డాక్టర్ నాగశేషు 'కిలారి' నవల సమీక్ష

సంకీర్ణ వాస్తవికతల సమర్థ కథనం ఈ నవల: డాక్టర్ గంగిశెట్టి లక్ష్మినారాయణ సమీక్ష;

Update: 2025-09-06 02:00 GMT

ఊరు అంటే ఒక సంకీర్ణ వాస్తవం (కాంప్లెక్స్ రియాలిటీ).

మనం 'భారతీయత' అని కీర్తించే దాని స్వరూపం ఒక సగం ఆదర్శవంతమైన మన తాత్త్విక చింతనలో ఉంటే, మరో సగం వాస్తవికమైన మన "ఊరు" సామాజికతల్లో ఉంది. ఆ వెతల్లో ఉంది, ఆ కతల్లో ఉంది, ఆ మమతల్లో ఉంది, ఆ కక్షల్లో ఉంది, కార్పణ్యాల్లో ఉంది, నైతికతలో ఉంది, అనైతికతల్లో ఉంది. అకృత్రిమమైన ఆ ప్రాకృతిక జీవనంలో ఉంది. నేలతల్లిని నిత్యం పచ్చగా నిలిపే ఆ శ్రమశక్తిలో ఉంది. నేలకోసమే ప్రాణాలు తీసుకొనే అవివేకపు భూరక్తిలో ఉంది....! అవి అన్నీ కలిస్తేనే ఊరు. చిన్నా చితకా, పెద్దాచిన్నా కలిసి ఆడుకొనే, పోరాడుకొనే నలుపు తెలుపు గళ్ళ చదరంగం బల్ల ' ఊరు'. నాటి మహాభారతానికి సజీవ శేష భాగం ప్రతి ఊరు! 

మరో మాటలో చెప్పాలంటే, భారతీయ సంకీర్ణ అస్తిత్వానికి సజీవ సంకేతమే 'ఊరు '!
ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే, భారతీయ భాషలన్నిటిలోనూ ఊర్లనూ, మన గ్రామీణ జీవితాన్ని చిత్రించే రచనలు అపారంగా వచ్చాయి. మరీ ముఖ్యంగా యూరోపియన్ కేంద్రితమైన 'ఆధునికత' నుంచి - అంటే మనం ఘనంగా కీర్తించే 'మోడర్నిటీ ' నుంచి - బయటపడుతూ భారతీయ రచనా విధానం తన స్వతంత్ర అస్తిత్వాన్ని పునరావిష్కరించుకోవటం మొదలుపెట్టాక, గ్రామీణతా చిత్రణ మన కథా కాల్పనిక సాహిత్యంలో కొత్త ప్రాధాన్యం పొందటం మొదలుపెట్టింది. ఓ వైపునుంచి నగరీకరణ ( అర్బానిటీ) ఒక ధ్రువం కేసి లాగుతూంటే, మరో వైపు నుంచి గ్రామీణత (రూరాలిటీ) మరో ధ్రువం కేసి మన సృజనను లాగటం మొదలుపెట్టింది. ఎనభైల నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు ఈ రెండే భారతీయ కథా కాల్పనిక సాహిత్యానికి ప్రధాన చోదక శక్తులుగా మారాయి. ఓ దశలో ' గ్రామీణత' ఎంత ప్రధాన మార్కెట్ కథా వస్తువైందంటే, యద్దనపూడి సులోచనారాణి వంటి మోస్ట్ పాపులర్ ప్రేమ కథా రచయిత్రి కూడా, మీనా వంటి నవలను గ్రామీణ నేపథ్యంతో సృష్టించే స్థితి వచ్చింది. నగరీకతను త్రోసి రాజంటూ, గ్రామీణత అంతటి మార్కెట్ ప్రాధాన్యాన్ని పొందింది.
అప్పటి ఆం.ప్ర. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య సి. సుబ్బారావు గారు ఏ లోకంలో ఉన్నారో, తొంభైల మధ్యలో మా తులనాత్మక అధ్యయన కేంద్రంలో 'రూరాలిటీ అండ్ అర్బానిటీ ఇన్ ఇండియన్ లిటరేచర్ ' మీద (ఆలిండియా) నేషనల్ సెమినార్ చేద్దామనుకున్నాం కూడా!.. కానీ అంతలో పూజ్యశ్రీ ఎన్టీఆర్ గారి ఆకస్మిక మరణం సంభవించడంతో, వారి స్మారకంగా 'ఫిల్మ్ అండ్ లిటరేచర్ ' మీద జాతీయ సదస్సు నిర్వహించాను.
అప్పటి గ్రామీణతాచిత్రణ లోనూ రెండు ప్రముఖ ధోరణులు : ఒకవైపు అందంగా గ్రామీణతను వైభవీకరిస్తూ చేసే గుణగానం, మరోవైపు ఒళ్ళు జలదరింప చేసే గ్రామీణ వాస్తవికతల భీకర చిత్రణ. వీటి మధ్య యథార్థ జీవన వాస్తవికతలను, వాటి సామాజిక తాత్త్వికతను సంయమనంతో చిత్రించే నవలలే అరుదయ్యాయి.. మునుపటి వాటిని ఏ ఒకటి రెండింటినో మినహాయిస్తే, డెబ్బైల తర్వాత అలాటివి దాదాపు కరువయ్యాయి.
ఆ కష్టాలు కార్పణ్యాల మధ్య, హెచ్చుతగ్గుల నడుమ, ఊపిరి తిప్పుకొనే గ్రామీణ బంధాల, అనుబంధాల చిత్రణ - " ఊరు" చిత్రణ దాని ఉన్నతి, అవనతుల చిత్రణ సంక్షిప్తంగా సజీవంగా బలంగా ఉన్న నవలలు , రాలేదనే చెప్పాలి.

ఇదిగో ఇన్నాళ్లకు ఆ కొరతను తీర్చే మంచి రచన " కిలారి " నవలా రూపంలో డా. బి నాగశేషు చేతుల మీదుగా వచ్చింది.
కిలారి అంటే పశువుల మంద. అవి ఊరందరికీ చెందిన ఆవులూ, గేదెలూ కావచ్చు, కొందరు వ్యక్తులకు/ కుటుంబాలకు చెందిన గొర్రెలూ మేకలే కావచ్చు, పందులు వగైరా చిల్లర జీవాలే కావచ్చు...‌ అవన్నీ నాటి ఆర్థిక స్వరూపాల్లో భాగం, గ్రామీణ క్షేత్ర సమృద్ధిలో భాగం. ప్రకృతి సమతుల్యతా పరిరక్షణలో భాగం. వాటిని మేపి కాపాడే వారి ఇంటిపేరు, కొన్నిచోట్ల కులంపేరు కూడా కిలారి గానే నిలిచిపోయింది....ఓ విధంగా, అర్థవిస్తరణను దృష్టిలో పెట్టుకొని ప్రతీకప్రాయంగా చూస్తే, బౌద్ధిక చైతన్యం లేని మనుషుల మందలతో నిండిన ఊరు కూడా ఓ కిలారి నేమో! అది వేరే విషయం..!
అనంతపురం జిల్లా కడ అంచుల్లో ఉన్న కురుబ కులానికి చెందిన ఓ కిలారి కుటుంబంతో ఈ నవల మొదలవుతుంది. వారితో పాటు ఊళ్లోని అన్ని వృత్తుల వాళ్ళ జీవన చిత్రణతోనూ, వారి మధ్య ఉన్న ఆర్థిక - సామాజిక సంబంధాలు, హెచ్చు తగ్గుల వివక్షలు, మంచీ చెడుల చదరంగంతో నవల సాగుతుంది. వ్యక్తి కథలనే గుంజలకు కట్టుబడి పోకుండా, ఊరందరి కథగా, ఊరి ఆత్మ కథగా పరిణామం పొందుతుంది. పల్లెటూరి కులవివక్షల అవమానాలకు, కష్టాల కడగండ్లకూ గురైన, కొందరు నిమ్న వర్గీయులు ఊరును వదిలి, బెంగళూరు వంటి నగరం చేరి, అదృష్టం కలిసిరావటంతో, అక్కడ ఆధునీకరించబడ్డ తమ కులవృత్తి వ్యాపారాల్లోనూ, రియల్ ఎస్టేట్ బేరాల్లోనూ బాగా ఆర్జించినా, తమ మూలాల్ని మరిచిపోకుండా, ఊరికి, ఊరి జనాలకి , మునుపటి అవమానాలను, కోప తాపాలను ఏవీ మనసులో ఉంచుకోకుండా, స్నేహ పూర్వకమైన సహాయం అందించి, ఊరికి ఉపకారాలు చేయటంతో, చక్కటి సౌహార్ద భావంలో పరిసమాప్తమవుతుంది. ఇన్ని స్వార్థపూరితమైన దుశ్చర్యలున్నా, తన-మన అనుకొనే ఆ జీవకారుణ్యమే ఊరుకున్న గొప్ప లక్షణం. సాధారణ ప్రజకుండే స్వాభావిక వారసత్వం... ఎన్ని హెచ్చుతగ్గుల వికృతులున్నా, ఎన్ని ఉన్నతి - అవనతుల అనుభవాలు చోటుచేసుకొన్నా , ఊరు అనే సంకీర్ణ వాస్తవంలోని నైసర్గిక శక్తే అది! దాన్ని అత్యంత సహజంగా , ఎక్కడా ఏ కృత్రిమ సన్నివేశానికి చోటివ్వకుండా చిత్రించటంలో రచయిత అద్భుతమైన విజయం సాధించాడు. అదే ఈ నవలను ఉత్తమ రచన స్థాయిలో నిలబెడుతున్నది. 

రచయిత డాక్టర్ నాగశేషు

ఇలాంటి నవలా నిర్మాణానికి ఎంతో సాహసం, నేర్పూ కావాలి. ఇదో జటిలమైన ఇతివృత్త నిర్మాణం. మొదట్లోనే అన్నట్లు, 'సంకీర్ణ వాస్తవికత' నిర్మాణం. ఇటీవలి దశాబ్దాలలో, జటిలమైన సంకీర్ణ వాస్తవికతల నిర్మాణాన్నే తెలుగు రచయితలు మరచిపోయారంటే అతిశయోక్తి కాదు. ఎంతసేపూ సినిమాటిక్ హీరోయిజం చూపే వ్యక్తి కేంద్రిత రచనలే కానీ, వ్యవస్థా చిత్రణ రచనల మాటే మరిచిపోయారు. పత్రికల కోసం అడుగడుగునా మలుపులు, సినిమాల కోవలో పాత్ర చిత్రణలు. నవల తన స్వతంత్ర అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోయిందన్నట్లు, అసలు నవలా యుగమే అంతరించిపోయిందేమో అన్నట్లు తయారైంది పరిస్థితి. అలాంటి నీరవకాలంలో , ఓ యువ రచయిత కేవలం 150 పుటల్లో, ఇంత జయప్రదంగా ఇలాంటి సంకీర్ణ వాస్తవిక నవలను నిర్మించాడంటే అత్యంత విస్మయాత్మకంగా ఉంది. అదీ ఆసాంతం తమ ఊరి భాషలోనే, ఎక్కడా రసవత్తత తగ్గకుండా, కథనం చేశాడంటే మరీ ఆశ్చర్యకరంగా ఉంది. ప్రాంతీయ సమస్యలను చిత్రించడానికి మాండలిక భాషను ఎన్నుకోవడం వేరు; ఒక ఊరి చైతన్యాన్ని, అక్కడి ప్రజాజీవితాన్ని సహజంగా చిత్రించడానికి, ఆ ఊరి నానా జాతుల భాషనే ఎంచుకొని, ఆసాంతం అందులోనే కథనం చేయటం వేరు.. అందుకు ధైర్యంతో పాటు, భాష మీద పూర్తి పట్టు కావాలి. ఆ జాతుల పట్ల ఆత్మీయతాభావం ఉండాలి. వారి భాష పట్ల ప్రీతి ఉండాలి. డాక్టర్ నాగశేషు అలాటి సాహసంతోనూ, ఆత్మీయ తన్మయీ భావంతోనూ ఈ రచన చేశాడు. అంతరించిపోయే మారుమూల పదాలను గ్రంథస్థం చేశాడు. ఆ భాష వల్లనే ఆ అతి నిమ్న పాత్రలను ఆత్మీయంగా మలిచాడు. వాటిపట్ల సహానుభూతి కలిగేలా చిత్రించాడు. ఆ సాదా సీదా ఊరి జనం మాటల్లోనే ఎన్నో "ప్రేరణాత్మక" సత్యాలను చెప్పాడు.

" కాసిపుల్లతో కదిలిచ్చేది, కాడుమానుతో పెట్టిచ్చుకునేదే'ల?" , "చెబితే వినకున్న్యోన్ని, సెడితే సూడల్లంటారు పెద్దోళ్ళు ", " యా కులమూ లేదప్పా, మనుషుల మోసాలకు కులమొక నెపం గాని!" వంటి జాతిముత్యం వాక్యాలను, జీవన సత్యాలను కుమ్మరిస్తాడు. నానాజాతుల 'ఒక్క' ఆత్మను- అదే ఈ 'జాతిఆత్మ' ను- ఆవిష్కరిస్తాడు.
దాన్ని మీరే చదువుకుని దర్శిస్తే కలిగే తృప్తి వేరు.
2024 సం. 'సిరికోన - జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా పోటీ' లో ఉత్తమ నవలా పురస్కారాన్ని కైవశం చేసుకొన్న ఈ మంచి నవలలోకి విశ్వాసంగా వెళ్ళండి... విస్మయం అనుభూతిని పొందండి...
పుస్తకాల కోసం 9985509053 నెంబర్ కి సంప్రదించండి.

― గంగిశెట్టి లక్ష్మీనారాయణ

(ప్రముఖ తెలుగు పండితులు, రచయిత, విద్యావేత్త ఆచార్య గంగిశెట్టి లక్ష్మినారాయణ 1–8–2025న  అమెరికాలో మరణించారు. దానికి వారం రోజుల ముందు ఈ సమీక్ష రాశారు)




Tags:    

Similar News

అమ్మ చీర