పహల్గామ్ ఉగ్రవాదులను న్యాయం ముందు నిలబెట్టాం: జైశంకర్
ఆ దేశంలో ఉగ్రవాదం పారిశ్రామిక స్థాయిలో పనిచేస్తుందని పరోక్షంగా పాక్ ను విమర్శించిన భారత విదేశాంగ మంత్రి
By : The Federal
Update: 2025-09-28 09:06 GMT
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిని భారత్ న్యాయం ముందు నిలబెట్టిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించే హక్కు ప్రతి దేశానికి ఉంటుందని, న్యూఢిల్లీ దానిని వినియోగించుకుందని చెప్పారు.
ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ ను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత్ దౌత్యవేత్త పెటల్ గహ్లోట్ గట్టి కౌంటర్ ఇచ్చిన ఒక రోజు తరువాత ఆయన మాట్లాడారు.
పాక్ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా నిలిచిందని ప్రపంచానికి మరోసారి గుర్తు చేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను క్షమించే దేశాలను ఏదో ఒకరోజు వారి కాటుక బలికావాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. భారత్ తన హక్కులను కాపాడుకుంటుందని చెప్పిన ఆయన, బెదిరింపులకు దృఢంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
ఉగ్రవాదానికి కేంద్రం...
భారత ప్రజలను నుంచి నమస్కారం అంటూ యూఎన్ పోడియం నుంచి ప్రపంచ నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగం ప్రారంభించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్ సవాళ్లను ఎదుర్కొంది.
కానీ పొరుగు దేశం మాత్రం ఉగ్రవాదానికి కేంద్రంగా మారింది’’ అని దుయ్యబట్టారు. అయితే ఆయన తన ప్రసంగంలో ఎక్కడా పాక్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. దశాబ్ధాలుగా ప్రధాన అంతర్జాతీయ ఉగ్రవాద దాడులు ఆ ఒక్క దేశం నుంచే జరుగుతున్నాయని పరోక్షంగా ప్రస్తావించారు. ఐరాస ప్రకటించిన ఉగ్రవాద వ్యతిరేక జాబితాలో ఆ దేశ పౌరుల పేర్లతో నిండిపోయిందని దెప్పిపొడిచారు.
‘‘పహల్గామ్ లో అమాయక పర్యాటకుల హత్య సరిహద్దు అనాగరికతకు తాజా ఉదాహారణ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన ప్రజలను రక్షించుకునే హక్కు భారత్ ఉపయోగించుకుంది. దాని నిర్వాహాకులు, నేరస్థులను న్యాయం ముందు నిలబెట్టింది’’ అని జైశంకర్ అన్నారు.
ఉగ్రవాదాన్ని ప్రొత్సహించేవారికి హెచ్చరిక..
పహల్గామ్ లో అమాయక హిందూ పర్యాటకులను గుర్తించి పాక్ కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపిన తరువాత ఆ దేశానికి చెందిన ‘ది రెసిస్టిన్స్ ఫ్రంట్’’ బాధ్యత వహించింది.
దీనికి ప్రతీకారంగా భారత్ మే 7 న ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. పాక్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మిస్సైల్స్ ను వాడి పేల్చివేసింది. తరువాత పాక్ ఎదురుదాడికి దిగగా, భారత వాయు సేన పాక్ కు చెందిన 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగానికి సమాధానం ఇచ్చిన భారత్.. రన్ వేలు, వైమానిక స్థావరాలు ధ్వంసం కావడం విజయంగా భావిస్తే భావించని, లేట్స్ ఎంజాయ్ అంటూ ఘాటుగా, వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.
మే 9 న పాక్ డీజీఎంఓ, భారత్ డీజీఎంఓకు కాల్ చేసి దాడులు ఆపమని కాళ్లావేళ్లా పడ్డారని, దానికి సంబంధించిన రికార్డులు ఉన్నాయని పాక్ నాటకాన్ని ప్రపంచం ముందు బహిరంగపరిచారు.
అంతర్జాతీయ సహకారం అవసరం..
ఉగ్రవాదం ఉమ్మడి ముప్పు అని పేర్కొన్న ఆయన అంతర్జాతీయ సహకారం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. ‘‘దేశాలు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా బహిరంగంగా ప్రకటించినప్పుడూ ఉగ్రవాద కేంద్రాలు పారిశ్రామిక స్థాయిలో పనిచేస్తున్నప్పుడూ, ఉగ్రవాదులను బహిరంగంగా కీర్తించినప్పుడూ అటువంటి చర్యలను నిస్సందేహంగా ఖండించాలి’’ అని విదేశాంగ మంత్రి అన్నారు.
భారత్ సమకాలీన ప్రపంచాన్ని ‘ఆత్మ నిర్భరత, స్వావలంబన, ఆత్మరక్ష’ అనే మూడు కీలక భావనల ద్వారా మార్గనిర్దేశం చేసుకుంటోందని యూఎన్జీఏ పోడియం నుంచి ప్రపంచ నాయకులకు చెప్పారు.