అయామ్ హ్యాపీ..అయాం డన్!

డా. మల్లంగి గోపీకృష్ణ ‘మండే పోయెమ్’

Update: 2025-10-27 03:24 GMT

రేపు ఎప్పుడు తెల్లారుతుందా

అనిచూసేంత ఎగ్జైటింగ్ ఏమీలేదు..

ఏదో జీవితం అతికష్టంమీద

ఎలాగోలా సాగిపోతోంది!

బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందాని

అసలు ఎదురు చూడడంలేదు..

కొనే అవకాశంలేదని తెలిశాక మాఆవిడ అడగడం మానేసింది!

షేర్‌మార్కెట్ కుప్పకూలిపోయినా

నాకు పెద్దగా దిగులేం లేదు..

దాచుకొనేంత డబ్బు లేక

నాకు ఒక జీవితకాలమయ్యింది!

తాతలభూమిని ఆక్రమించుకొంటారన్న

భయం అసలు లేకుండాపోయింది..

మానాన్నతరానికే ఆమాట

మాఇంట్లో వినిపించకుండాపోయింది!

ట్రంపు హెచ్‌వన్ వీసాలివ్వనన్నా

నాకు అస్సలు ఫరక్ పడకుంది..

నాతోపాటూ డిగ్రీచేసిన మావాడికీ

బియ్యమిచ్చే తెల్లరేషన్ కార్డుంది!

ఐఫోన్ రేటు రోజురోజుకీ పెరిగినా

రూపాయివిలువతగ్గినా తేడాలేకుంది..

నంబర్లొత్తుకొనే నాపురాతనఫోను

ఛార్జింగ్ నిలబెట్టుకొని పన్జేస్తూనేవుంది!

జీయస్టీ తగ్గి ఏసీలు ఎంతఛీపైనా మాకు పట్టించుకోనక్కర్లేదనిపిస్తుంది..

పాత ఫ్యాను కాస్త శబ్దం చేస్తున్నా

పాపం ఇంకా తిరుగుతూనే ఉంది!

ఫ్లైట్ రేట్లు తగ్గించామన్నా

మాకే సంతోషం కలగకుంది..

మాఆవిడ ఫ్రీబస్ అక్కరలేదు

కూర్చునేందుకు సీటుంటేచాలంది!

ఉక్రెయిన్‌పై రష్యా తన యుద్ధం

ఆపకున్నా పరవాలేదనిపిస్తోంది..

ప్రక్కింటి కామాక్షి మాఇంటిముందు

తనచెత్త వెయ్యకుంటే చాలనిపిస్తుంది!

సీరియళ్ళలో,బిగ్‌బాసులో తన్నుకొన్నా

తేడా కొంచెమైనా నాకు పడకుంది...

బిల్లుకట్టలేదని మా కేబుల్‌కనెక్షన్

కట్‌చేశాక ఇల్లు ప్రశాంతంగా ఉంది!

చివరగా చెప్పొచ్చేదేంటంటే....

నాదగ్గర అందరూ కోరుకొనేవి

లోకమంతా ఆశపడేవి ఏవీలేవు!

జీవితం నిరాసక్తంగానైనా పర్లేదు

ఏదో ఒకరకంగా సాగిపోతూనేవుంది!

కొంచెం ఫ్రస్టేషన్,కొంచెం శాటిస్ఫ్యాక్షన్

కొంచెం అసంతృప్తి,ఇంకొంచెం సంతృప్తి

ఐయామ్ హ్యాపీ...

అయామ్ ఫోర్సిబ్లీ కంటెండెడ్...

ఆండ్ ఫైనల్లీ...అయామ్ డన్...


Tags:    

Similar News