కష్ట కాలం
నేటి మేటి కవిత Source : The Rainy day By Henry Wadsworth Longfellow తెలుగు అనువాదం: డా. చెంగల్వ రామలక్ష్మి;
By : The Federal
Update: 2025-07-20 00:30 GMT
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
ఈ రోజు స్థబ్దంగా, చీకటిగా, నిస్తేజంగా ఉంది
వర్షం కురుస్తుంది,
గాలి ఎప్పుడూ అలసట చెందదు
ద్రాక్ష తీగ శిధిలమోతున్న గోడను
ఇంకా అంటి పెట్టుకునే ఉంది
వీచే ప్రతిగాలికి ఎండుటాకులు
రాలిపోతున్నాయి
ఈ రోజు చీకటిగా, నిస్తేజంగా ఉంది
నా జీవితం స్థబ్దంగా, చీకటిగా, విషాదంగా ఉంది
వర్షం పడుతుంది, గాలి ఎప్పుడూ అలసిపోదు
నా ఆలోచనలు జరిగిపోయిన
గతాన్నే అంటిపెట్టుకుని ఉన్నాయి
కాని, నా యౌవనపు ఆలోచనలు
గాలి తీవ్రతకు కుప్ప కూలిపోతున్నాయి
రోజులు చీకటిగా, విషాదంగా ఉన్నాయి
సహనంగా ఉండు… ఓ శోకతప్త హృదయమా!
నిరాశను విడిచిపెట్టు
మబ్బుల వెనక సూర్యుడు
ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాడు
నీ తలరాత వంటిది అందరికీ సాధారణమే
ప్రతి జీవితంలో కొంతైనా వర్షం తప్పదు
కొన్ని రోజులు చీకటిగా
విషాదంగా ఉండక తప్పదు.
(డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గురజాడ రచనలపై పరిశోధన చేసారు. 'చెంగల్వ పూలు 'అనే కథా సంపుటాన్ని, 'గురజాడ అప్పారావు ', జాషువా జీవితం --సాహిత్యం ', అనే పుస్తకాలను ప్రచురించారు.ప్రస్తుతం సాహిత్య వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కథలు, కవితలు వివిధ పత్రికలలో రాస్తున్నారు.)