దైవం మెచ్చని పూజ!

నేటి మేటి కవిత: డాక్టర్ ఎం గోపీకృష్ణ

Update: 2025-11-24 03:13 GMT
జాతీయ రహదారుల మీద ప్రమాదాలు

ప్రాణంతీసే పని ఏదైనా

పరమాత్మకు నచ్చదు..
ద్వేషం నిండిన మనసులో
భక్తి పుష్పం వికసించదు..
రక్తం చిందిన రహదారుల్లో
శాంతిరథం పయనించదు..
హింసాపూరిత హృదయాలకు
స్వర్గ ప్రవేశం దొరకదు..
ఎంతకాలమని దేవుడిపేరుపై
మనుషుల్ని చంపుకొందాము!
ఎన్ని యుగాలని మతంపేరుతో
మారణహోమం కొనసాగిద్దాము!
జ్ఞానానివ్వాల్సిన మతం
అజ్ఞానంలోకి నడిపించరాదు..
వెలుగు ప్రసాదించాల్సిన దైవం
చీకటిలోకి నెట్టేయరాదు..
హింసనిండిన దారులలో నడిస్తే
పరలోకం చేరువవ్వదు..
అమాయకుల ప్రాణంతీయడం
నిజమైనమతం నేర్పించదు..
ఎన్నిరోజులని హింసాద్వేషాలు
దైవానికి అంటకడదాము!
ఎన్నితరాలు ఆరనిమంటలతో
భవిషత్తుని కాల్చుకొందాము!
కాలుతున్న శవాల వాసన
తడుపుతూన్న రక్తపు జిగట
కళ్ళలోని ద్వేషపు చీకటి
ఎన్నాళ్ళని మనం భరిద్దాము?
నెత్తురులో తడిసిన చేతులు
హింసతో ఎరుపెక్కిన కళ్ళు
అమాయకుల వెంటాడే కాళ్ళు
ఎంతకాలం ఇంకా సహిద్దాము?
ఏపాపమెరగని స్కూలుపిల్లలు
నాన్నమందులు తీసుకెళ్ళేకొడుకు
డ్యూటీలోని ట్రాఫిక్ కానిస్టేబులు
ఏతప్పు చేసారని బలయ్యారు?
దేశంకోసం నిలబడ్డ జవాను
ప్రజలకోసం ప్రాణమిచ్చిన పోలీసు
నిన్నూ నన్నూ కాపాడే కమెండో
ఎన్నాళ్ళని ఇలా ప్రాణమిస్తారు?
మీరూ ఆలోచించండి...
మండే మది సింహాసనాన్ని
దైవమెలా అధిరోహిస్తాడు?
మనిషినిచంపే వారెవరైనా
దేవుడిని ఎలాచేరుకోగలరు?
హింసాద్వేషాల హృదయాన్ని
పరమాత్మ ఎలా స్వీకరిస్తాడు!
ప్రేమతో సృష్టించిన పుడమిని
నరకంచేస్తే తనెలా క్షమిస్తాడు!
ఔను నిజం...
ఈర్షాద్వేషాలతో చెదలుపట్టిన
చరిత్ర ఇప్పటికీ మారలేదు!
ప్రేమ సహనంలేని ఏసమాజం
కలకాలం ఇలపై మనలేదు!
సహనాన్నివ్వని చదువు
పైసాకైనా పనికిరాదు!
అనాగరిక మనస్తత్వంతో
ప్రపంచం చాన్నాళ్ళు ఉండబోదు!
నిజం చెప్పాలంటే...
మతమన్నది మనిషిని
సన్మార్గంలో నడిపించేందుకు
సమాజంచేసే ప్రయత్నం!
అది మరిచిననాడు
అసలు మతమెందుకు
అది వదిలెయ్యాల్సిన వ్యర్థం!
దేవుడికి నచ్చనిపూజ
మతం చెప్పిందని చెయ్యడం
ఎంత భావ్యమన్నది ప్రశ్నార్థకం!

.........డాక్టర్ గోపికృష్ణ
అమృత హాస్పటల్
మదనపల్లె


Tags:    

Similar News