సీతాకోకచిలుకలు పూచే కాలం -

వనజ తాతినేని నేటి మేటి కవిత

Update: 2025-11-13 03:32 GMT

ఉదయం నీరెండ ఏటవాలుగా ఆకుపచ్చని తోటపై వాలి

నారింజ కలగలిసిన పసుపు రంగు రశ్మి అయింది.

సీతాకోకచిలుకలు ఎగిరే కాలం కోసం నా ఎదురుచూపు

గ్రహణం నను పూర్తిగా మింగేసిన సమయంలో నుండి

వెలుగులోకి మునిగి తేలియాడుతూన్న కాలం అది.

ఈ వేళ నా బాల్కనీ తోటంతా కలిపి ఒక పువ్వే పూసింది

హఠాత్తుగా నాలుగు రెక్కల పువ్వులు నాలుగైదు

గాలికి ఊగుతున్నట్టున్నాయనిపించింది

కళ్ళు నులుముకుని చూస్తాన్నేను.

అవి పూల రెక్కల సీతాకోకచిలుకలు

నా హృదయం కూడా రెక్కలు తొడిగింది.

ఆకురాలు కాలంలో వృక్షాలు నీటి అద్దంలో

తమ రంగులను తామే చూసుకుని విభ్రాంతి చెందినట్టు

పూలపై వాలిన సీతాకోకచిలుకుల అందానికి మూర్చిల్లుతాను.

నిద్రమత్తు వదిలించుకుని పూల అందాలను వీక్షిస్తూ

తమను తాము వెచ్చ బరుచుకుంటూ జంటగా ఒంటరిగా

నిదానంగా కదులుతుంటాయి సీతాకోకచిలుకలు. వాటి వెనుకే నేనూ.

గృహిణులు పగటి పనంతా ముగించుకుని అలసి

ఏ పుస్తకం పైనో మొబైల్ స్క్రీన్ పైనో వాలే సమయంలో

నేను వాలిపోబోతాను ఎక్కడో..

సీతాకోకచిలుకలు సంచరించే తావుల కోసం

జల్లెడ పడతాను, మనః ఫలకంపై ముద్రిస్తాను.

రోజ్మేరీ పూలపై వాలే తెల్ల జంట సీతాకోక చిలుకలు,

జినియా పూలు బంతిపూలపై వాలే మోనార్క్ సీతాకోకచిలుకలు

లాంటానా గుత్తులుపై వాలే నల్ల సీతాకోకచిలుకలు

నిశ్శబ్దంగా మకరందాన్ని ఆస్వాదిస్తూ.

గ్లాస్ సీతాకోకచిలుకలు పసుపుపచ్చని సీతాకోకచిలుకలు

తుమ్మెద రెక్కల సీతాకోకచిలుకలు రెక్కలపై కళ్ళు పెట్టుకున్న

రష్యన్ సీతాకోకచిలుకలు నల్లంచు ఎరుపు చుక్కలున్న తెల్ల

సీతాకోకచిలుకలు ఏదో రహస్యాక్షరాలను ముద్రించుకుని వస్తాయి.

సౌందర్య ఆరాధకులకు మాత్రమే అర్థమయ్యే భాష అది.

ఆ రెక్కలపై చుక్కల ప్రేమ లేఖలు రాసుకుని వచ్చాయో

తమ జీవిత కథను రాసుకుని వచ్చాయో కానీ

వాటి అందానికి దాసోహం అవుతాను.

ఆశగా అన్నింటినీ జవురుకోవాలనుకుంటాను

లిప్తపాటు కాలంలో సత్త్వహీనమై మోకరిల్లుతాను

పూల బుుతువుతో జీవిత చక్రం ముగిసిపోయే

వీటికి దీర్ఘకాలం ఎగిరే శక్తిని ఎవరిచ్చారు!?

ఇంతటి అందాన్ని కూడా దారాదత్తంగా మధువే

సమకూర్చి వుంటుంది. విధాత కూడా ఈర్ష్య చెంది

వాటి జీవితకాలాన్ని నిర్దాక్షిణ్యంగా కుదించేసాడేమో.

వాటిని ప్రేమించాల్సిన అవసరం లేదు

కానీ అమితంగా ప్రేమించాను పనీపాట ఎగ్గొట్టి మరీ.

నిత్యం వెతుక్కుంటూ వెళ్ళి…

ఇలాగే ప్రేమిస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది.

ఓ సీతాకోకచిలుకా!

నా ఆత్మను తాకింది నీ స్వేచ్ఛా ప్రియత్వం

కుసుమ సదృశ హృదయం నాది

ఏ తుమ్మెద అంటని అడవి మల్లెపూవు సొగసు నాది

ఒక్కసారి వచ్చి ముద్దాడిపో!

మరుజన్మకు నీవెక్కడో నేనెక్కడో!

నీ స్వేచ్ఛా ప్రియత్వాన్ని పుప్పొడిలా అద్దుకుని తరించిపోతాను.


Tags:    

Similar News