వరుసగా నాలుగో సారి ప్రధాని పీఠంపై హసీనా
భారత ఉపఖండ దేశమైన బంగ్లా పీఠంపై మరోసారి షేక్ హసీనా కూర్చొనున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థికి కనీసం వేయి ఓట్లు కూడా రాలేదు. *
ఇప్పటికే వచ్చిన ఫలితాల ప్రకారం ఆమె పార్టీ 300 స్థానాలున్న పార్లమెంట్ లో దాదాపు 216 సీట్లు గెలుచుకున్నారు. ఇది మొత్తం సీట్లలో మూడింట రెండు వంతులు. అయితే ప్రతిపక్ష బీఎన్పీ దాని మిత్ర పక్షాలు ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తున్నాయి. ఇదీ కేవలం ప్రతిపక్షం ఎవరో తేలడానికి జరిగిన ఎన్నికలుగా అవి అభివర్ణిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికల సందర్భంగా అక్కడక్కడా చెదుమదురు సంఘటనలు జరిగాయి.
" ఇప్పటికే వచ్చిన ఫలితాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మెజారీటీ సీట్లలో అవామీ లీగ్ విజయం సాధించింది. అయితే ఎన్నికల లెక్కింపు అయిపోయాక తుది ఫలితాల ప్రకటిస్తాం" అని ఎన్నికల అధికారి మీడియాకు చెప్పారు.
ఈ సారి ఎన్నికల్లో తక్కువ స్థాయిలో అంటే కేవలం 40 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయింది. అందువల్ల ఎన్నికల బహిష్కరణ పిలుపు విజయవంతమైందని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. అందుకే వచ్చే 48 గంటలు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించాయి. 2018 లో జరిగిన ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికలసంఘం గణాంకాలు చెబుతున్నాయి. అయితే పూర్తిగా ఫలితాలు వచ్చాక ఎంతశాతం ఓటింగ్ జరిగింది తెలుస్తుంది అని బంగ్లా ఎన్ని కల ప్రధాని అధికారి కాజీ హాబీబుల్ చెప్పారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ అక్కడి మీడియా మాత్రం చాలా చోట్ల ఘర్షణలు జరిగినట్లు నివేదించింది. దేశ వ్యాప్తంగా 18 చోట్ల కాల్పులు జరిగాయని, అవన్నీ కూడా పోలింగ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందించాయి.
షేక్ హసీనా పోటీ చేసిన గోపాల్ గంజ్ లో ఆమె ప్రత్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీ నుంచి పోటీ చేసిన నిజాముద్దీన్ లష్కర్ కు కేవలం 469 ఓట్లు మాత్రమే పోలైయ్యాయి. 1986 నుంచి ఆమె వరుసగా ఇక్కడి నుంచే గెలుస్తున్నారు. హసీనా 2009 నుంచి వరుసగా దేశాన్ని పాలిస్తున్నారు. ప్రస్తుతం షేక్ హసీనా వయసు 76, దక్షిణాసియాలో వరుసగా దేశ అధికారం పీఠంపై కూర్చున్న మొదటి నేత ఆమెనే.
ఈ విజయంపై అవామీ పార్టీ నేత క్వాడర్ స్పందించారు. " కొందరు దేశంలో ఎన్నికలు జరగకుండా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. దహనాలు, తీవ్రవాదదాడుల లాంటి భయాలను కల్పించారు. వాటిన్నింటిని ఎదుర్కొని ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు" అని అన్నారు. ఓటు వేసే సందర్భంగా షేక్ హసీనా మాట్లాడారు. " బీఎస్పీ - జమాతే ఇస్లామీ కూటమికి ప్రజాస్వామ్యం పై నమ్మకం లేదని విమర్శించారు. భారత్ ఎప్పుడు మాకు విశ్వసనీయ మిత్రుడు అని ఓ ప్రశ్నకు సమాధానం గా చెప్పారు. ఈ ఎన్నికలకు ప్రజల అంగీకారం ముఖ్యం, కానీ విదేశీ మీడియా తీర్పు తనకు అవసరం లేదని వ్యాఖ్యానించారు.
మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని నాయకులు మాట్లాడుతూ " ఈ ఎన్నికలు నకిలీవి. వారి అభ్యర్థులే ప్రత్యర్థులుగా నిలబడ్డారు. మంగళవారం నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉధృతం చేస్తాం. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తాం" అని ఓ నాయకుడు అన్నారు. ఇది ఫాసిస్టు ప్రభుత్వమని విమర్శించారు. కాగా ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పీ 2014 ఎన్నికలను బహిష్కరించింది. కానీ 2018 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది. అలాగే ప్రస్తుత ఎన్నికలను సైతం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో మరో 15 ప్రతిపక్షపార్టీలు నడిచాయి.
బంగ్లాదేశ్ లో జరిగిన 12వ సార్వత్రిక ఎన్నికల్లో 436 మంది ఇండిపెండెట్ అభ్యర్థులతో పాటు 27 రాజకీయ పార్టీల నుంచి 1500 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఎన్నికలను భారత్ కు చెందిన ముగ్గురు పరిశీలకులతో పాటు, 100 మందికి పైగా విదేశీ ప్రతినిధులు పరిశీలించారు. ఎన్నికల కోసం 7.5 లక్షల మంది బలగాలను మోహరించారు.
ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవని మాజీ ఎన్నికల సంఘం ప్రధాని అధికారి బ్రిగ్ జనరల్ సఖావత్ హుస్సేన్ అన్నారు. " స్వతంత్రులు, డమ్మీల పేరుతో ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు పోటీ పడుతున్నారని, అందుకే ఇవీ ప్రత్యేకమైనవని అంటున్నాని" వ్యాఖ్యానించారు. గెలుపెవరిదో అందరికి తెలుసు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
శుక్రవారం ఇదే ఎన్నికలపై ఐరాస ప్రత్యేక రిపోర్టర్ మాట్లాడారు. బంగ్లాదేశ్ లో తీవ్ర అణిచివేత ఉందని వ్యాఖ్యానించారు. తను ఈపరిస్థితి చూసి చాలా కలవరపడ్డానని చెప్పారు.