నట్టు అలసిపోతున్నాడు. అలా ఉంది మా పరిస్థితి.

కాంక్రీటు వనంలో రణగొణ ధ్వనుల మధ్య, రోజువారి టెన్షన్ జీవితంతో విసిగెత్తిపోయిన ప్రజలు కాస్త ఆటవిడుపు కోసం ఆదివారం ఇలా అడవికి వచ్చారు. వాళ్ళు చేసే అల్లరి ఇంతా అంతా కాదు. వారి ఆనందం చూస్తుంటే, నగర జీవితాల్లో ఎంతగా ఒత్తిడికి గురవుతున్నారో తెలుస్తోంది.

రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదన్నట్టు, కొందరు ఒక బృందంగా చిన్న మైకు పెట్టుకుని ‘‘జై బాలయ్యా..జైజై బాలయ్యా..’’ అంటూ నినాదాలు చేసుకుంటూ ఏటిలోకి వచ్చేస్తున్నారు. వారి అరుపులు అల్లరి ఎక్కువైపోయింది. పిల్లల అరుపులు, పెద్దల తుళ్ళింతలు, సరదా కబుర్లు ఎన్ని ఉన్నా ఇబ్బంది కలగ లేదు. మైకుల్లో నినాదాలు చేయడం ఎంత శబ్దకాలుష్యం!

నిండుగా ప్రవహిస్తున్న ' బావి కాడ లై ను'

నగర కాలుష్యానికి దూరంగా అడివికి వస్తే, ఇక్కడ కూడా ఈ శబ్ద కాలుష్యం ఏమిటి!? మధ్యాహ్నం ఒంటిగంటన్నర దాటుతోంది. తిరుగు ప్రయాణమయ్యాం. మళ్ళీ దట్టమైన ఆ వెదురు పొదల మధ్య నుంచి మామండూరు అటవీ గెస్ట్ హౌస్ కు చేరాం. అప్పటికే చాలా వాహనాలు వచ్చి చేరాయి. వారాంతంలోనే ఈ రద్దీ. మిగతా రోజుల్లో ఇంత రద్దీ ఉండదు. ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ‘బావికాడ లైను’ పేరు ఎలా ఉన్నా, దాన్ని చూసిన అనుభూతి మాత్రం మహా గొప్పగా ఉంది.

Tags:    

Similar News