జీతంలేని ఉద్యోగం!

మండే కవిత: డాక్టర్ మల్లంగి గోపీకృష్ణ

Update: 2025-12-08 03:45 GMT

చాకిరీతో అలిసిపోయి

జీవితంలో అవిసిపోయిన
ఓ మధ్యతరగతి గృహిణి
వాళ్ళాయనతో అంది....
"కడుపునింపిన వంటపనికీ
తీర్చిదిద్దిన ఇంటిపనికి..
పిల్లల్ని పెంచి పెద్దచేసినదానికి
టీచరై చదువు చెప్పినదానికి
కఠినమైన వార్డన్‌లా వాళ్ళను క్రమశిక్షణలో ఉంచినదానికి..
అత్తమామలను చూసుకొన్నదానికి
బంధువర్గాన్ని ఆదరించినదానికి..
అప్పులపాలు కాకుండా
ఇంటిని నెట్టుకొచ్చినదానికి
ఆర్థికమంత్రిత్వ శాఖను
అవలీలగా నిర్వహించినదానికి..
పండగలు పబ్బాల సమయంలో
ఈవెంట్ మ్యానేజ్ చేసినదానికి
పిల్లల పుట్టినరోజులు
ఒంటిచేత్తో సెలబ్రేట్ చేసినదానికి..
జబ్బుపడిన ప్రతీసారీ
నర్సుగా సేవలందించినదానికి
నిద్రాహారాలు మానుకొని
సమయానికి మందులేసినదానికి..
జీతం నాకు మీరు చెల్లించాలి
ఎంత ఇచ్చినా సరిపోదని
మీరు తప్పక తెలుసుకోవాలి"
ఇలాఅని నేటి గృహిణులనడం
వాళ్ళ విలువ వాళ్ళకే తెలియక
అమాయకత్వంతో తగ్గించుకోవడం!
ఎందుకంటే...
ఆవిలువను డబ్బుతో మనం
ఎలాగోలా లెక్కలేసి వెలకట్టగలం!
తల తాకట్టు పెట్టయినాసరే
ఆఉద్యోగాలకు జీతమన్నది ఇవ్వగలం!
కానీ...
ఈ ఇల్లు నాది
ఈ కుటుంబం నాది
అని అనుకొనే గృహిణులకు..
వారి అగణిత త్యాగాలకు
వారుచూపే ప్రేమాభిమానాలకు..
వంట చేయడంతో ఆపకుండా
ప్రేమతో కొసరి వడ్డించినందుకు..
గెలిచినప్పుడు భుజంతట్టడమేకాక
ఓడినప్పుడు ఓదార్చినందుకు..
జబ్బుపడితే మందులివ్వడమేకాక
ప్రేమతో‌ కన్నీళ్ళు పెట్టుకొన్నందుకు..
ఆఫీసునుంచితెచ్చిన మన ఫ్రస్టేషన్ని
ప్రశాంతంగా సహించినందుకు..
భూదేవంత అనంతమైన ఓపికతో
కుటుంబాన్ని నిలబెట్టినందుకు..
కష్టకాలంలో వెన్నుదన్నుగా
కుటుంబానికై నిలబడినందుకు..
కొంగుతో కన్నీళ్ళు తుడిచి
నేనున్నాని ఓదార్చినందుకు..
సంతోషాలలో భుజంతట్టి
స్నేహితురాలై ప్రోత్సహించినందుకు..
సంసార సమస్యల వలయంలో
సైనికురాలై పోరాడినందుకు..
మనం ఏమాత్రం వెలకట్టలేము
ఆ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేము
బరువెక్కిన హృదయంతో
చేతులెత్తి తనకు మొక్కగలం!
ఎప్పటికీ ఋణపడిపోయి
కృతజ్ఞత మాత్రమే చూపించగలం!
తన అవధుల్లేని త్యాగాలకు
ఆర్తినిండిన అశృనయనాలతో
అంజలి తప్పక ఘటించగలం!
తీర్చుకోలేని తన ఋణభారాన్ని
ప్రేమ ఆప్యాయతలు అందించి
కాస్తైనా మదిలోంచి దింపుకోగలం!
అందుకే...
ఆడ‌వాళ్ళూ మీకు నా జోహార్లు!
నారీమణులూ మీకు నా నీరాజనాలు!
అంతులేని మీ త్యాగాలకు
అపురూపమైన మీ సహనానికి
మగాళ్ళందరి తరపున
శతసహస్ర‌కోటి నమస్సుమాంజలులు!



Tags:    

Similar News