అమ్మలకెవరు థాంక్స్ చెబుతారు చెప్పు, నవంబర్ ?

నేటి మేటి కవిత: గీతాంజలి

Update: 2025-12-10 05:47 GMT

నవంబరు నెల ఎముకల వణికించే చలిలో

వెచ్చని నిప్పుల కుంపటి లాంటి

నిన్నే తలుచుకున్నాను 

నువ్వుంటే ఎంత బాగుండేది?
మంచు ముచ్చట్లు
కొన్ని వెచ్చగా గొంతు జారే
రెడ్ వైన్ లాంటి గజళ్ళు వినే వాళ్ళం
లేదా పాడుకునే వాళ్ళం!
కనీసం దాచుకున్నవేవో చెప్పుకునేవాళ్ళం కదా!
ఏదో ఒకటిలే  కలిసైతే ఉండేవాళ్ళం కదా?
*
అక్టోబర్ హాలోవీన్ పండగలో సమాధులు తవ్వి
మరీ పూర్వీకులను పలకరించే
మనుషులు సంభాషణలు ముగిశాక
వాళ్ళని శ్మశానా ల్లోకి సాగనంపి
నవంబర్లోకి మంచు తలుపు తెరుచుకొని
మెల్లిగా బయటపడతారు!
*
నవంబర్ తొలి మంచు కురిసే నెల కదా!
నీ బదులు కాస్త ఈ మంచును ముద్దాడనీ !
గరుకు మంచు పొరల మీద నీకో ప్రేమలేఖ రాసుకోనీ!
మంచు పొరలను జరిపి
వణుకుతున్న పూలను పలకరించనీ
నాతో రా! పద అలా తిరుగుదాం!
భూమి మీద రాలిన
ఎరుపు బంగారు రంగు ఎండుటాకులు, చూడు,
గర్వంతో మిడిసి పడే మనుషుల్ని చూస్తూ
పగలబడెలా నవ్వుతున్నాయో?
పడి రాలిన ఆకులు
ఎండిపోతున్న తడిలేని మనుషుల గురించి,
రహస్యంగా మాట్లాడుకునే మాటలు విందాం !
మంచు కరిగిన నీటిలో నానిపోయి
కొట్టుకుపోతూ అన్నాళ్ళూ మోసిన చెట్టుకు
చివరి కృతజ్ఞతలు చెబుతున్న
ఆకుల వియోగ దుఃఖాన్ని చూద్దాం రా!
నిన్నూ నన్ను
ఇంకా ఊహల్లో కూడా విడదీయనందుకు,
పద ఈ శరద్రుతువుకి కృతజ్ఞతలు చెబుదాం!
*
"హలో డే" అంటూ ప్రపంచం
ఒకరినొకరిని పలకరించుకోమంటుంది!
ఆ పలకరించుకునే రోజు కూడా
నీలోనే ఉంది కదా, నవంబర్ !
కానీ పలకరించుకోని మనుషులు,
మంచులా హృదయం కరగని
మనుషులు నీ చుట్టూనే ఉన్నారు !
"హలో ఎలా ఉన్నారు"? అంటూ
అడిగే మనుషుల కోసం
అమ్మలు నాన్నలు
అనాథల్లాంటి మనుషులు చూడెలా,
చూపులు చాటేస్తూ, తప్పుకు పోతూ,
పలకరించాల్సిన మనుషుల కళ్ళల్లోకి,
గుచ్చి గుచ్చి చూస్తూ
వీధులెంబడి ఆరాటంగా తిరుగుతున్నారో ?
పలకరించమని,కాస్త కుశలం కనుక్కోమని,
అయ్యో ఇలా నిలువెల్లా గాయాలెట్లా అయ్యాయనీ,
నొప్పులకు కాసింత లేపనం కావాలేమో
అని చచ్చిపోయిన అమ్మ లాంటి ప్రేమతో
కాస్త అడగమనీ  భుజాల మీద
తడుతూ ఆశగా అడుకుంటున్నారో?
పలకరింపు భిక్ష కోసం యుగాలుగా
జోల చాపేలా నిలబడ్డారో?
* కాస్త ఇటు రా, చూడిటు!
కొంతమంది ఇళ్లల్లో ఒంటరితనపు ఎడారి కళ్లేసుకుని,
నిప్పుల కుంపటల ముందు హృదయాన్ని
వెచ్చ బెట్టుకుంటూ ఎదురు చూస్తున్నారో కొన్ని పిలుపుల కోసం!
అనాది పలకరింపుల దాహం వారిది!
తమలా ముసలైపోయిన
ఇళ్లు వదలలేని మోహం వాళ్ళది!
తలుపులు తట్టి వాళ్ళని పలకరించరాదూ?
*
నవంబర్! ఎలాగో అలా బతికిస్తున్నందుకు,
ఈ లోకానికి మనుషులని
కృతఙ్ఞతలు చెప్పుకోమంటావు నువ్వు!
ఈ భూగోళం మొత్తానికి ఒకరికొకరికీ,
రైతులు పంటలు పండించుకోనిచ్చిన ప్రకృతికి,
నీరిచ్చిన నదులకు,వెన్నెలనిచ్చిన చంద్రుడికి,
సూర్యుడినిచ్చిన ఆకాశానికి,
వర్షాన్నిచ్చిన మేఘాలకి,
పొలం దున్నిన నాగలికి,ధాన్యాన్నిచ్చిన భూమికి,
రైతు కూలీలకి, స్త్రీలకి,
అన్నం పెట్టే అమ్మలకి పొలం దున్నే
నాన్నలకి కృతజ్ఞతలు చెప్పుకోమంటావు!
నువ్వు ఆదేశించిన "థాంక్స్ గివింగ్ డే" రోజున !
పండగ లాగా ఒకరితో ఒకరు గడిపే ప్రియమైన,
విలువైన మనుషుల్ని దక్కించుకునే కాలం !
కృతజ్ఞతే తెలీని మనుషులు నీ ఆదేశాన్ని పాటిస్తారంటావా?
*
"థాంక్స్ గివింగ్ డే" రోజు ఉడికిన
టర్కీ మాంసం లో మసాలాలు కూరుతూ,
క్రాన్ బెర్రీ సాస్ గుమ్మడికాయ మిఠాయి చేస్తూ,
కోడళ్ళూ, వయసు మీద పడ్డ
అమ్మలూ హడావుడిగా
వంట గదుల్లో పొగ చూరిపోతారు!
పండగ రోజుల్లో అమ్మలు భగ భగ మండే
నాలుగో పొయ్యిగా మారిపోతుంటారు!
అమ్మలకు ఎవరు థాంక్స్ చెబుతారు చెప్పు?
బదులుగా పురుషులు మాత్రం
ఫుట్బాల్ గేమ్ చూస్తూ ఉంటారు
రోడ్డెక్కి గొప్పగా వెళ్లే
థాంక్స్ గివింగ్ డే పరేడ్ లు చూస్తూ ఉంటారు !
ఆకలికి బ్రెడ్ లేని వాళ్ళు
గుమ్మంలో బారులు కట్టి నిలిచి ఉంటారు!
భూమి గొప్పది కదా వాళ్ళందరికీ
ఉచితంగా రొట్టె ఇస్తుంది.
వాళ్లు కృతజ్ఞతలు చెప్పే వెళ్ళిపోతారు
*
బ్లాక్ డే కూడా నీదే!
సరుకుల మాయాజాలంలో
మనుషుల్ని మాయ చేయడానికి ధరలు పట్టిని
తక్కువగా చూపించే మార్కెట్ కుట్రలో
మనుషులకి బ్లాక్ ఇంకు తో బ్లాక్ ఫ్రైడే ని పండుగ రోజు
అని చెప్తావు ! ఎంత మోసం నీది ?
కృతజ్ఞతలు చెప్పిన మరుసటిరోజే
ఆత్మీయంగా అలింగనం చేసుకున్న వారికి
మార్కెట్ మోసం తెలీనికుండా
మనుషులకి మరొక పండుగను అందిస్తావు కదా !
నువ్వొక దోపిడీ నెలవు కూడా నవంబర్!
*
అవును
"ప్రపంచ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం" కూడా
నువ్వే జరుపుతావు!
ప్రతీ క్షణం స్త్రీల శరీరాలు ఖండ ఖండాలుగా
కోయబడుతుంటే మౌనంగా ఉండే
మిగిలిన పదకొండు నెలల్ని మాత్రం ప్రశ్నించవు!
అందుకే వేల సంవత్సరాల తర్వాత
ఇథియోపియాలో హేల్ గుబ్బీ అగ్నిపర్వతం బద్దలై
ప్రపంచాన్ని నల్ల మబ్బులై ముంచెత్తింది!
ఏం లాభం?
*
ఇక నవంబరు ఆరో తారీకు
యుద్ధం& సాయుధ ఘర్షణలో
పర్యావరణ దోపిడీ ని
నియంత్రించే రోజు కూడా నీదే కదా నవంబర్?
ఏం లాభం? ఎంత విషాదం?
ఎంత వికృతం?
అడవిని ఆదివాసిని రక్షించే హిడ్మా లని రాజీలని,
వేలమంది అడవి బిడ్డల్ని
నమ్మకద్రోహపు వెన్నుపోటుతో చంపేసి
మరీ పర్యావరణాన్ని కార్పొరేట్లకు ఇచ్చే స్తుంటే
రజాయి కప్పుకుని చలికి ముడుచుకు కూర్చున్నావు!
ఎంత నిర్దయివి నువ్వు?
*
ఇక "జ్ఞాపక దినోత్సవం" నాదే అంటావు!
జ్ఞాపకం చేసుకోండి ప్రేమల్ని,గతాల్ని,
మృత్యువుని,వియోగాల్ని,గాయాల్ని,
నమ్మకద్రోహాలని,మనుషుల్ని అంటావు!
కానీ లోకంలో ఎవరు ఎవరిని
జ్ఞాపకం చేసుకుంటున్నారని?
అమ్మని మరిచిపోయిన కొడుకులు,
కూతుళ్ళూ దాక్కుంటున్నారు!
పాలస్తీనాలో సామూహిక సమాధుల పెనుగులాటని,
నిత్యం మిసైళ్ళని పేల్చే ఆకాశాల్ని
ఆదివాసీల రక్త నదులు పారిస్తూ
అడవుల్ని ఆక్రమించే
కార్పొరేటు రాజ్యం దుర్మార్గాల్ని
లౌక్యంగా మర్చిపోతూ
సుఖ నిద్రకు పోతున్న మనుషులు నవంబర్ వీళ్ళంతా!
జ్ఞాపక దినోత్సవం అంటే ఇవన్నీ గుర్తు చేసుకోవడం,
దిక్కు మొక్కు లేని జనం కోసం
కాసిన్ని కన్నీళ్ళు కార్చడం కాదా?
*
ఇక ప్రేమలో కాల్చేసే కొన్ని జ్ఞాపకాలను
నీలో కురిసే మంచులో పూడ్చేయమంటావు!
ఎలా సాధ్యం చెప్పు?
ఎందుకంటే మరిచిపోవాలనుకోవడమే
ఒక మహా జ్ఞాపకం కాబట్టి!
ఇంకెందుకు ప్రపంచ జ్ఞాపక దినోత్సవాన్ని
ఈ హృదయం లేని ప్రపంచానికి
విడిపోలేని మనుషులకి,
ప్రేమికులకీ గుర్తు చేస్తావు చెప్పు?
*
పద! అందుకే చలికి వణికే నవంబర్ నెలని ముద్దాడి,
వెచ్చని కంబళి కప్పి, డిసెంబర్ తలుపు తడదాం !


Tags:    

Similar News