ఆత్మ మధుపాత్రని స్వచ్ఛమైన కళతో నింపుకుందాం.. రండి!
హైదరాబాద్ ఐకాన్ ఆర్ట్ గేలరీలో 2025 నవంబర్ 7 నుంచి 16 దాకా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది.
రాజమౌళి - సుకుమార్… ఆ పేర్లు వింటే చాలు -
అతలాకుతలమూ, కకావికలమూ అయిపోతాం.
ప్రభాస్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ -
వాళ్ల పోస్టర్ చూస్తే చాలు, పులకించిపోతారు జనం.
ఎంతసేపైనా మాట్లాడతారు. ఒక ప్రేమ పూనకంతో వూగిపోతారు. 70 ఎం.ఎం తెరమీద కమర్షియల్ సినిమా చేసే ఆడియో విజువల్ మేజిక్ అది. మనుషుల్ని పట్టి కుదిపేస్తుంది. పట్టపగ్గాల్లేని అభిమానం కట్టలు తెంచుకుంటుంది.
ఈపూరి రాజు, పామర్తి శంకర్, మోషే డయాన్ అంటే మీరు గుర్తుపడతారా?
శివాజీ తల్లావఝుల, రాజేష్ నాగులకొండ, శ్రీనివాసరామ్ మాకినీడి - అనే పేర్లు విన్నారా? వాళ్లు మంచి ఆర్టిస్టులని తెలుసా?
శివాజీ తల్లావఝుల
చార్కోల్, క్రోక్విల్, బ్రష్, నైఫ్, వొట్టి నలుపూ తెలుపైనా సరే, రకరకాల రంగుల్లో ఐనాసరే, బస్తీమే సవాల్! బొమ్మ వేశారా - ఆరుద్ర అన్నట్టు కొన్ని తరముల సేపు, గుండెనూయలలూపు. అంత చక్కని ఆర్టిస్టులు. ఆర్ట్ తప్పితే ఏమీ చాతకాని వాళ్లు. ఆర్ట్ ని ఒక జీవనోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళు. వాళ్ల కలలేమిటో, వాళ్ల కళలేమిటో ఎప్పటికీ అర్థం కాని వాళ్ళు. ఏ గొప్ప సినీ దర్శకుడికీ, ఏ సూపర్ స్టార్ కీ తీసిపోనివాళ్ళు. కళని బతికిస్తున్న వాళ్ళు. కళ పెట్టిన కూడు తిని బతుకీడుస్తున్నవాళ్లు.
వీళ్లు ఆరుగురు ఆరు రంగుల గుర్రాలేసుకుని మనమీదికి దాడికి వస్తున్నారు. రండి, రండి… అస్సలు టూమచ్ గా వుండే ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ చూతమురారండీ.
హైదరాబాద్ ఐకాన్ ఆర్ట్ గేలరీలో 2025 నవంబర్ 7 నుంచి 16 దాకా వీళ్ళ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దానికి BETWEEN BLACK & WHITE అని పేరు పెట్టారు. బావుంది కదా. వీళ్ళ బొమ్మలు ఇంకా బావుంటాయి.
అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అంటే ఎగిరెగిరి చప్పట్లు కొడతాం. మన నల్గొండ కళాకారుడు పామర్తి శంకర్ దేశం గర్వించే గొప్ప ఆర్టిస్ట్ అంటే అతనెవరు? అని అడుగుతాం. ఈ వెనకబడిన సినీ వ్యామోహ దేశంలో మనం మన ఆర్టిస్ట్ కి పట్టించిన గతి అది!
సంవత్సరాలు దొర్లిపోయాయి. కాలం మారింది. ఆర్ట్ కి విలువ పెరిగింది. ధర పలుకుతోంది. ఒకనాడు సిటీ బస్సు టికెట్ కి డబ్బులు వెతుక్కునే పేద ఆర్టిస్టులు, ఇపుడు ఢిల్లీలో పెయింటింగ్ లు అమ్ముతున్నారు. ప్రతిష్టాత్మకమైన ముంబై జహంగీర్ ఆర్ట్ గేలరీలో ఒన్ మేన్ షోలు పెడుతున్నారు. ఒకనాటి కొన్ని వేల రూపాయల నేలబారు ఆశలు ఇపుడు లక్షల్లోంచి కోట్లు దాటుతున్నాయి. నాటి దిగువ మధ్యతరగతి దిగులు కళాకారులే ఇపుడు పారిస్, లండన్, న్యూయార్క్ నగరాలకు విమానాలేసుకు వెళిపోతున్నారు.
కేరికేచర్ హీరో పామర్తి శంకర్..
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఒక చిన్న డ్రాయింగ్ టీచర్. 1993లో హైదరాబాద్ వచ్చాడు. ఆర్టిస్ట్ మోహన్ తో కలిసి పనిచేశాడు. 1996లో 'వార్త'లో కార్టూనిస్టుగా చేశాడు. ఎవరీ శంకర్? ఎంత బాగా వేస్తున్నాడు? అని జనం అనుకుంటున్నపుడే 'సాక్షి' డెయిలీలో చేరాడు. కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, కేరికేచర్లు ఒక ఉద్యమంలా వేశాడు. నెల్సన్ మండేలా కేరికేచర్ వేస్తే అంతర్జాతీయ బహుమతి వచ్చింది. ఎగ్జిబిషన్లు పెట్టాడు. నలుపు తెలుపు నాజుకు గీతల శంకర్ గా సూపర్ స్టార్ డమ్ సాధించాడు. మహాత్మా గాంధీ సిరీస్ వేశాడు. గాంధీ అంత నిరాడంబరమైన సన్నని, మృదువైన గీతల్లో 'శంకర్ గాంధీ'ని చూసి జనం నివ్వెరపోయారు. మేక సిరీస్ తో మరో మేజిక్ చేశాడు. ఒక సాత్విక, తాత్విక మేకని అనేక పోజుల్లో నోరూరించే రుచితో వేసి, శభాష్ అనిపించుకున్నాడు. రేపటి ఎగ్జిబిషన్ లో పరిణతి చెందిన పామర్తి శంకర్ బొమ్మలు మీకో కళాత్మక ఉద్వేగాన్ని కానుకగా యిస్తాయి.
పామర్తి శంకర్
శంకర్ మేకలొస్తున్నాయి జాగ్రత్త!
రాజు తల్చుచుకుంటే నవ్వులకు కొదవా!
ఉత్తరాంధ్రలో విజయనగరానికి చెందిన ఈపూరి రాజు చక్కిలిగిలి పెట్టి చంపేసే హంతక విద్యలో ఆరితేరిన నేరస్తుడు. 30 ఏళ్లుగా వందల, వేల కార్టూన్లు వేసి తెలుగు వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని ఉచితంగా పంచుతున్నాడు. రాజు రివ్వున వేగంగా గీసే గీత, సర్రున శత్రువు చెయ్యి నరికినట్టే వుంటుంది. నైరూప్య కళలో చేయి తిరిగినవాడు. రంగురంగుల పెయింటింగ్ అయినా, నల్లని చింపిరి జుత్తు అల్లరి అమ్మాయి అయినా రాజు చేతిలో ప్రాణం పోసుకుంటుంది, పైగా మన ప్రాణాలు తోడేస్తుంది. హైదరాబాద్ లోనే బొమ్మలు వేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్ స్టోరీలు రాసుకుంటూ, 60 ఏళ్లు దాటిన బొజ్జని తడుముకుంటూ హేపీగా బతికేస్తున్నాడు. ఆర్టిస్ట్ మోహన్ ఇతన్ని 'లైన్ కింగ్' అన్నాడు. “రాజే కింకరుడగు, కింకరుడే రాజగు” అని అన్నారు గానీ, రాజే కళాకారుడగు - అని కవి అనలేకపోయాడు.
రాజు ఈపూరి
రాజు బొమ్మలు చూద్దాం, రాజుతోనే మాట్లాడదాం రండి.
చీరాల డాన్ మోషే డయాన్!
నీటి రంగులలో కోటి అనుభూతులు పండించే పోస్ట్ మోడర్న్ ఆర్టిస్టు మోషే. బాగా చదువు, చాలా బాగా రాయగల శక్తీ వున్నవాడు. అంతులేని లోప్రొఫైల్ అతని స్పెషాలిటీ. పెయింటింగులూ, పోర్ట్రైట్లూ, 'ప్లవర్' పేజీలూ కుడిచేత్తో లెక్కలేకుండా వేస్తూ, ఎడమచేత్తో వ్యాసాలు రాస్తుంటాడు. ఆర్ట్ మీద తగినంత స్టడీ వున్నవాడు. కొండొకచో, నిశ్చితమైన కళాభిప్రాయాల్ని కచ్చితంగా చెప్పగల ధైర్యవంతుడు. పెయింటింగ్ లో కారుమబ్బుల మీంచి దూసుకొస్తున్న కిరణాల్ని వేస్తే, అవి మనల్ని తాకుతున్నట్టే వుంటాయి. పెయింటింగ్ తో ప్రయోగాలు చేసే సైంటిస్ట్ ఇతను. సంగీతం వింటూ, పాటలు పాడుకుంటూ, రంగుల మిశ్రమంతో కేన్వాసుని వెలిగిస్తూ, నిర్వికారంగా, నిష్పూచీగా బతకడాన్ని గత పాతికేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. పైనుంచి పున్నాగ పూలు రాలుతున్నట్టూ, గాలితో చెట్ల ఆకులు గలగలమని పాడుతున్నట్టూ, కళాకారుడు ప్రకృతిలోకి నడిచి వెళుతున్నట్టూ సహజ సౌందర్యంతో కాంతులీనే మోషే బొమ్మలు మనల్ని వెన్నాడుతాయి.
మోషే డయాన్
కళాతత్వ ధ్యానం తల్లావఝుల శివాజీ..
జర్నలిస్టు సర్కిల్స్ లో జ్ఞానిగా పేరుగాంచిన శివాజీ, నిలువెల్లా కళాకారుడు. రచయిత, విమర్శకుడు. దేశ విదేశీ చిత్రకళని కాచి వడబోసినవాడు. భారతీయ తత్వాన్ని సింపుల్ గా చెబుతాడు పెయింటింగుల్లో. అమాయకంగా ఒక ఆవుదూడ, రెక్కలల్లార్చే సంగీతంతో ఓ తూనీగ, ధ్యానంలో బుద్ధుడు, ముచ్చటైన గొర్రెపిల్లతో ఓ యువతీ - హాయయిన లేత రంగులు. ఈ అల్లకల్లోలపు జీవితానికి ఇంత శాంతిని ప్రసాదిస్తున్నట్టు వుంటాయి శివాజీ బొమ్మలు. కవితలకి బొమ్మలూ, కవర్ పేజీలూ, అడపాదడపా మంచి సౌందర్యత్మక చిత్రాలూ వేస్తూ, 70 ఏళ్ళు దాటిన వయసుతో కలిసి నడుస్తున్నాడు. కళా కవిత్వమూ కలిసిపోతే, అవి తల్లావఝుల శివాజీ అవుతాయి. లోపలి అరాచకుణ్ణి నిద్రపుచ్చుతూ, అల్లరి పిట్టల్నీ, లేగదూడల్నీ తట్టిలేపుతూ, చదువురాని మాలాంటి వాళ్ళని భరిస్తూ, జల్సాగా బతికేస్తున్నాడు ఈ కళాసౌందర్య తత్వజ్ఞాని.
బొమ్మలు సరే… శివాజీతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్.
పంచరంగుల రాజేష్ నాగులకొండ..
ప్రకాశం జిల్లా చీరాల నుంచి కళని వెతుక్కుంటూ చెన్నై వెళిపోయాడు. చందమామలో సీనియర్ ఆర్టిస్టుగా చేరి సత్తా చూపాడు. తర్వాత న్యూఢిల్లీలో కేంప్ ఫైర్ గ్రాఫిక్ నావెల్స్ లో జాయినయ్యాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ లో ఆరితేరాడు. 35 గ్రాఫిక్ నవలలకి ప్రాణం పోశాడు. కృష్ణ: డిఫెండర్ ఆఫ్ ధర్మ, బుద్ధ: యాన్ ఎన్ లైటెన్డ్ లైఫ్, అశోక: ది మౌర్యన్ కింగ్ - వర్క్స్ తో ఒక సృజనాత్మక కళాకారునిగా పేరు పొందాడు. ఇపుడు హైదరాబాద్ లోనే ఆర్ట్ అంతు చూస్తున్నాడు రాజేష్.
రాజేష్ నాగులకొండ
కళ ఓ తీరని దాహం - శ్రీనివాసరామ్ మాకినీడి..
కళలో మునిగితేలడం, కళ కోసమే బతకడం - సొంతంగా బొమ్మలు నేర్చుకుని ఆర్టిస్టుగా నిలదొక్కుకున్నాడు శ్రీనివాసరామ్. త్రీ-డీలో ప్రయోగాలు చేశాడు. ఇతని గీతల్లో మేజికల్ రియలిజం పలుకుతుంది. రాగరంజితమైన నైరూప్య చిత్రకళ శ్రీనివాసరామ్ చేతిలో గారాలు పోతుంది.
శ్రీనివాసరాం మాకినీడి
ఈ ఆరుగురి బొమ్మలూ పిలుస్తున్నాయి, రండి..
ఒక పెయింటింగ్ నో, నీటి రంగుల వెలుగు నీడల్నో, వయ్యారపు నలుపు గీతల ఇలస్ట్రేషన్నో చూడడం అంటే - ఎస్.వరలక్ష్మి పాట ఒకటి మనల్ని తాకినట్టే. బిస్మిల్లా ఖాన్ షెహనాయి మనలోకి ప్రవహించినట్టే. హిమాలయాల్లోని మానస సరోవరం మనింటికి వచ్చినట్టే! రండి, రండి. హృదయానికి పట్టిన దుమ్మూధూళినీ, బూజునీ దులుపుకుందాం. కొన్న సెల్ ఫోన్లూ, టీవీలూ, ఫ్రిజ్జులూ చాలు, చాలిక. కొద్దిసేపు స్వచ్ఛమైన కళని ఎంజాయ్ చేద్దాం. పవిత్రమైన ఆర్ట్ తో ఆత్మ మధుపాత్రని నింపుకుందాం.. రండి!