భగత్ సింగ్ అనుచరుడు మహాశ్వేతాదేవి స్నేహితుడు ‘నిర్మలానంద’

నేడు నిర్మలానంద ఏడవ వర్ధంతి;

Update: 2025-07-24 10:02 GMT

భలేవాడు. నవ్వుతూ పలకరిస్తూ వస్తాడు. భుజాన వున్న పుస్తకాల సంచిని టేబుల్ మీద పెట్టి మాటలు మొదలుపెడతాడు. ఎక్కడనించి వస్తున్నారు నిర్మలానందగారూ? అని అడిగితే, ఢిల్లీ,కాశ్మీరు, ఒరిస్సా,పంజాబ్ –లాంటి వూళ్ళ పేర్లు చెబుతాడు. లోకసంచారి. మందు తాగని, సిగరెట్ కాల్చని పాతతరం విప్లవకారుడు. సరదా మనిషి. కుర్రాళ్ళలోనూ కలిసిపోతాడు. ఈసారి ప్రజాసాహితి కవర్ బాగా రావాలి మోహన్ అనేవాడు. టీ తాగితే చాలు. కథలు, నవలలు,కవిత్వం-ఎన్ని కబుర్లో ....ఒక అరుదైన సాహితీ వ్యక్తిత్వం. కల్మషం లేని మనిషి.ఒక జీవితకాలంలో అలాంటి వాళ్ళని కొద్దిమందినే చూడగలం.

శ్రీశ్రీ మహాప్రస్థానం హిందీలో కూడా వుందని తెలుసుగా! హిందీలోకి తర్జుమా చేసిందెవరో తెలుసా?నిర్మలానందే! భగత్ సింగ్ రచనలన్నీ తెలుగులోకి తెచ్చిన వాడు ఆయనే. భీమ్ సేన్ నిర్మల్, కాళోజీ,మహాశ్వేతాదేవి ....లాంటి అపురూపమైన వ్యక్తులు ఎందరో ఆయనికి సన్నిహితమిత్రులు. విశాఖ జిల్లా అనకాపల్లి వాడు. మధ్యతరగతి నేతగాళ్ళ కుటుంబం. రైల్వేలో గుమాస్తాగిరీ. నలుగురు బిడ్డల తండ్రి. దేశంలో ఏ మూలకైనా రైలేసుకుపోయేవాడు. కొత్తా లేదు, పాతా లేదు. ఎవరితోనైనా కలిసిపోతాడు. ఒక పని మీద వస్తాడు. అది సాధించుకునే వెళతాడు. పదిమందితో రాయిస్తాడు. రాయమని వేధిస్తాడు. “రాయవలసిన వాళ్ళంతా రాయాలి. లేకపోతే రాయగూడని వాళ్ళు రాసేస్తారు. చరిత్ర క్షమించదు”అనేవాడు.


హిందీ,ఉర్దూ, ఇంగ్లీషు ఆయనకి కరతలామలకం. బెంగాలీలో ధారాళంగా మాట్లాడతాడు. ఇక ఒడియా భాషంటే వొడియాలు నమిలినట్టే. శ్రీశ్రీ కవితల్ని,శీలా సుభద్రాదేవి ‘యుద్ధం ఒక గుండె కోత’నూ,శీలా వీర్రాజు,కుందుర్తి, ఛాయారాజ్ కవితలను హిందీలోకి అనువదించారు. మహాశ్వేతాదేవి రచనలను తెలుగువాడికి అందించినవాడు ఈ మహానుభావుడే! ప్రేమ్ చంద్, శరత్ చంద్రలను హిందీలోనే చదువుకున్నాడు. కిషన్ చందర్ నీ, రావిశాస్త్రినీ హిందీలోకి అనువదించాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలు కొన్నింటిని భీమ్ సేన్ నిర్మల్ లో కలిసి తర్జుమా చేసి, “ఆగ్ ఉగల్తాహువా, ఆస్మాన్ ఓర్ బడతా హువా”పేరుతో ప్రచురించారు. దానిని, తెలుగు సాహిత్య చరిత్రని మలుపు తిప్పిన 1970 నాటి శ్రీశ్రీ షష్టిపూర్తి సభలో కాళోజీతో ఆవిష్కరింపజేశారు. కుందుర్తి కవితలను ‘మేరే బినా’ పేరుతో హిందీలో చేశారు. సాహిత్య అధ్యయనం వల్ల మార్క్సి జానికి చేరువయ్యారు. ప్రజల కోసం ఎద్దులా కష్టించి పని చేయడమనే తత్వాన్ని చైనా రచయిత లూషన్ నుంచి ప్రేరణ పొందారు. పాలస్తీనా ప్రజావిముక్తి పోరాటానికి సంఘీభావంగా “నేను నేలకొరిగితే” పుస్తకం తెచ్చారు. భగత్ సింగ్ రచనల అనువాదం కోసం ఆయన రేయింబవళ్ళు పని చేశారు. భగత్ సింగ్ కి సంబంధించిన కొన్ని కీలకమైన చారిత్రక పత్రాలు నిర్మలానంద వల్లే వెలుగు చూశాయి. భగత్ సింగ్ సహచరుడు యశపాల్ రాసిన “సింహావలోకనం” , “రామరాజ్యం”లను అనువదించారు.

భగత్ సింగ్ వ్యక్తిత్వం, సిద్ధాంతం ఆయన్ని బాగా ప్రభావితం చేశాయి. 1996 లో హైదరాబాద్ లో ఆర్టిస్ట్ మోహన్ ఆఫీసుకి వచ్చిన నిర్మలానంద, “పంజాబ్ నుంచి వస్తున్నాను. భగత్ సింగ్ బంధువుల్ని పట్టుకుని, ఆయన వూరెళ్ళి భగత్ సింగ్ కూర్చున్న నులకమంచం మీద కూర్చుని వచ్చాను. చాలా ఆనందంగా వున్నాను. అంతకంటే ఏం కావాలి?”అన్నారాయన. భగత్ సింగ్ తమ్ముని కూతురు వీరేంద్ర సింధు దాచి వుంచిన అనేక పత్రాలను హిందీలోకి తర్జుమా చేశారు. భగత్ సింగ్ రచనల్ని సంపూర్ణంగా తెలుగువాళ్ళకి అందించాలనే పట్టుదలతో పని చేశారు.

ఫైజ్ అహ్మద్ ఫైజ్,అలీ సర్దార్ జాఫ్రీ, కోట శివరామ కారంత్,కైఫీ అజ్మిల రచనలు మనకోసం అనువదించారు. ముఖ్యంగా మహాశ్వేతాదేవి, అవతార్ సింగ్ పాష్, మగ్దూం మొహియుద్దీన్ ల సాహిత్యంపై నిర్మలానంద కృషి మరిచిపోలేనిది. అల్లూరి సీతారామరాజుపై వచ్చిన వ్యాసాల సంకలనం, ‘మన్యం వీరుని పోరాట దారిలో’ విజయనగరం జిల్లా దుగ్గేరు గిరిజనుల నడుమ మహాశ్వేతాదేవితో ఆవిష్కరింపజేసినవాడు. సీతారామరాజు జయంతి సందర్భంగా, విశాఖలో పదివేలమంది ఆదివాసీలతో ప్రదర్శన,అక్కడ మహాశ్వేతాదేవి ప్రసంగం వెనక నిర్మలానంద కృషి, పట్టుదల గొప్పవి. ప్రఖ్యాత పంజాబీ కవి అవతార్ సింగ్ పాష్ ని ఖలిస్తాన్ టెర్రరిస్టులు కాల్చి చంపిన తర్వాత, పాష్ కవితలు అనువదింపజేసి పుస్తకం తెచ్చిందీ ఈయనే. నిర్మలానంద చేసిన శ్రీశ్రీ మహాప్రస్థానం హిందీ అనువాదాన్ని 2011 లో తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ప్రచురించింది. అనువాదమూ ఒక సృజనాత్మక రచనే అని రుజువు చేసిన వాడాయన. 1955 లోనే ఆయన తొలి కథ అచ్చయింది. “ఇతర భాషల్లో వున్న గొప్ప సాహిత్యం చదివిన తర్వాత వీటన్నిటినీ తెలుగు పాఠకులకి అందించడం కన్నా గొప్ప పని ఇంకేముంటుంది?అందుకే నేను స్వతంత్ర రచనలు మానుకున్నాను”అన్నారాయన.

“ఒక పువ్వు వికసించడానికి తోడ్పడినంత కాలం,ఎరువుగా వుపయోగపడడానికి కూడా నేను సంతోషంగా సిద్ధమవుతాను’అన్న రచయిత లూషన్ మాటలకు నిలువెత్తు నిదర్శనం నిర్మలానంద.

1991లో రైల్వే నుంచి రిటైర్ అయ్యాక ‘ప్రజాసాహితి’ సంపాదకుడయ్యారు. సమిష్టి కృషితో 177 సంచికలు తేగలిగారు. అటు దివికుమార్, ఇటు కొత్తపల్లి రవిబాబు ..... అలుపెరుగని నిర్మలానంద ప్రజాసాహితిని ఉద్యమ పత్రికగా నిలబెట్టారు. వ్యాసాలు రాయించి, అనువాదాలు చేయించడంలో నిర్మలానంద చాకిరీ అంతాయింతా కాదు. తెల్లవారకముందే కవులూ,రచయితలకు ఫోన్లు చేసి లేపేవాడు. “రాయండి,నేను మిమ్మల్ని నిద్రపోనివ్వను”అనేవాడు. చనువుగా, ఇష్టంగా విసుక్కుంటాడు. సుతిమెత్తగా మందలిస్తాడు. అతడే, సాహిత్యానికి పర్యాయపదంగా బతికినవాడు. ప్రచారం పడని,డాంబికం లేని, విశ్రాంతి అంటే తెలీని వినమ్రుడైన కార్యకర్త!

అందుకే నిర్మలానందని –

‘అక్షరానికి ఓనమాలు నేర్పగల నేర్పరి

వాక్యాలను కవాతు చేయించగల సేనాని’ అన్నాడు కవి ఉదయ్.

ప్రజాకళలు,ప్రజాసాహిత్యం అని పరితపించి 84 ఏళ్ళ వయసులో 2018 జూలై 24న హైదరాబాద్ లో ఆ సాహితీవేత్త మనల్ని వీడి వెళ్ళిపోయారు. విప్లవోద్యమ కార్యకర్తలంతా కన్నీళ్ళు పెట్టుకున్నారు.

“నూరేళ్ళు బతుకుతాను. మీ మధ్యే బతుకుతాన్నేను. మన గురించి కాదు,మన శక్తి కొద్దీ మన దేశం గురించి పని చేద్దాం” ఇవీ నిర్మలానంద చివరి మాటలు. 

Tags:    

Similar News

కష్ట కాలం