స్కిల్డ్ ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. వీసాల సంఖ్య పెంచిన జర్మనీ

ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని జర్మనీ వ్యాపారులను ప్రధాని మోదీ కోరారు. పెట్టుబడులకు భారత్‌ కంటే మెరుగైన దేశం మరొకటి ఉండదన్నారు.

Update: 2024-10-25 12:53 GMT

నైపుణ్యం గల భారతీయులకు జర్మనీ ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని, వీసాల సంఖ్యను ఏడాదికి 20 వేల నుంచి 90వేలకు పెంచేందుకు జర్మనీ ప్రభుత్వం అంగీకరించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన 18వ ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 2024లో ఆయన ప్రసంగించారు. జర్మనీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యూరోపియన్ దేశ ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమిస్తుందన్నారు. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ.. “మన విశ్వవిద్యాలయాలలో చదువుతున్న విదేశీ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే ఎక్కువ. గత ఏడాది జర్మనీలో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య 23వేలు దాటింది. నైపుణ్యం గల కార్మికుల కోసం జర్మనీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు వీసా ప్రక్రియను డిజిటలైజ్ చేయబోతున్నాం.”అని పేర్కొన్నారు.

‘భారత్‌లో పెట్టుబడులు పెట్టండి’

ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని జర్మనీ వ్యాపారులను ప్రధాని మోదీ కోరారు. పెట్టుబడులకు భారత్‌ కంటే మెరుగైన దేశం మరొకటి ఉండదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష సాంకేతికత సంబంధించిన రంగాల్లో పెట్టుబడులు, సహకారానికి అవకాశాలను కల్పిస్తాయని ప్రధాని హామీ ఇచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేశామని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి జర్మనీ మంత్రివర్గం “ఫోకస్ ఆన్ ఇండియా” పత్రాన్ని విడుదల చేసిందని మోదీ చెప్పారు. 12 ఏళ్ల విరామం తర్వాత ఏర్పాటుచేసిన ఈ సదస్సు శుక్రవారం ముగిసింది.

ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం USD 30 బిలియన్లకు పైగా ఉంది. వందలాది జర్మన్ కంపెనీలు భారతదేశంలో పనిచేస్తున్నాయి. భారతీయ సంస్థలు కూడా జర్మనీలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి.

Tags:    

Similar News