‘వందే భారత్’ ప్రయాణం ఒక చేదు అనుభవం
ఆర్భాటంగా ప్రారంభించి అధ్వాన్నంగా నడపడంలో మనవాళ్లకు అవార్డులు ఇవ్వవచ్చు;
By : The Federal
Update: 2025-07-29 04:16 GMT
వందే భారత్ (Vande Bharat) లో నా మొదటి ప్రయాణం కొద్ది రోజుల కిందట కాచిగూడ నుంచి అనంతపురానికి సాగింది. చాలా కాలంగా ఎదురుచూస్తూ ‘వందే భారత్’ ప్రయాణం నా జీవితంలో అత్యంత అసౌకర్యకరమైన అనుభవంగా మిగిలిపోయింది. మంచి అనుభవం పంచితే ఆ ప్రయాణం గొప్ప పాఠం, పంచలేని ప్రయాణం ఓ గుణపాఠం. ప్రయాణానికి ముందు కొన్ని వీడియోలు చూసి ఎంతో కొంత నమ్మకంతోనే ఎక్కాను. ప్రచారం అంచనాలు పెంచింది కానీ, వాస్తవం పూర్తిగా భిన్నం, అనుభవం నిరాశ కలిగించింది.
ఈ ప్రయాణం నాకు నా ఇంటర్, ఎంసెట్ కోచింగ్ హాస్టల్ రోజులను గుర్తు తెచ్చింది. భారీగా ఫీజులు చెల్లించి, మంచి భోజనం లేదా టాయిలెట్ల గురించి నేను అడిగితే,"నీవు ఇక్కడ చదవడానికి వచ్చావా? లేక తినడం కోసమా?" అని ఎగతాళి చేయడం జరిగేది. అమ్మానాన్న కూడా సర్దుకుపోవాలి అని చెప్పేవారు.ఆ వాతావరణంలో, అవసరమైన వసతి సౌకర్యాలపై మాట్లాడటం తక్కువ స్థాయిగా భావించేవారు.
కాలం మారినా, ఇప్పటికి ప్రశ్నిస్తే అదే అభద్రతా భావన ఇక్కడ ‘వందే భారత్’లోనూ అనిపించింది. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలన్నది అసాధారణమైన డిమాండ్ కాదని గుర్తించడంలోనే లోపముందని అనిపించకపోవడంతో పాటు, దానిపై ఆలోచించే సంస్కృతి కూడా నాకు కనిపించలేదు. అనుభవించండి. మేమేమి చేయలేం. అంతే మరి అనే ధోరణి.
ముందుగా వందే భారత్ రైలులో సీటింగే మొదటి నిరాశగా గురిచేసింది. చిన్నవి, గట్టిగా ఉండే సీట్లు, నడుం మడవలేని విధంగా ఉండడమే కాదు,ఎంతో అశ్రద్ధగా రూపొందించబడ్డవి. కట్టేసిపడేసినట్టుగా ఉండడం నన్ను చాల ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. కాళ్లు సర్దుకోలేని స్థలంతో పాటు, ప్రకాశవంతమైన లైట్లు కంటికి ఇబ్బంది కలిగించాయి. ఇవి ప్రయాణంలో అసహనాన్ని పెంచేసాయి. ఇది భారతదేశపు అత్యాధునిక అంటే మోస్ట్ మోడర్న్ ట్రైన్ అనిపించలేదు, ఒక పాత ప్రయాణ పరీక్షనే కొత్తగా అనుభవించినట్టుంది.
రైలు లోపల వసతు (infrastructure)ల విషయానికొస్తే పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం మాత్రమే కాదు, కొన్ని 'పనిచేయుట లేదు' అని బోర్డులు ఉండడం, కొన్ని పూర్తి స్థాయికి పని చేయకపోవడమూ చూస్తే చిరాకు కలిగించింది.
భోజనం కూడా నిస్సారంగా ఉంది. రుచి లేని రీతిలో వండారు, వడ్డించారు. ఇలాంటి సేవలు ISKCON లాంటి సంస్థలకు అప్పగిస్తే బాగుంటుంది, నాణ్యత, ప్రయోజనం, లాభం అనే మూడింటిని సమతుల్యంగా పరిగణించే వారు కావాలి.ఒక్కప్పుడు నంది పైపులు వాళ్ళనుకుంటా రూపాయికి రొట్టె, పప్పు భోజనం ఇచ్చేవారు. అదెలాగో తెలుసుకొని ప్రయత్నిస్తే బాగుంటుంది.
ప్రధాని మోదీ గారి రైళ్ల పట్ల ఉన్న మమకారం అందరికీ తెలిసిన విషయమే. ‘వందే భారత్’ వంటి ప్రాజెక్టులు ఆయనకు ప్రీతిపాత్రమైనవి. అలాంటి ప్రాజెక్టులు ప్రయాణికుల అనుభవం ఆధారంగా పురస్కారమే కాదు, గౌరవాన్ని పొందాలి. మంచి సౌకర్యవంతమైన ప్రయాణాలు, వేగం, నినాదాలతో కాదు సౌకర్యవంతమైన సీట్లు, నాణ్యమైన ఆహారం, శుభ్రమైన టాయిలెట్లు, భద్రతా ప్రమాణాలతోనే గౌరవం కలుగుతుంది. మన్ననలు పొందుతాము.
ఈ ప్రయాణంలో నాకు బలంగా తెలిసిందేంటంటే, ప్రజాసేవా వ్యవస్థలు మన దేశంలో సాధారణంగా ప్రచారంపై మాత్రమే నడుస్తుంటాయి. నాణ్యం, సామర్థ్యం మీద మాత్రం కాదు. ప్రజలు ఏమి అనుభవిస్తున్నారు, వారు ఏమి కోరుతున్నారు అన్నది వ్యవస్థలో ఎక్కడా ప్రతిబింబించదు. మార్పు కోసం ఇచ్చే సూచనలు స్వాగతించక పోవడమే కాదు, వాటిని పట్టించుకోరనే భావన బలంగా కనిపిస్తుంది.ప్రయాణికుల ఆలోచనలతో పోటీపడడం అలవర్చుకోవాలి. చివరికి ఈ ప్రయాణం మాత్రం అసహనంగా, అసంతృప్తిగా మిగిలిపోయింది.
అంతిమంగా, ఒక ప్రశ్న మిగిలింది, అధికారులు, సంస్థలు నిజంగా ఏదైనా నేర్చుకుంటారా? మౌలిక సౌకర్యాలు, మానవీయత, నాణ్యత అనే విలువలు ఎప్పుడైనా అర్థమవుతాయా? పెద్ద బడ్జెట్‌లు, గొప్ప పదజాలం, బ్రాండ్ లాంచ్‌లతో కాదు, అసలైన నాణ్యత అనేది ప్రయోజనకరమైన అనుభవాన్ని ఇవ్వడంలోనే ఉంటుంది. మార్పు అక్కడ మొదలవుతుంది.
వందేభారత్ రైలు తొలిప్రయాణం మర్చిపోలేని అనుభవం.
---రామ్ చింతకుంట