వలిసె నూనెతో మీ గుండె పదిలం!
అరకులో ప్రతీ రైతు పండిస్తున్న పంట!
ఈ సీజన్ లో అరకు పాడేరు వైపు వెళ్తే , పచ్చని తూరుపు కనుమల మధ్య పసుపు తివాచీ
లా మెరిసే వలిసె పూలు చూసి తీరాలి. కాసేపు ఆ పొలంలో నడిస్తే చెప్పలేని ఫీలింగ్‌కి లోనవుతారు. ఇది నూనె గింజల పంట. ఇక్కడ ప్రతీ రైతు తనకున్న పొలంలో కొంత ఈ పంటకు కేటాయిస్తాడు. ఇక్కడ జరిగే సంతల్లో వలిసె గింజల నూనెకు చాలా డిమాండ్ ఉంది. దీనితో వండిన ఏ కూర అయినా రుచిగా ఉంటుందని రైతు సాంబ మాతో చెప్పారు.
‘ మా ప్రాంతంలో ఉప్పు తప్ప అన్నీ సొంతంగా పండించుకుంటారు. ఆఖరుకి వంట నూనె కు అవసరం అయిన నూనె గింజలు కూడా పండిస్తున్నాం ! ఒకపుడు మాకున్న రెండకరాల్లో రాగులు పండించేవాడు. సరైన దిగుబడి వచ్చేది కాదు. కొన్ని సార్లు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు, ఇప్పుడు పసుపు, స్వీట్ పొటాటో తో పాటు వలిసె వేశాం.’ అన్నాడు . దూరంగా పసుపు ఆరబెట్టినట్టున్న పంటను చూపిస్తూ సాంబ.
కొండ దిగి అతని పొలంలోకి అడుగు పెట్టగానే ఒక అరుదైన అనుభూతి కలిగింది.
పాడేరులో వలిసె పంట సాగు చేస్తున్న సీదరి సాంబ దంపతులు
ఇంతకీ ఈ వలిసె పంట తూరుపు కనుమల్లో ఎందుకు సాగు చేస్తున్నారు. గింజల నుండి తీసే వంట నూనె అరోగ్యానికి మంచిదేనా? గుండెకు మేలు చేస్తుందా? నూనెలో ఉండే పోషక విలువలు ఏంటి? రైతులు ఏమంటున్నారు? కొండల మధ్య విసిరేసినట్టుండే పరదేశీ పుట్టు(పాడేరు మండలం) గ్రామం లో పర్యటించిన ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రదినిధి గ్రౌండ్ రిపోర్ట్.
సీదరి సాంబ పొలంలో వలిసె పంటను పరిశీలిస్తున్న ఫెడరల్ తెలంగాణ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లోని, అల్లూరి సీతారామరాజు జిల్లా , పాడేరు ఏజెన్సీ లో జీవిస్తున్న అదివాసీల్లో అత్యంత వెను బడిన అరుదైన తెగ ‘కోందులు’. వారిని Particularly Vulnerable Tribal Groups అంటారు. వారిలో కొందరికి తెలుగు సరిగా రాదు. ‘కువి’ భాషలో మాట్లాడతారు. దానికి లిపి లేదు.
రాగులు, మిరియాలు, కాఫీతోటల్లో పనులకు వెళ్తారు. కొందరు కొండల్లో నుండి పారే ఊటనీటితో వాలులో మెట్లు కట్టి వరి,కూరగాయలు పండిస్తారు. వర్షాధారంగా రాగులు, సజ్జలు సాగు చేసుకుంటారు. ఆ తెగలోని రైతే సీదరి సాంబ. పరదేశీ పుట్టు(పాడేరు మండలం) లో రెండు ఎకరాలు సేద్యం చేస్తున్నాడు. తమ తెగలో అందరికంటే కాస్త భిన్నమైన ఆలోచన ఉన్న వాడు. సాగుబడిలో కొత్త పాఠాలు నేర్చుకోవడం అంటే అతడికి అంతులేని ఆసక్తి.
ఇది ఎత్తైన ఏజెన్సీ ప్రాంతం సముద్ర మట్టానికి 900-1400 మీటర్ల వరకూ ఎత్తు.
సాధారణంగా ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. కానీ వాతావరణ మార్పులు వల్ల వేడి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో ఎర్ర మట్టి నేలలు, లోయల కింద నల్ల మట్టి నేలలు.
ఏడాదిలో వర్షపాతం 1200-1600 మి.మీ. వరకు ఉంటుంది,
ఈ నేల కాఫీ,మిరియాలు అరటి జీడి తోటలకు, పప్పులు చిరుధాన్యాలు కూరగాయలకు బాగా అనుకూలం. ఇక్కడి ఆర్గానిక్ అరకు కాఫీకి దేశంలోనే కాక విదేశాల్లో అత్యుత్తమంగా గుర్తింపు వచ్చింది. కాఫీకి తోడు బ్లాక్ పెప్పర్ (మిరియాలు) ఇంటర్‌క్రాప్‌గా పెరుగుతుంది
కాఫీ, మిరియాల ఇంటర్‌క్రాపింగ్ ప్రస్తుతం అక్కడి గిరిజనులకు అత్యధిక ఆదాయం ఇస్తున్న వ్యవసాయ పద్ధతి.
కొత్త నూనె గింజల పంట
ఈ సంప్రదాయ పంటలకు తోడుగా గత రెండేళ్లుగా ఇక్కడ వలిసెలు సాగు ప్రాచుర్యంలోకి వచ్చింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, పాడేరు, గుమ్మలూరు, మామిడికొండ , మాడుగుల గాలికొండ ప్రాంతాల్లో వలిసె గింజలు (% Niger Seed / Guizotia abyssinica ) పంట ఇటీవల చాలా పెరిగింది. మేము కలిసిన రైతుల్లో దీనిని స్థానికంగా వలిసె / వలిష / వలిగ అని కూడా పిలవడం గమనించాం.
పర్వత అంచుల్లో, వర్షాధార నేలలలో ఈ పంట సాగువుతున్నది.ఈ పంటకు నీరు, ఎరువులు ఎక్కువగా అవసరం లేదు. ఆదివాసీ రైతుల ప్రధాన పంటలో ఇది ఒకటి
సాగు విస్తీర్ణం
అరకు పాడేరు పరిసరాల్లోసుమారు సాగు విస్తీర్ణం10,000 -14,000 ఎకరాలు
మొత్తం అల్లూరి జిల్లా లో సుమారు 25,000 ఎకరాలు పండిస్తున్నట్టు అంచనా.
‘ వలిసె పంట తక్కువ పెట్టుబడితో పండుతుంది. చాలా కుటుంబాలు దీన్ని కొండలపై సామలు, రాగులు, జొన్నలు మధ్యలో అంతర పంటగా నాటుతున్నారు.
ఎరువులు, పురుగు మందులు చాలా తక్కువగా అవసరం
వర్షాధార నేలకు బాగా సరిపోతుంది నీటి అవసరం చాలా తక్కువ. వలిసె మొక్కల వేర్లు
మట్టిని బలపరుస్తుంటాయి. నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. గింజలు కోసిన తరువాత పశువుల మేతకు బాగా పనికొస్తుంది
వలిసె గింజలకు మంచి మార్కెట్ ఉంది. దీనిలో ముఖ్యంగా అరోమా ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల డిమాండ్ ఎక్కువ.
రైతులకు తక్కువ ఖర్చుతో రెట్టింపు లాభంతో స్థిరమైన ఆదాయం వస్తుంది ’ అంటారు పాడేరు లో ఒక స్వచ్ఛంద సంస్ధలో పనిచేస్తున్న రోజీ.
వలిసె నూనె ప్రయోజనాలు
Omega – 3, Omega – 6 అధికంగా ఉంటాయి
Vitamin E & Essential Fatty Acids ఉన్నాయి
ఉపయోగం ఫలితం
గుండె ఆరోగ్యానికి మంచిది చెడు కొవ్వును తగ్గిస్తుంది
కీళ్ల నొప్పులకు సహజ ఉపశమనం ఆయుర్వేదంలో మర్దన నూనెగా వాడతారు
చర్మానికి మామూలు నూనెల కన్నా మృదువుగా పొడిచర్మం, అలర్జీకి ఉపశమన
జుట్టుకు ఉపయోగిస్తే జుట్టు మెత్తగా, రాలే సమస్య తగ్గుతుంది
వంటలో ఉపయోగం
తేలికపాటి వాసన, రుచి → పెద్దవాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు
చలికాలంలో తరిగిపోకుండా ఉండే నూనెల్లలో ఇది ఒకటి
మార్కెట్ ధర
గింజల ధర: ₹60 – ₹95 / kg (పరిసర మార్కెట్లలో)
నూనె ధర: ₹260 – ₹380 / లీటరు (స్థానిక cold-pressed యూనిట్లలో)
ఎగుమతి డిమాండ్: యూరప్, ఆఫ్రికా, శ్రీలంక వంటి దేశాల్లో ఎక్కువ
కో-ఆపరేటివ్ సొసైటీలు / SHGలు కలిపి క్లోడ్-ప్రెస్ నూనె యూనిట్ ఏర్పాటు చేస్తే లాభం 3–4 రెట్లు పెరుగుతుంది.
కూరలు రుచిగా ఉంటాయి
‘‘మాకు పోయిన సారి 3 బస్తాలు దిగుబడి వచ్చింది. 3కిలోల గింజలు వచ్చాయి. మిల్‌లో ఆడిస్తే కిలోన్నర వచ్చింది. కూరలకు వాడినపుడు మిగతా నూనెల కంటే సగమే పడుతుంది. వండినపుడు సువాసన వస్తుంది. ఇక్కడి రైతులు ఇంట్లోవాడుకోగా మిగిలినది సంతలో అమ్ముకుంటారు. మార్కెట్‌లో దొరికే రిఫండ్ ఆయిల్ కంటే బాగుంటుంది. ఏ కూరలో వేసుకున్నా రుచిగా ఉంటుంది. గుండె జబ్బులు రావని, ఆరోగ్యానికి మంచిదని చాలా మంది మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు.’ అంది వలిసె పూలను చూపిస్తూ సాంబ భార్య.
ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన సాంబ ఎమ్మెస్సీ బీఈడీ చేశాడు. వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగ ప్రయత్నాలేమీ చేయలేదని అంటాడు.