పల్లె మహిళలే ఆ పెట్రోల్‌ బంక్‌ యజమానులు !

పనిచేయడమే కాదు, ఈ పెట్రోల్‌ బంక్‌కి ఓనర్స్‌ కూడా మేమే... ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది;

Update: 2025-07-23 11:42 GMT
నారాయణ పేట జిల్లా, శింగారంలో మహిళా పెట్రోల్‌ బంక్‌

నారాయణ పేట జిల్లాలో దామరగిద్ద వైపు బయలు దేరాం. వాహనంలో పెట్రోల్‌ కోసం సింగారం చౌరస్తాలో ఆగాల్సి వచ్చింది. అక్కడ డీజిల్‌, పెట్రోల్‌ ను గన్స్‌తో నింపుతున్నారు ఆడ పిల్లలు !

‘ ఈ బంక్‌లో అంతా ఆమ్మాయిలే పనిచేస్తున్నారు. ఏమిటీ విశేషం ?’ అని పెట్రోల్‌ పోస్తున్న సోనీ అనే అమ్మాయిని అడిగాం.

బంక్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళలు

‘ ఇక్కడ పనిచేయడమే కాదు, ఈ పెట్రోల్‌ బంక్‌కి ఓనర్స్‌ కూడా మేమే... మీకు వివరాలు కావాలంటే మేనేజర్‌ని కలవండి ...’ అంది ఆ అమ్మాయి.చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది అనిపించింది. 


ఆఫీసులో కూర్చొని లెక్కలు చూసుకుంటున్న మహిళ దగ్గరకు వెళ్లాం.


‘ ఇది తెలంగాణ రాష్ట్రంలో మహిళలే నిర్వహిస్తున్న తొలి పెట్రోల్‌ బంక్‌. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇది ఏర్పాటు చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ’ అని చెప్పారు పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌ చంద్రకళ.

ఫెడరల్‌ తెలంగాణకు ఇంటర్వ్చూ ఇస్తున్న బంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న చంద్రకళ

అసలీ ఆలోచన ఎవరిది ? 

నారాయణ పేట జిల్లాకు గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కోయ శ్రీహర్ష తో ఒక రోజు మహిళా సమాఖ్య సభ్యులతో మీటింగ్‌ జరిగింది. సమాఖ్యకు ఆదాయ వనరులు లేవు ఎలా సమకూర్చుకోవాలనే చర్చ మొదలైంది.

‘ మీరంతా ముందుకు వస్తే పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేస్తాం. మీరు నిర్వహిస్తారా? ’ అని కలెక్టర్‌ అడిగారు.

తెలంగాణలో తొలి మహిళా పెట్రోల్‌ బంక్‌ ఆలోచనకు ఆధ్యుడు అప్పటి నారాయణ పేట జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

దాంతో మహిళా సమాఖ్య సభ్యులంతా ఉత్సాహంగా ముందుకు వచ్చారు.

వెంటనే ఆయన సింగారం లోని డిఆర్‌డిఎ ఆఫీసుకు ఆనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని జిల్లా మహిళా సమాఖ్య పేర రిజిస్ట్రేషన్‌ చేపించారు.పెట్రోల్‌ బంక్‌ నిర్వహణలో మహిళలకు శిక్షణ ఇప్పించి బిసిసిఎల్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతలో అనుకోకుండా కలెక్టర్‌ కి ట్రాన్స్‌ఫర్‌ అవ్వడంతో పనులు ఆగిపోయి, మహిళలు నిరుత్సాహానికి లోనయ్యారు. ఇక పెట్రోల్‌ బంక్‌ ప్రాజెక్టు కలగానే మిగిలి పోతుందని అనుకున్నారు.

అయితే తరువాత వచ్చిన కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మహిళల స్వయం సమృద్ధికి తోడ్పడే ప్రాజెక్ట్‌లోని వైవిధ్యాన్ని గుర్తించారు.

ఫైల్‌ని ముందుకు జరిపి, తెలంగాణలో తొలి మహిళా పెట్రోల్‌ బంక్‌ ని ఏర్పాటు చేయడంలో సక్సెస్‌ అయ్యారు.

అలా నారాయణపేటలో జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఫిబ్రవరి 21, 2025 న మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమక్షంలో ప్రారంభించారు.

పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి సీతక్క

అన్ని పనులు అమ్మాయిలే 

‘ ఈ పెట్రోల్‌ బంక్‌ 24 గంటలు పనిచేస్తుంది.ఆడపిల్లలు పగలు మాత్రమే పనిచేస్తారు. రాత్రి యువకులను నియమించుకున్నాం. అకౌంట్స్‌ నుండి పెట్రోల్‌ కొట్టడం వరకు మేమే చేస్తాం. ఈ పనుల వల్ల మాలో ఆత్మవిశ్వాసం కలిగింది. డిజిల్‌,పెట్రోల్‌ కలిపి 35000 లీటర్ల నిల్వ సామర్ధ్యం మా బంక్‌కు ఉంది.’ అన్నారు అపుడే వచ్చిన ట్యాంకర్‌ నుండి ఇంధనం బంక్‌లో నింపుతున్న వారిని పర్యవేక్షిస్తున్న మహిళలు.

రాత్రి పూట సిబ్బంది తక్కువగా ఉండటంతో పెట్రోల్‌ నింపే పనులు కూడా నిర్వహిస్తున్న బంక్‌ మేనేజర్‌ చంద్రకళ.

‘ గతంలో మహిళా సమాఖ్య ద్వారా కుట్లు, అల్లికలు, పచ్చళ్ల తయారీ వంటి వి చేసేవాళ్లం కానీ, పెట్రోల్‌ బంక్‌ నిర్వహిస్తాం అని ఎన్నడూ ఊహించలేదు. మొదట్లో ఇదంతా అవుతుందా ? అని సందేహించాం, ప్రభుత్వ ప్రోత్సాహంతో బంక్‌ ఏర్పాటు కావడంతో ఇక్కడ ఉపాధి దొరికింది, కొత్తలో వినియోగ దారులతో కొన్ని ఇబ్బందులున్నా తరువాత వారు మాకు సహకరిస్తున్నారు. మగ వాళ్లతో పాటు సమానంగా బంక్‌ని నిర్వహిస్తున్నాం. నాకు నెలకు 11 వేలు జీతం వస్తుంది’ అన్నారు ఇక్కడ పనిచేస్తున్న అంజమ్మ.

ఒకపుడు జడ్‌ ఎం ఎస ్‌( జిల్లా మహిళా సమాఖ్య ) వరి కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చే వాళ్లం. ఇపుడు పెట్రోల్‌ బంక్‌ నిర్వహణ మాలో ఒక ఉత్తేజం కలిగించింది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ బంక్‌ని 1.23 కోట్లతో నిర్మించగా , జిల్లా మహిళా సమాఖ్య 20 ఏండ్లపాటు నిర్వహణకు ఆ సంస్ధతో ఒప్పందం కుదుర్చుకుంది.

ట్యాంకర్‌లో వచ్చిన పెట్రోల్‌ని బంక్‌లో నింపిస్తున్న మహిళా సమాఖ్య సభ్యులు

బంక్‌ నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్‌ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా బిపిసిఎల్‌ ప్రతీ నెలా రూ.10 వేలు మా సమాఖ్యకు అందిస్తుంది. బంక్‌ నిర్వహణలో 10 మంది మహిళలకు ఉపాధి కలుగుతోంది. బంక్‌ నిర్వహణలో రోజూ వచ్చే ఆదాయ వ్యయాలు మహిళా సమాఖ్య సభ్యుల పర్యావేక్షణలో జరుగుతాయి. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.3లక్షల ఆదాయం అందుకుంటున్నాం. మా ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంతో ఈ పెట్రోల్‌ బంక్‌ ని చూసిన ఇతర మహిళా సమాఖ్యలు కూడా ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతీ జిల్లా లో మహిళా పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు చేస్తున్నారు .’ అని ఫెడరల్‌ తెలంగాణ ప్రతినిధికి వివరించారు, నారాయణపేట జడ్‌ ఎం ఎస్‌ అధ్యక్షురాలు, బంక్‌ మేనేజర్‌ చంద్రకళ .

ఇక ప్రతీ జిల్లాలో 

ఈ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ జిల్లాలో మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ఒక బంక్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఒక్కో బంక్‌లో 15 నుండి 20 మంది మహిళలకు ఉపాధి కలుగుతుంది. ఇక్కడ పనిచేసే వారు 20 నుండి 30 ఏండ్ల లోపు ఉండి పదో తరగతి ప్యాస్‌అయితే చాలు.

పెట్రోల్‌ డీజిల్‌లో నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తున్న మహిళలు

పెట్రోల్‌ బంక్‌లు నిర్వహించాలంటే విధి విధానాలు ఏమిటి?

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా మహిళా సమాఖ్యలు (ZMS – Zilla Mahila Samakhya) పెట్రోల్‌ బంక్‌లు నిర్వహించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఈ అవకాశాన్ని సాధారణంగా స్వయం సహాయ సంఘాల సమాఖ్యలు ద్వారా లేదా ప్రభుత్వ సంబంధిత సంస్థల ద్వారా పొందుతారు.

1. అర్హతలు:

జిల్లా స్థాయి మహిళా సమాఖ్య (ZMS) గా గుర్తింపు పొందిన సంఘం కావాలి.ఆ సమాఖ్యకి బ్యాంకింగ్‌, అకౌంటింగ్‌, నిర్వహణలో మినిమం అనుభవం ఉండాలి.

గత 3 సంవత్సరాల్లో మహిళల స్వయం సమృద్ధికి వివిధ కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉండాలి.

2.బంక్‌లు ఆఫర్‌ చేసే సంస్థలు:

ZMS లేదా మండల సమాఖ్యలు కేంద్ర ప్రభుత్వ PSU ఆయిల్‌ కంపెనీలతో భాగస్వామ్యంగా పెట్రోల్‌ బంక్‌ నిర్వహించవచ్చు: HPCL – Hindustan Petroleum, IOCL – Indian Oil, BPCL – Bharat Petroleum కంపెనీలు సామాజిక బాధ్యత (CSR) కింద SHG సమాఖ్యలకు డీలర్‌ షిప్‌ను ఇస్తాయి.

3. దరఖాస్తు విధానం

Expression of Interest (EOI) ప్రకటన వస్తే దానికి సమాఖ్య దరఖాస్తు చేయాలి.

దరఖాస్తులో ZMS వివరాలు, గత పనితీరు, ఎక్స్‌పీరియన్స్‌, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు, ఆదాయ వ్యయాలు ఇవ్వాలి.

నామినేట్‌ అయిన లొకేషన్‌కి ఆయిల్‌ కంపెనీ feasibility survey చేస్తుంది.

4. భూమి అవసరం:

కనీసం 800–1000 sq. meters స్థలం అవసరం.

అది రహదారి ప్రక్కన ఉండాలి, ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉండాలి.

భూమి సొంతంగా లేదా లీజు ద్వారా లభ్యమైతే చాలు.

5. పెట్టుబడి:

సాధారణంగా ZMS కి స్టార్ట్‌-అప్‌ ఖర్చులు కొన్ని లక్షలు వస్తాయి. ఆయిల్‌ కంపెనీ కొన్ని పరికరాలు ఉచితంగా ఇస్తుంది.

కొన్ని సందర్భాల్లో బ్యాంక్‌ నుండి లోన్‌ కూడా మంజూరవుతుంది (స్వయం సహాయ సంఘాల బ్యాంక్‌ లింకేజ్‌ ఆధారంగా).

6. శిక్షణలు, నిర్వహణ:

ఆయిల్‌ కంపెనీలు లేదా SERP ప్రాథమికంగా బిజినెస్‌ మోడల్‌, బంక్‌ నిర్వహణపై శిక్షణ ఇస్తాయి.

సమాఖ్యలోని సభ్యులు బంక్‌ నిర్వహణ, అకౌంటింగ్‌, భద్రత వంటి అంశాల్లో శిక్షణ పొందాలి.

సమాఖ్య బోర్డు ఆధ్వర్యంలో పారదర్శక లావాదేవీలు జరగాలి.

7. పరిశీలించాల్సిన అంశాలు:

భద్రతా ప్రమాణాలు పాటించాలి (fire safety, underground tank standards, etc.) ప్రాక్టికల్‌ వ్యయాన్ని, వర్కింగ్‌ స్టాఫ్‌ అవసరాన్ని ముందుగానే అంచనా వేయాలి.

తగిన గిరాకీ కలిగిన ప్రదేశాన్ని ఎంపిక చేయాలి.

Tags:    

Similar News

కష్ట కాలం