గురజాడ అంటే వీళ్లకెందుకు అంత దడ?

గురజాడ అప్పారావు ఒక శాస్త్రీయమైన, మానవీయమైన, ప్రజాస్వామిక భారతీయ సమాజాన్ని ఆపేక్షించారు. సామాజికం ఏర్పడే దాకా ఆయన మనకు అవసరమౌతారు.

Update: 2025-12-01 05:59 GMT
మహాకవి గురజాడ అప్పారావు
(రాచపాళెం చంద్రశేఖరరెడ్డి)
ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతల్లో అగ్రగామి గురజాడ అప్పారావు. ఆయన 110 వ జయంతి నిన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. గురజాడ 1915 లో మరణించినా ఆయన ఆతర్వాతనే జీవిస్తున్నారు అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన మాట నూటికి నూరు పాళ్ళు నిజమవుతున్నది. గత 110 ఏళ్ళలో ఎంతోమంది ఆయన స్థాయిని తగ్గించడానికి ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ వెల్లకిలా పడుకొని ఎంగిలి ఊయడంగానే మిగిలిపోయాయి. కారణం ఏమిటంటే గురజాడ తన కాలం కన్నా చాలా ముందుండడం. మనం ఆయనను ఇప్పటికీ అందుకోలేకపోవడం. ఇద్దరు వ్యక్తులు వీథిలో నడిచి పోతుంటారు. ఒకడు వేగంగా నడుస్తుంటాడు. ఒకడు వెనుకబడి పోతాడు. రెండోవాడు మొదటి వాడిని కలుసుకోలేక, అతనిని తిట్టడం మొదలుపెడతాడు. గురజాడను తిట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు. గురజాడ కవే కాదన్నారు. ఆయన బాలకవి అన్నారు. కన్యాశుల్కం నాటకం ఆయన రాయనేలేదన్నారు. అది నాటకమే కాదన్నారు. నాటకంలో చాలా లోపాలున్నాయన్నారు. ఆయన బ్రాహ్మణులలో వైదికులను ఎగతాళి చేశారన్నారు. కన్యాశుల్కం నాటకం బ్రాహ్మణుల నాటకం అన్నారు. ఆ నాటకంలో ఏ సమస్యకూ పరిష్కారం చెప్పలేదన్నారు. గురజాడకు దళితుల మంచితనం మీద నమ్మకం లేదన్నారు. ఆయన దేశభక్తి కవిత్వంలో ఏదేశం ఉంది? అన్నారు. గురజాడ సంస్కృతి విధ్వంసకుడన్నారు. గురజాడ పిరికివాడన్నారు. ఆ మాట అనడానికి దొంగ పేర్లు పెట్టుకున్నారు. అయితే గురజాడను వ్యతిరేకించినవాళ్ళ ఆరోపణలన్నీ పిల్లిమొగ్గలుగానే మిగిలిపోయాయి. తాటాకు చప్పుళ్ళుగానే రుజువయ్యాయి. ప్రజలు ఆయన సాహిత్యం చదువుతున్నారు. స్ఫూర్తి పొందుతున్నారు.

53 ఏళ్ళ జీవితంలో మూడు దశాబ్దాలలో,1882_1912 మధ్య గురజాడ రాసిందంతా 1600 పేజీలే. అందులో 5 కథలు, 3 నాటకాలు, వాటిలో 2 అసంపూర్ణాలు, 12 కవితలు, డైరీ రాతలూ, లేఖలూ, సమీక్షలూ వంటివి అనేకరకాల రచనలు ఉన్నాయి. ఆయన సమకాలికులు, తర్వాతి తరం వారు రెండింతలు, మూడింతలు పేజీలు రాసినవారున్నారు. వాళ్ళ మధ్య గురజాడ విజయకేతనంగా నిలిచారు.
ఏమిటి ఇందుకు కారణం?
కారణమేమంటే రచయితగా గురజాడ ముందుచూపు. నిశితమైన ఆయన వ్యాఖ్యాన శక్తి. రాచమల్లు రామచంద్రారెడ్డి గురజాడ అభిప్రాయాలు 21 వ శతాబ్దానివి అన్నారు. ఇప్పుడున్న మన జాతీయ వాతావరణం చూస్తుంటే గురజాడ 22వ శతాబ్దానికి కూడా అవసరమౌతారనిపిస్తున్నది.
1910 లోనే గురజాడ మనిషి కవిత రాసి చరిత్ర నిర్మాత మానవుడే అని చాటి చెప్పారు. మనిషి మనుగడ సాటి మనిషి మీదనే ఆధారపడి ఉందన్నారు. కానీ మానవేతర కత్తుల ఆరాధనలో దేశం మునిగిపోతూ ఉంది. పాలకులు మునుగుతున్నారు, ప్రజల్ని ముంచుతున్నారు. ప్రచారకులకు రాచమర్యాదలు చేస్తున్నారు.
తోకచుక్క కనిపించడం వంటి ప్రకృతి పరిణామాలను చూచి భయపడవలసిన అవసరం లేదనీ, తోకచుక్క మనకు దూరపుబంధువనీ, మనల్ని చూచి పోవడానికి 78 ఏళ్ళకు ఒకసారి వస్తుందనీ అన్నారు. పైగా దానిని సంఘసంస్కరణ పతాకగా భావిస్తానన్నారు. కానీ మనం ఇంకా ప్రకృతిలో సహజంగా జరిగే వాటిని చూసి జడుసుకుంటున్నాం. గ్రహణాలను భయపడి తలుపులు మూసేసుకుంటున్నాం. దేశభక్తి అంటే భౌగోళికసరిహద్దులపట్ల భక్తి కాదనీ, భౌగోళిక సరిహద్దులకు లోపల ఉన్న. మనుషులపట్ల గౌరవమని ప్రకటించారు గురజాడ. కానీ మనం ఇప్పటీకీ మనిషిని మనిషిగా గుర్తించడం లేదు. అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ములు లాగా కలిసిమెలిసి బతకాలన్నారు. కానీ మనం కులమతాలు ప్రాతిపదిక మీద కొట్లాడుకుంటున్నాం. మానవ ద్వేషం జీవితం తత్వం అయిపోతున్నది. మానవ ప్రేమను గురజాడ బోధిస్తే, మానవద్వేషం ఆధిపత్యం వహిస్తున్నది.
మహిళల్ని మొగవాళ్ళ తో సమానంగా, స్నేహితులుగా చూడమన్నారు గురజాడ. ఇప్పటికీ తొంభై అయిదు శాతం మందికి అది సాధ్యం కాలేదు. స్త్రీలను బలవంతంగా లొంగదీసుకోకండి అని చెప్పారు. ఇప్పటికీ ప్రేమ పేరుతో స్త్రీల మీద మొగాళ్ళు దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు. చంపుతున్నారు. యాసిడ్లు చల్లుతున్నారు. స్త్రీపురుషులు బంధాలలో ధనం ప్రమేయం ఉండకూడదన్నారు. ఇప్పుడు ఆ డబ్బే మానవసంబంధాను నిర్ణయిస్తున్నది. డబ్బు ముందు మనిషి మరుగుజ్జయిపోయాడు. కులవ్యవస్థ దుర్మార్గమైనది, దానిని కులాంతర వివాహాల ద్వారా నిర్మూలించండి అని గురజాడ పిలుపునిచ్చారు. ఎన్ని ఉద్యమాలు వచ్చినా కులం గట్టిపడుతున్నది గానీ, కరగడం లేదు. కులాల కుమ్ములాటలు, మతాల మారణకాండ నిత్యరుతువులయిపోయాయి. అస్పృశ్యతను ఆయన గర్హించారు. దళితులు కనిపిస్తే ఆలింగనం చేసుకోమన్నారు. మలినేని మాల? అని ప్రశ్నించారు. మన సమాజంలో దళితులు మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.
గురజాడ అప్పారావు ఒక శాస్త్రీయమైన, మానవీయమైన, ప్రజాస్వామిక భారతీయ సమాజాన్ని అపేక్షించారు. సామాజికం ఏర్పడే దాకా ఆయన మనకు అవసరమౌతారు.
(వ్యాస రచయిత- ప్రముఖ కవి, సాహితీవేత్త, అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు)
Tags:    

Similar News