నాటి ‘టెంట్’ సినిమా అనుభవం ఇపుడెక్కడొస్తుంది?
ఇప్పుడు ఎన్ని సౌకర్యాల మధ్య సినిమా చూస్తున్నా ఆ ఉత్సాహం, ఆనందం రావడం లేదు.;
-మండలపు శ్రీనివాసరావు
అప్పట్లో టికెట్ల ధర : నేల 60 పైసలు
బెంచి 1 రూపాయి
కుర్చీ 1.25 పైసలు.
హాల్ ప్రత్యేకత ఏమిటంటే టికెట్లు ఇస్తూనే ఉంటారు.
నేల ఫుల్ గా నిండి ఒకరి భుజాలమీద ఇంకొకరు కూర్చున్నా booking ఆగదు.
లోపల భీకర యుద్ధాలు జరుగుతున్నాగేట్ కీపర్ చలించడు.
బెంచి క్లాస్ లో ఎక్ స్ట్రా బెంచెస్. బాల్కనీ లో ఇనుప కుర్చీలు వేస్తారు.
నేలకి ఆ సౌకర్యం లేదు.
కొందరైతే స్క్రీన్ ముందున్న అరుగు మీద కూర్చుని కొండల్లా కనిపించే హీరో ముఖాన్ని చూసి జడుసుకునే వాళ్ళు.
ఆడవాళ్ళు నేల క్లాస్ లో కుళాయి నీళ్లలా ధారాపాతంగా బూతులు, కొందరైతే జుత్తు పట్టుకొని ఉండలా దొర్లే వాళ్ళు.
ఫస్ట్ షో కి వచ్చిన ఆడవాళ్ళు సెకండ్ షో వరకు తిట్టుకునే వారు.
ఈ ఉత్సాహంలో సినిమా స్టార్ట్ అయ్యేది.
ఊపిరాడని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగరెట్లు ముట్టించి "బుస్సు" మని పొగ వదిలే వారు.
తాగిన వాళ్ళకి, తాగని వాళ్ళకి సమానంగా దగొచ్చేది.
సినిమా మంచి రసపట్టు లో అంటే ఎన్టీ ఆర్.
కత్తిని ముద్దు పెట్టు కొని ఒంటి చేత్తో తిప్పుతున్నపుడు రెండు ఈలలు, N.T.R. డూర్ రెండు చేతులతో తిప్పుతున్నపుడు పది ఈలలు వినిపిస్తూ ఉండగా అందరినీ తొక్కుకుంటూ కొందరు ప్రవేశిస్తారు
" ఎవరికయా నిమ్మ సోడా", అని ఒకరు,
" వేయించిన శనగకాయలు" అని ఇంకొకరు,
" చకిలం, చకిలం "
ఇలా రాగయుక్తంగా పాడుతూ అడిగిన వాళ్ళకి కుయ్ మని సౌండ్ తో సోడా, తుప్పు పట్టిన పావు తో శనగకాయలు కొలిచి ఇచ్చేవారు.
ఇంత ఇరుకు లో కూడా పద్మనాభం, రాజబాబు వస్తే జనం పక పక నవ్వే వాళ్ళు.
అంజలీదేవి చూసి ఏడిచేవారు.
ఇక బెంచి క్లాస్ కి వెల్దాం.
థియోటర్ పుట్టినప్పుడు కొన్ని వేల నల్లులు బెంచీలలోకి వలస వచ్చాయి.
ఆడియన్స్ రాకకోసం ఎదురు చూస్తూ, వచ్చిన వెంటనే కుటుంబ సమేతంగా దాడి చేస్తాయి.
మొదటి సారి కుట్టినప్పుడు ఉలిక్కిపడతాం. రెండో సారి పడతాం. తర్వాత అలవాటు పడతాం.
ఆ దురద తట్టుకోలేక కొందరు లేచి నిలబడి గీరుకుంటారు.
వెనుక ఉన్న వాళ్ళు కూచో మని అరుస్తూ ఉంటారు.
కొందరు సీనియర్ ఆడియన్స్ ఉంటారు.
వాళ్ళకి నల్లులు తో అనుభవం తో పాటు శాశ్వత శత్రుత్వం ఉంటుంది.
అందుకని అగ్గిపుల్ల గీసి బెంచి సందులో తిప్పుతారు.
దీంతో ప్రయోజనం ఏమిటి అంటే కొన్ని నల్లులు వీరమరణం పొందుతాయి.
అయితే కసి, పగ, ప్రతీకారంతో మిగిలిన నల్లులు కుట్టడం ప్రారంభిస్తారయి.
ఈ కుట్లకి ఆడియన్స్ బెంచీలమీద ఎగిరి ఎగిరి పడుతూ ఉంటారు.
ఈ క్లాస్ లో కూడా పొగ ఉచితం.
బీడీల కంపు తక్కువ, సిగిరెట్ల కంపు ఎక్కువ.
ఇక బాల్కనీ
బాల్కనీ లో కుర్చీలు వేస్తారు.
వాటి చర్మం చిరిగి పోయి లోపల ఉన్న కొబ్బరి పీచు, దూది, పొట్ట పేగులు లా కనిపిస్తూ ఉంటాయి.
కుర్చీల్లో పెద్దగా నల్లులు ఉండవు.
కానీ మేకులు ఉంటాయి.
అవి మన బట్టల మీద ఇష్టం పెంచుకుంటూ అజాగ్రత్తగా లేస్తే పరమని సౌండ్.
బాల్కనీ లో ప్రొజెక్టర్ రూం కూడా ఉంటుంది.
సోడాలు, శనగకాయలు ట్రాఫిక్ పెరిగినప్పుడు వాళ్ళ తలకాయలు screen మీద కనిపిస్తూ ఉంటాయి.
అన్ని క్లాస్ ల లోఫాన్స్ ఉంటాయి.
అయితే ఫ్యాన్ కింద సీటో సంపాదించడం చాలా కష్టం.
సంపాయించినా అది సవ్యంగా తిరిగే ఫ్యాన్ అయి ఉండడం మరీ కష్టం.
ఎందుకంటే చాలా ఫాన్స్ పూనకం వచ్చినట్టు గీక్ గీక్ అని అరుస్తూ ఉంటాయి.
అవి ఊడి మీద పడకపోవడం మన అదృష్టం.
ఇక్కడి తో మన కష్టాలు ఆగవు.
కరెంటు వాళ్ళ దయ ఉండాలి.
పవర్ కట్, జనమంతా పిచ్చెక్కినట్టు ఈలలు వేస్తారు.
జనరేటర్ లేని కాలం. కాబట్టి కరెంటు కోసం ఎదురు చూడాల్సిందే.
కరెంటు రాకపోతే పాస్ లు ఇచ్చి పంపుతారు.
మరుసటి రోజు వచ్చి సినిమా చూడాల్సిందే.
రిలీజ్ అయిన ఏడాదికి రాష్ట్రమంతా ఆడిన తర్వాత మావూరి కి వచ్చేది.
పాత ప్రింట్ కావడంతో సినిమా అంతా గీతలు గీతలు వచ్చి cut అయ్యేది.
ఇన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా సినిమా ఎంజాయ్ చేసే వారు.
ఇప్పుడు ఇన్ని సౌకర్యాల మధ్య సినిమా చూస్తున్నా ఆ ఉత్సాహం, ఆనందం రావడం లేదు.
అమాయకత్వం లోని రహస్యం అదేనేమో!.
అదో ప్రపంచం... అప్పట్లో అదో ఆనందం. గోల్డెన్ ఎరా అనుకోవాలి మరి.. ఏటి అంటారు..