అల్లూరి జిల్లా ఆదివాసీలు ఆరగించేవి ఇవే..
ఈ వ్యాసంలో ఈ ప్రాంతపు ఆదివాసి ఆహారం గురించి తెలియజేసే ప్రయత్నం జరిగింది.
విశాఖపట్నం జిల్లాలో అంతర్భాగంగా ఉండిన పాడేరు మన్య ప్రాంతాన్ని విభజించి దీనికి గోదావరి జిల్లాలో గల మన్యప్రాంతమైన చింతూరు, రంపచోడవరం మండలాలను కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనికి అల్లూరి సీతారామరాజు జిల్లా అని నామకరణం చేసారు. ఈ జిల్లాలో భగత, కొండదొర, నూకదొర, కొండరెడ్డి, కొండకమ్మర, గౌడ, వాల్మీకి, గదబ, కోదు, పొరజ, కొండకుమ్మర, మాలి మొదలైన ఆదివాసి తెగలు నివసిస్తున్నారు. వీరికి తమదైన ప్రత్యేక సమాజము, సంస్కృతి, జీవన విధానము, ఉత్పత్తి విధానాలు ఉన్నాయి. అదే విధంగా వారిదైన ప్రత్యేక ఆహారం కూడా మనం గమనించవచ్చు. ఈ వ్యాసంలో ఈ ప్రాంతపు ఆదివాసి ఆహారం గురించి తెలియజేసే ప్రయత్నం జరిగింది.
I. వరిధాన్యంరకాలు: మెట్టుధాన్యం, ఏకపిట్టధాన్యం, భైగండలుధాన్యం, బటాసందరాధాన్యం, ఇసుకరవ్వలధాన్యం, నిమ్మలాపరిధాన్యం, పరితూరుధాన్యం, బుడమధాన్యం వంటి ప్రత్యేక రకాలను ఇక్కడ ఆదివాసీలు పండించి తింటున్నారు. 1990ల తరువాత ఈ ప్రాంతంలో కూడా సాగు చేస్తున్న కొత్త ధాన్య రకాలు ఇలా ఉన్నాయి. స్వర్ణ, ఇంద్ర, విజేత, కాటందొరసన్నాలు, ప్రభాత్, శ్రీకాకుళంసన్నాలు, శ్రీధృతి, తెలంగాణా సోన, బతుకమ్మ, కునారంసన్నాలు, నంధ్యాలసోన, భీమ, తరంగిణి, చంద్ర, సోభిని, క్షీర, వరం, సాంబమసూరి, పొలాసప్రభ, జగిత్యాలసన్నాలు, వరంగల్సన్నాలు, పుష్యమి, నెల్లూరి మసూరి, భావపురి సన్నాలు, నెల్లూరిసోన, సునాసూరిధాన్యం మరియు తెల్లహంసధాన్యము.
II. ఆకుకూరలు: ఈ ప్రాంతం అడవులతో నిండి యుండుటవలన విభిన్న రకాలైన ఆకుకూరలు లభిస్తాయి.
1. మండి కూర: - ఇది తీగజాతి. కొండలలో పెరుగుతుంది. సంత్సరానికి ఒకసారి ఇది మార్చి, ఏప్రిల్ నెలలో లభిస్తుంది. లోతైన అడివిలో మాత్రమే దొరుకుతుంది. ఇది కొద్దిగా చేదుగా ఉండే ఆకు. ఆయాసం, దగ్గు, శరీరనొప్పులకు ఇది మంచి నివారణ.
2. గొడ్డుకూర:- గొడ్డుచెట్లు లేత ఆకులతో కూర చేస్తారు. ఇది మంచి రుచికరమైనది. మార్చి, ఏప్రిల్ నెలలో అడవిలో దొరుకుతుంది.
3. కొంకుడు కూర:- ఇది ఒక పొద. పెద్ద పెద్ద రాళ్ళ సందులలో లభిస్తుంది. దీని ఆకురూపం పాము పడగలా ఉంటుంది. అడవి కాలిపోయిన తరువాత ఏప్రిల్, మే నెలలో భూమి నుంచి బయటకు వస్తుంది. గోరుకు తగలకుండా దీనిని తుంచాలి. తగిలితే రుచి మారిపోయి తినలేము. ఉడకబెట్టి నూరాలి. ఇది నాటుకోడి మాంసం రుచి.
4. కొండచారుకూర:-అడవిలో రాళ్ళపైన దొరుకుతుంది. జూన్, జూలై మాసాలలో లభ్యము. పనస పిక్కలతో కలిపి కూరచేస్తారు. శరీరంలో ఉష్ణాన్ని ఇది తగ్గిస్తుంది. చాలా రుచికరము. నెత్తల్లతో కలిపి కూర చేస్తే ఇది ఇంకా రుచికరము.
5. . గుమ్మడిఆకుకూర: ఈ ఆకును ఉడకబెట్టి పచ్చిమిర్చి వేసి కూర చేస్తారు. కీళ్ళనొప్పుల నివారణలో ఇది ఉపయోగపడుతుంది. ఈ కూర జాయింట్స్ ని కలుపుతుంది.
III. దుంపజాతికూరలు: ఆకుకూరల మాదిరిగానే ఈ ప్రాంతం అనేకమైన దుంపజాతి కూరలకుకూడా ప్రసిద్ది.
1. నాగలిదుంప:- భూమిలోపల పండుతుంది. సంక్రాంతి నుండి ఏప్రిల్ నెల వరకు ఇది లభిస్తుంది.
2. చారుదుంప:- నేల నుంచి వస్తుంది. సంక్రాంతి నుండి ఏప్రిల్ నెల వరకు ఇది లభ్యము.
3. పిండి దుంప:- ఇది అడవిలో తీగజాతి. 5 అడుగులు తవ్వగా లభిస్తుంది. పొడిగా ఉంటుంది. తింటే బాగా దాహం వేస్తుంది. ఉడకబెట్టి తింటారు. ఎక్కువగా తింటే బాగా దాహం వేసి అనారోగ్యానికి దారితీస్తుంది. వనవాస కాలంలో భీముడు ఈ పిండి దుంపలను తిని బలాఢ్యునిగా మారాడని ఇక్కడ ఆదివాసీల కధనము.
4. తేగ దుంప:- అడవులలో రాళ్ళ మధ్యలో లభిస్తాయి. నేల పై పొరలోనే దొరుకుతాయి. ఉడకబెట్టి తింటారు. శరీరానికి చలవచేస్తుంది.
5. వెదురుకొమ్ములు:- చెట్టు లేతగా ఉన్నప్పుడు వేరు ఇది. ఉడకబెట్టి కూరగా చేస్తారు.
6. అండంగిదుంప:- ఇది ఈతపొద దుంప. అడ్డపిక్కలతో, కొండకందులతో కలిపి వండుతారు. ఇది నడుము నొప్పి నివారణలో సహాయపడుతుంది.
IV. చిక్కుడుజాతికూరలు: - ఇందులో ఈ క్రింది రకాలను చూడవచ్చు.
1. రాజ్మా:-ఇది తీగజాతి. ప్రోటీన్స్ అత్యధికము. ఇవి ఎరుపు, తెలుపు రంగులలో దొరుకుతాయి. ఎరుపు రంగు చిన్నది. తెలుపు రకం పరిమాణంలో పెద్దది.
2. బస్తరు పిక్కలు:- ఇది కూడా తీగజాతి. వీటిని విడిగా వండుకోవచ్చు అలాగే వంకాయలు లాంటి కూరలతో కలిపి వండవచ్చు కూడా.
3. తిమిర్ పిక్కలు:- ఇది కూడా తీగజాతి. పరిమాణం చిన్నది. చాలా రుచికరమైన కూర.
4. కొండ కందులు: - ఇవి మొక్కల రూపంలో లభ్యమౌతాయి. పరిమాణం చిన్నది.
5. అలసందలు: చిక్కుళ్ళలో ఒక రకం. కాడ వలిచి పిక్కలు తీస్తారు.
V. పూలతో తయారైయ్యే కూరలు:- ఈ ప్రాంతంలో లభ్యమయ్యే కంచేడు పూలతో ఆదివాసీలు కూర చేస్తారు. పప్పులో వేసి వండుతారు. ఒరుగులుగా కూడా పెట్టుకుంటారు.
VI. పండ్లలో రకాలు: రొడ్డ పండ్లు, పరిమిక, ఈత, మలబారి, బాదం, గాజుకూర పండ్లు, తుమ్మి, బొడ్డ, నేరడి, అడ్డపిక్కలు, చీడి పండ్లు, కొండ ఉసిరి కొన్ని ముఖ్యమైన పండ్ల రకాలు.
VII. సారాయి: – ఇప్పసారా, పనససారా, జీడిసారా, జీలుగు కళ్ళు, మామిడిటెంక రొట్టె, జావ, మొదలైనవి ఆదివాసీల ఆహారంలో అతిప్రధానమైన పానీయాలు.
VIII. మాంసాహారపు కూరలు: అరుదైన కొన్ని జంతువుల మాంసాహారాన్ని ఇక్కడ ఆదివాసీలు ఆహారంగా తీసుకుంటారు.
1. బొడ్డింగలు:- ఇవి ఈత చెట్టు మొదళ్ళు తవ్వితే అక్కడ లభిస్తాయి. ఈ కూర అచ్చం రొయ్యల కూరలా ఉంటుందని గిరిజనులు దీనిని "పేదవాని రొయ్య" అని
పిలుస్తారు. బొడ్డింగలలో మరో రకం రెక్కల బొడ్డింగలు.
2. కూరేడిపిల్లి, ముల్లపంది, కౌజుపిట్ట, కొండ ఎలుకలు, పొలుసుపంది మొదలైన జంతువుల మాంసంతో ఆదివాసీలు కూరగా వండుకొని తింటారు.