కలెక్టర్ల పెళ్లికి దండలు కూడా లేవా!

ఇంత నిరాడంబరంగా పెళ్లేమిటండీ! కడప అమ్మాయి, మీర్జాపూర్ అబ్బాయి.. ఇద్దరూ ఐఏఎస్సేలే..

Update: 2025-11-22 07:48 GMT
పెళ్లి పీటలెక్కిన ఐఎఎస్ లు ఆదిత్య వర్మ, శ్రీపూజ
వెలుగు జిలుగులు లేవు, ముఖ్యమంత్రి, మంత్రి వంటి పెద్దొళ్ల హడావిడి లేదు. బడాబడా పెళ్లి మండపాల్లేవు, పూలమండపాలు లేవు. డిజైనింగ్ అలంకరణలు లేవు… కోట్లు లేవు, సూట్లు లేవు.. అంతా ఓ సాదాసీదాగా.. తూతూమంత్రంగా జరిగిపోయింది ఆ పెళ్లి.

తల్లిదండ్రులతో ఆదిత్య వర్మ 

వాళ్లేమైనా చిన్నా చితకావాళ్ల అంటే అదేమీ కాదు.. ఇద్దరూ ఐఎఎస్ లే.. ఒక్కో జిల్లాను ఏలుతున్న వారే. అలాంటి వాళ్ల పెళ్లంటే ఎలా జరుగుతుందనుకుంటాం. ధూం ధాం గా జరుగుతుందనుకుంటాం కదా.. అలా ఏమీ లేకుండా అతి నిరాడంబరంగా జరిగింది. ఆ ఇద్దరే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి, ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, మేఘాలయ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఆదిత్యవర్మ.
జనం మెప్పు కోసం ఎదుటోడు తొడకోసుకుంటే మనం మెడకోసుకోవాలనే ఈ రోజుల్లో ఈ ఐఎఎస్ లు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. పది మందికి ఆదర్శంగా నిలిచారు.
వాళ్ల కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈపెళ్లి వేడుక జరిగింది. శుక్రవారం విశాఖపట్నంలోని సూపర్‌ బజార్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి భోజనాలు చేశారు.
విశాఖపట్నంలోని సూపర్ బజార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలుపల కూడా ఎటువంటి హడావిడి కనిపించలేదు. కనీసం పూలదండలు కూడ కనిపించలేదు. ఎస్కార్ట్ వాహనాల మోత కూడా వినబడలేదు.

ఇదో అసాధారణ ప్రేమ కథ. ఐఎఎస్ లు చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పోస్టింగులు వచ్చాక ఇలా తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఒకటయ్యారు.
ఎవరీ తిరుమణి శ్రీపూజ, ఈ ఆదిత్య వర్మ..
తిరుమణి శ్రీపూజ – సేవలో సున్నితత్వం, పనిలో కఠినత్వం. రాష్ట్రంలో అతిపెద్ద సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థకి (ఐటీడీఏ) ప్రాజెక్ట్‌ అధికారిణి. ఐఏఎస్‌ శిక్షణ పూర్తయ్యాక మూడు ఎంపికలలో తాను మొదటగా కోరుకున్న పదవి ఐటీడీఏ పీఓ. అదీ పాడేరులో.
శ్రీపూజ కడప జిల్లా వాసి. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు. పంచాయతీ కార్యదర్శి. ఉద్యోగరీత్యా భీమవరంలో స్థిరపడ్డారు. తల్లి రాజేశ్వరి గృహిణి. చిన్ననాటి చదువు కడపలో సాగింది. తర్వాత బెంగళూరులో ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ చేశారు. 2020లో మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా విజయం రాలేదు. కానీ తండ్రి ఆశయాన్ని సాకారం చేయాలనే పట్టుదలతో రెండోసారి 2021లో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు. అప్పటికి బీటెక్‌ను కూడా పూర్తి చేశారు.
ఐఎఎస్ శ్రీపూజకు పుస్తకాలు చదవడం అంటే మక్కువ. యువల్ హరారీ రాసిన ‘Sapiens’, ఖలీద్ హుసైనీ రాసిన ‘A Thousand Splendid Suns’ పుస్తకాలు తనకు బాగా నచ్చాయని చెప్పారు. కోపం, అసూయ, ద్వేషం లాంటివి దూరం పెట్టుకుని సంతోషంగా జీవించడం జీవితంలోని అసలైన ఆనందమని ఆమె అభిప్రాయపడ్డారు.

గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి రంగాల్లో అమలు చేస్తున్న పథకాలలో ఆమె పనిచేసే తీరు ప్రశంసలు అందుకుంటోంది.
ఇక, ఆదిత్య వర్మ. మేఘాలయ కేడర్‌కు చెందిన ప్రామిసింగ్ అధికారి. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ లో పుట్టిపెరిగారు. తండ్రి పోలీసు అధికారి. తల్లి గృహిణి. మేఘాలయ క్యాడర్ ఐఎఎస్. అడ్మినిస్ట్రేషన్‌లో సూటితనం, డెసిషన్ మేకింగ్‌లో ప్రాక్టికాలిటీ ఉండే అధికారిగా సహచరులు చెబుతారు.
1998 ఏప్రిల్ 30న జన్మించారు. తండ్రి సంజయ్ వర్మ మీర్జాపూర్ ఏఎస్పీ. తల్లిదండ్రుల ప్రోత్సాం, కుటుంబ నేపథ్యంతో ఆయన ఐఎఎస్ అయ్యారు. ఆదిత్య వర్మ తన ప్రాథమిక విద్యను లక్నో ప్రైమరీ స్కూల్లో పూర్తిచేశారు. IIT ఢిల్లీలో ఇంజినీరింగ్ ఫిజిక్స్లో B.Tech పూర్తి చేశారు.
ఈ కాలంలో అభివృద్ధి చెందిన విశ్లేషణా నైపుణ్యం, అకడమిక్ బలమూ UPSC సిద్ధతలో ఎంతో సహాయపడాయి. ఆయన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా సేవలు ప్రారంభించారు.
ఇప్పడీ జంట పెళ్లి అందరి నోళ్లలో చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News