నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మరియా మచాదో ఎవరు?
వెనిజులా ఐరన్ లేడీ ఆమె.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాడుతున్న యోథ
By : A.Amaraiah
Update: 2025-10-10 12:32 GMT
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అష్టకష్టాలు పడినా, చివరకు నోబెల్ కమిటీని హెచ్చరించినా వెనిజులా పౌరహక్కుల నేత మరియా కొరినా మచాదోకే 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. వెనిజులా ప్రతిపక్ష ప్రముఖ నాయకురాలు మరియా కొరినా మచాదో తన దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన తీరుకు మెచ్చి ఆమెను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారు. “వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతర కృషి చేసినందుకు, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు శాంతియుతంగా మార్పు కోసం పోరాడినందుకు ఈ అవార్డు అందజేస్తున్నాం,” అని నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ఓస్లోలో ప్రకటించింది.
అసలింతకీ ఎవరీ మరియా...
ఆమె ప్రస్తుత వయసు 58 ఏళ్లు. ఇండస్ట్రియల్ ఇంజనీర్. ప్రస్తుతం వెనిజులాలో రహస్యంగా జీవిస్తున్నారు. అధ్యక్షుడు నికోలాస్ మదురోకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ఆమె అనేక ఇక్కట్లు పడాల్సివస్తోంది ఇప్పటికీ.
మరియా కొరినా మచాదో (Maria Corina Machado Parisca) 1967 అక్టోబర్ 7న వెనిజులా రాజధాని కారాకాస్‌లో జన్మించారు. ఆమె తల్లి కొరినా పారిస్కా (Corina Parisca). మానసిక వైద్య నిపుణురాలు. తండ్రి హెన్రిక్ మచాదో జులోగ్వా (Henrique Machado Zuloaga). ప్రముఖ పారిశ్రామికవేత్త. స్టీల్ పరిశ్రమలో పేరున్నవారు. సంపన్న కుటుంబమే.
కారాకాస్‌లోని స్థానిక పాఠశాలల్లో ప్రాథమిక, మాధ్యమిక విద్య పూర్తి చేసింది. Andrés Bello Catholic University (కారాకాస్) నుండి ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. తరువాత IESA (Institute of Advanced Studies of Administration) లో ఫైనాన్స్‌లో శిక్షణ పొందింది. 2009లో ఆమె పేరు తళుక్కున అంతర్జాతీయ తెరపై మెరిచింది. 2009 Yale University World Fellows Programలో భాగమై గ్లోబల్ లీడర్‌షిప్ శిక్షణ పొంది ప్రశంసలు పొందిన సందర్భమది.
మరియా కొరినాకి పెళ్లి అయింది. ముగ్గురు పిల్లలు. కొంతకాలం కిందట విడాకులు తీసుకున్నారు.
హక్కుల కార్యకర్తగా ఎలా మారారంటే..
2002లో ఆమె Súmate అనే ఎన్జీఓను స్థాపించింది. ఇది ఎన్నికల పారదర్శకత, ఓటర్ల హక్కుల రక్షణ కోసం పనిచేసే సంస్థ. 2004లో Hugo Chávez ప్రభుత్వంపై నిర్వహించిన రీకాల్ రిఫరెండం ప్రక్రియలో Súmate కీలక పాత్ర పోషించింది. దీంతో మచాడో పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపించింది. వెనిజులా ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది.
రాజకీయ రంగ ప్రవేశం ఇలా..
2010లో Mirando రాష్ట్రం నుంచి జాతీయ అసెంబ్లీకి (పార్లమెంట్ సభ్యురాలు) ఎన్నికయ్యారు. ఆమె గళం విప్పిందంటే ప్రభుత్వాన్ని దునుమాడాల్సిందే. చీల్చిచెండాడాల్సిందే.
2014లో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొన్నందుకు, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. అయినప్పటికీ వెనుకాడ Vente Venezuela అనే కొత్త రాజకీయ వేదికను ప్రారంభించారు. ఆ పార్టీకి వ్యవస్థాపకురాలు. ఇది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ప్రతిపక్ష వేదికగా నిలిచింది. 2023లో జరిగిన ప్రతిపక్ష ప్రాథమిక ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించింది. కానీ మదురో ప్రభుత్వ ఒత్తిడితో ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు.
అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసింది. ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.
ఐరన్ లేడీగా గుర్తింపు...
మచాదో రాజకీయ నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. మొక్కవోని ధైర్యం ఆమె సొంతం. సొంత వక్తృత్వం వల్ల ఆమెను “ఉక్కు మహిళ” (Iron Lady of Venezuela)గా పిలుస్తుంటారు.
ప్రజాస్వామ్యం, పారదర్శక ఎన్నికలు, మానవ హక్కులు ఆమె నినాదం. ఆమె పోరాటం కేవలం రాజకీయమే కాదు, హక్కుల ఉద్యమం కూడా. మచాదోపై ఎన్నో కేసులు, బెదిరింపులు, అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. అయినప్పటికీ, వెనిజులా ప్రజలు ఆమెను ఒకే ప్రత్యామ్నాయం గా చూస్తున్నారు.
ప్రస్తుతం రహస్యంగా జీవిస్తూనే వెనిజులా మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థల కథనం. మరియా కొరినా మచాదో జీవితమే ఓ స్ఫూర్తిదాయకమైంది. సంపన్న కుటుంబంలో పుట్టినా, ఆమె తన జీవితాన్ని ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ హక్కుల పోరాటానికి అంకితం చేసింది.
లాటిన్ అమెరికా దేశాల్లో ప్రజాపక్షపాతిగా, అసమాన ధైర్యసాహసాలకు ప్రతిరూపంగా ఆమెను భావిస్తుంటారు.
అందుకే నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ జార్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ ఆమెను “తన ప్రాణాలకు తీవ్ర ముప్పున్నా, దేశం విడిచి వెళ్లకుండా సొంతగడ్డపై నిలబడి పోరాడి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి” అని పేర్కొన్నారు.
“నియంతలు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు స్వేచ్ఛ కోసం ఎదిరించే ధైర్యవంతుల్ని గుర్తించడం అత్యంత కీలకం,” అని ఆయన అన్నారంటే మరియా మచాదో పోరాట స్ఫూర్తి ఎంతటితో అర్థమవుతుంది.
ఈ అవార్డు కింద ఆమెకు 11 మిలియన్ స్వీడిష్ క్రోన్ (సుమారు 10 కోట్ల రూపాయలు) నగదు అందుతుంది. ఓస్లోలో డిసెంబర్ 10న జరిగే అల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సభలో అందజేస్తారు.
నీరు గారిన ట్రంప్ ప్రయత్నాలు...
ఈ ఏడాది నోబెల్ బహుమతి తనదే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఊదరగొట్టినా ఫలితం లేకపోయింది. మితిమీరిన పైరవీలు బెడిసికొట్టాయి. దేశాధ్యక్షుల బెదిరింపులు నోబెల్ కమిటీ ముందు నీరుగారాయి.
ట్రంప్ విధానాలు అంతర్జాతీయ పరిస్థితిని బలహీనపరిచాయని, అందువల్ల అతనికి అవకాశం లేదని ఇప్పటికే చెప్పారు. అయినా ట్రంప్ అనుచరులు సోషల్ మీడియాలో హోరెత్తించారు. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ “ట్రంప్ ఖచ్చితంగా నోబెల్ బహుమతి పొందాలి” అని X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Retweet if you believe @realDonaldTrump deserves the Nobel Peace Prize.
— Eric Trump (@EricTrump) October 9, 2025
ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా ప్రజలను రీట్వీట్ చేయమని కోరాడు. దీంతో ఆ పోస్ట్ 48,000 రీట్వీట్లు పొందింది.
ఏమైనా ఆ యత్నాలు ఫలించలేదు. మరియా కొరినా మచాదోనే శాంతి బహుమతి వరించింది.