భారతీయులకు వీసా సర్వీస్ ను నిలిపివేసిన బంగ్లా

రెండు దేశాల మధ్య క్రమంగా క్షీణిస్తున్న దౌత్యసంబంధాలు

Update: 2025-12-23 06:12 GMT
ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ కార్యాలయం

భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీతో పాటు, త్రిపురలోనూ బంగ్లా హై కమిషన్ భారతీయులకు వీసా సర్వీసులను నిలిపివేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా వీసా సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ వెలుపల ఈ మేరకు ప్రత్యేక ప్రకటనలో ఈ విషయాన్ని వివరించారు. నోటీసుల్లో ‘‘తప్పనిసరి పరిస్థితుల కారణంతో న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ నుంచి కాన్సులర్ అండ్ వీసా సేవలు తదుపరి నోటీస్ వచ్చే వరకూ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము’’ అని పేర్కొంది.
ఆదివారం బంగ్లా హై కమిషన్ వద్ద నిరసనలు వెల్లువెత్తిన తరువాత త్రిపురలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కూడా వీసా సేవలను నిలిపివేసినట్లు తెలియజేసింది. అలాగే పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ఢాకా నియమించిన ఒక ప్రవేట్ ఆపరేటర్ కూడా తన సేవలను నిలిపివేసింది.
గతవారం విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తరువాత బంగ్లాదేశ్ లో తిరిగి అశాంతి చెలరేగింది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో హాది ప్రముఖ పాత్ర పోషించాడు.
అతడి మరణం వెనక భారత్, హసీనా పాత్ర ఉందని రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు బంగ్లాలో విధ్వంసం సృష్టిస్తున్నారు. తాజా నిరసనలో బంగ్లాదేశ్ లోని మైమెన్ సింగ్ లో దీపు చంద్రదాస్ అనే హిందువును ఇస్లామిక్ జిహాదీ గ్రూపులు దారుణంగా హత్య చేశాయి. అతని శరీరాన్ని రోడ్డు పక్కన పడేసి నిప్పు పెట్టి పైశాచికత్వం ప్రదర్శించాయి.
నిరసనకారుల బృందం గురువారం చిట్టగాంగ్ లో ఉన్న భారత అసిస్టెంట్ హైకమిషన్ ముట్టడించడానికి ప్రయత్నించింది.ఈ చర్యతో భారత్ వీసా కార్యక్రమాలను నిలిపివేసింది.
ఢాకాలోని భారత రాయబార కార్యాలయం చుట్టూ భద్రత పరిస్థితులను కకావికలం చేయడం ద్వారా కొన్ని ఉగ్రవాద శక్తులు దాడులకు ప్రయత్నిస్తున్నాయని బుధవారం బంగ్లాదేశ్ రాయబారీ రియాజ్ హమీదుల్లాను భారత్ పిలిపించి తీవ్ర నిరసనను తెలియజేసింది.
ఢాకాలోని భారత హైకమిషన్ చుట్టూ నిరసనలు నిర్వహించాలని కొన్ని తీవ్రవాద శక్తులు ప్రకటించిన తరువాత భారత్ ఈ చర్య తీసుకుంది. ఇటువంటి చర్యలకు సంబంధించి తాత్కాలిక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహించకపోవడం, తమతో ఆధారాలను పంచుకోకపోవడంపై భారత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచింది. 
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశంలో మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అశాంతి  చెలరేగడంతో అక్కడ మరోసారి ఎన్నికలు వాయిదా పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే జరగాలని అక్కడ రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు అశాంతిని ఎగదోస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 
Tags:    

Similar News