మనసు మాట్లాడుతుందని,
మనసుకు మాటలు ఉంటాయని,
మనసు అపరిమిత వాక్యాల సమాహారమని
నీ పరిచిత ప్రవాహంలోనే తెలిసింది
నీలాకాశం నిర్మలమే అయినా
సముద్రపు అలల తాకిడికి అప్పుడప్పుడు
అరుణారుణం అవుతుంది
ఇది జీవితమని అనుకున్నప్పుడు
ఇదే జీవితమని అనుకున్నప్పుడు కూడా..
నిష్కల్మషమైన నీ చిరునవ్వు చూస్తే చాలు
కౌంచపక్షుల్లా విహరించిన
అనుభూతులన్నీ ప్రత్యక్షమవుతాయి..
కాలం చాలా చిత్రమైంది కదా
కాలం మీద నీకెప్పుడు కోపం రాలేదా..
వచ్చి ఉంటుందిలే.
అసలు కాలమేగా ఎవరికైనా
ప్రథమ శత్రువు
మనుషుల్ని మమతల్ని
బంధాల్ని అనుబంధాల్ని
కలిపినట్లే కలిపి
కలసి నడిచినట్లే నడిచి
అనివార్యమైన యుద్ధాన్ని సృష్టించి
అడ్డుకోవడం, అడ్డుగోడ నిర్మించడం
ఆ కాలమే కదా..
కాలం ఎవరికి మాత్రం మిత్రులుగా ఉంటుంది
మనసున్న ఎవరూ కాలాన్ని ప్రేమించరు కదా..
అవును ఎందుకు ప్రేమించాలి కాలాన్ని?
కాలగమనంలో కలిసి నడుస్తున్నా
ఇరువురి నడకలు భిన్నద్రువాలవైపు
విభిన్న దారుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు..
కాలాన్ని కాక మరి ఎవరిని నిందిస్తాం..
నిజమే కదా
అయినా మనం ఏం మాట్లాడతాం?
సమాజమూ మనుషులూ
మనుషుల మధ్యన
వ్యక్తిత్వాల మధ్యన
సంఘర్షణల మధ్యన
సహనాల మధ్యన
ఎన్నో విభజనరేఖలు
ఎన్నోవైవిధ్యచిత్రాలు
ఎన్నో రేఖా చిత్రాలు
అయినా అందమైన
నా జీవన గమనంలో ఎప్పటికీ
నా ముఖచిత్రం నువ్వేకదా.
-కెంగార మోహన్