దశాబ్దాల వైరం పక్కన పెట్టి, రక్షణ ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు?
భారత్ ను తీవ్రంగా వ్యతిరేకించే జేవీపీ పార్టీ, రెండు సార్లు న్యూఢిల్లీనే బూచిగా చూపి రక్తపాతం ద్వారా అధికారం దక్కించుకోవడాని ప్రయత్నం;
By : MR Narayan Swamy
Update: 2025-04-06 12:22 GMT
భారత ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటన ముగించారు. ద్వీపదేశంతో రక్షణ ఒప్పందాన్ని కుదర్చుకోవడానికి సిద్దమయ్యారు. ఆశ్చర్యకరంగా శ్రీలంకలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ సైతం ఈ ఒప్పందానికి ‘సై’ అంది.
ఇది ప్రపంచంలోనే గొప్ప రాజకీయ వ్యంగ్యాస్త్రాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఒకప్పుడూ ఈ పార్టీ భారత్ ను విస్తరణవాదిగా సింహాళీయులలో విషాన్ని నింపింది. ప్రజలలో తిరుగుబాటును లేవదీసి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది. దానికి బూచిగా భారత్ నే వాడుకుంది.
గత ఏడాది ఫిబ్రవరిలోనే జేవీపీ అధ్యక్ష అభ్యర్థి అనుర దిసనాయకేను భారత్ ఆహ్వానించింది. అప్పుడే ఆయన కొలంబోలో అధికారంలోకి వస్తున్నారని ప్రపంచానికి అర్థమైంది.
హింసాత్మక తిరుగుబాటు..
ఐదు దశాబ్దాల క్రితం ఇలాంటి రక్షణ ఒప్పందమే అప్పటి పాలకులు భారత్ తో కుదుర్చుకోవానికి ప్రయత్నించారు. తమను తాము రాడికల్ గా భావించే కొంతమంది లంక వాసులకు ఈ ఒప్పందం నచ్చలేదు.
1971 లో ఏప్రిల్ 5 న కొలంబోలో భారత్ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడానికి సమాయత్తం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జేవీపీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి హింసాత్మక ఘటనలకు పాల్పడింది.
తమకు ఎదురుచెప్పిన వేలాదిమందిని ఊచకోత కోసింది. కానీ చివరకు అక్కడి ప్రభుత్వం భారత ప్రభుత్వ సాయంతో కోరడంతో సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దవలసి వచ్చింది. ఈ పరిణామంతో జేవీపీ పార్టీ పచ్చి భారత వ్యతిరేకిగా మారిపోయింది.
తిరిగి 1987 లో మరోసారి భారత్- శ్రీలంక మధ్య జరగాల్సిన ఒప్పందాన్ని ఇదే రక్తపాత తిరుగుబాటును ప్రారంభించి నిలిపివేసింది. ఇలా రెండు సార్లు నిలిపివేసిన పార్టీనే 2024 లో అధికారంలోకి వచ్చి తను వ్యతిరేకించే భారత్ తో అలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
నాటకీయ మలుపులు అనేకం..
రెండు సార్లు తిరుగుబాటు విఫలం అయిన తరువాత భారత్ సైతం తన స్ట్రాటజీని మార్చింది. జేవీపీ నాయకులతో చర్చలు ప్రారంభించింది అది కూడా రహస్యంగా. అంతకుముందే భారత భద్రతా సంస్థలు, శ్రీలంక భద్రతా సంస్థలతో కలిసి ఆ నాయకులను వేటాడం ప్రారంభించింది.
కానీ వారు రహస్యంగా పశ్చిమదేశాలకు పారిపోయారు. ఈ వామపక్ష పార్టీ నాయకులు 1960-70 లో భారత విస్తరణ వాదం అంటూ ఒక పాఠాన్ని చేర్చి తన కార్యకర్తలకు విషాన్ని నూరిపోసింది. కానీ ఇప్పుడు పరిణామాలన్నీ చాలావేగంగా మారిపోయాయి.
తెరవెనక ఏం జరిగి ఉంటుంది..
సింహాళీయుల్లో ఇప్పటికి తమిళ ఈలం గురించి అనేక భయాలు ఉన్నాయి. వీటి కోసం ఆ దేశ ఉత్తర, తూర్పు ప్రాంతాలలో సైన్యం మెహరింపు కొనసాగుతోంది. దీనిని ఆసరాగా తీసుకుని ప్రస్తుతం రక్షణ ఒప్పందంపై ఎలాంటి వ్యతిరేకత ప్రబలకుండా జేవీపీ పావులు కదిపింది.
ఆదివారం ఉదయం ప్రధాని పర్యటన అధికారికంగా ముగిసింది. ఒప్పందంపై సంతకం చేయడానికి ఇరు దేశాధినేతలకు తగినంత సమయం దొరికింది. ప్రతి అంశాన్ని ఇరుదేశాలు పరికించి తుది నిర్ణయానికి వచ్చి ఉంటాయి. అంతకుముందు కొలంబోకు ఎందుకు రక్షణ ఒప్పందం అవసరమో ప్రజలకు విడమరిచి చెప్పేందుకు ప్రయత్నించింది.
ఐదు సంవత్సరాల ఒప్పందం..
రక్షణ కార్యదర్శి సంపత్ తుయకొండ మాట్లాడుతూ.. రక్షణ సహకారంపై అవగాహన ఒప్పందం అనేది ‘‘ రక్షణ భాగస్వామ్యం, ఒప్పందాలను మరింత సమర్థవంతంగా, నిర్మాణాత్మక పద్దతిలోనే కొనసాగించడం’’ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం.. సైనిక అధికారుల మార్పిడి, శిక్షణ, దళాల మధ్య సిబ్బంది చర్చలు, సమాచార మార్పిడి, రక్షణ పరిశ్రమలో సహకారం, రక్షణ సాంకేతికత, పరిశోధనలను కవర్ చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక క్రమ పద్దతిలోనే నిర్వహిస్తున్నారు.
ఇది ఐదు సంవత్సరాల అమలులో ఉంటుంది. ఈ ఒప్పందం వద్దు అనుకుంటే మూడు నెలల ముందస్తు నోటీస్ తో ముగించవచ్చు అలాగే మరో మూడు సంవత్సరాలు పొడిగించవచ్చని తెలిపారు.
ఈ ఒప్పందాలన్నీ కూడా అంతర్జాతీయ పద్దతులకు అనుగుణంగా ఉంటాయి. అలాగే శ్రీలంక, భారత్ లోని చట్టాలు, జాతీయ విధానాలకు విరుద్దంగా ఉండవని ఆయన పేర్కొన్నారు.
రక్షణ ఒప్పందం కాదు.. అవగాహన ఒప్పందం..
కొంతమంది శ్రీలంక అధికారులు ఇది రక్షణ ఒప్పందం కాదని, ఒక అవగాహాన ఒప్పందం అని వాదిస్తున్నారు. అయితే ఒప్పందం పేరు ఏదైనా భారత్ దానిపై అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు.
శ్రీలంకలో ప్రత్యేక తమిళ దేశం కావాలని చాలాకాలంగా జరిగిన యుద్ధం ఇంకా బలంగా కొనసాగుతున్న కాలంలోనే అంటే 2003 లో భారత్ ఈ ఆలోచన చేసింది. దురదృష్టవశాత్తూ తరువాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలు దీనిపై అంతగా శ్రద్ద చూపలేదు.
2009 లో శ్రీలంక, తమిళుల ఉగ్రవాదులను అణచివేసిన తరువాత హిందూ మహా సముద్రంలో చైనా తన ప్రాభావాన్ని పెంచుకోవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీ మళ్లీ ఈ పాత ఆలోచనకు ప్రాణం పోసింది.
అప్ బీట్ ఇండియా..
దిసనాయకే గత ఏడాది ఫిబ్రవరిలోనే భారత్ కు వచ్చిన సందర్భంగా ఈ ప్రతిపాదిత ఒప్పందం పై చర్చలు జరిపారని తెలుస్తోంది. దీనిపై ప్రధాని మోదీ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ‘‘దిసనాయకే తమ గత పర్యటన తరువాత నాలుగు నెలల్లోనే మా సహకారం గణనీయంగా అభివృద్ది చెందింది’’ అన్నారు.
‘‘మా భద్రతా ప్రయోజనాలు ఒకేలా ఉన్నాయని మేము నమ్ముతున్నాము. రెండు దేశాల భద్రత ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంది. రెండు దేశాలు ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. భారత్ ప్రయోజనాల పట్ల సున్నితత్వం చూపినందుకు అధ్యక్షుడు దిసనాయకే నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. రక్షణ సహకారంలో కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలను మేము స్వాగతిస్తున్నాము’’ అని మోదీ అన్నారు.
మార్క్సిస్ట్ అయిన దిస్సానాయకే శ్రీలంక భూభాగాన్ని భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించుకూడదనే తన ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
1980 నాటి చరిత్ర..
1980 ల కాలం నాటి అల్లకల్లోల పరిస్థితి నుంచి ఈ రక్షణ ఒప్పందం ఒక పెద్దముందడుగు. ఆ కాలంలో భారత సైన్యం శ్రీలంకలో ఉన్న అరాచక పరిస్థితులను సరిద్దిద్దడానికి మోహరించాల్సి వచ్చింది. అప్పటి అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస భారత దళాలు పోరాడుతున్న తమిళ ఉగ్రవాదులకు రహస్యంగా ఆయుధాలు సమకూర్చాడు.
ఈ పర్యటనలో మోదీ కొన్నింట వెనకడుగు వేశాడు. శ్రీలంకతో సంబంధాలు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జైళ్లలో మగ్గుతున్న మత్స్యకారులను విడుదల చేయమని కోరడానికి మొగ్గు చూపలేదు. కేవలం మానవతా దృక్పథంలో వారిని విడిచిపెట్టాలని కోరారు. ఇది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే.
తమిళ టైగర్స్ పై సానుభూతి లేదు..
అదే సమయంలో శ్రీలంకలో నివసిస్తూ, అక్కడ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వారిపై తనకు ఎలాంటి సానుభూతి లేదని ప్రధాని ఇప్పటికే ప్రకటించారు.
1987- 90 లో తమిళ టైగర్లతో జరిగిన పోరాటంలో మరణించిన దాదాపు 12 వందల మంది భారతీయ సైనికుల కోసం కొలంబో వెలుపల నిర్మించిన స్మారక చిహ్నాన్ని మోదీ ఈ దశాబ్దంలో రెండోసారి సందర్శించారు.
అమరులకు పుష్ఫగుచ్ఛం సమర్పించిన తరువాత అక్కడ సందర్శకుల పుస్తకంలో మోదీ ఇలా రాశారు. ‘‘శ్రీలంక శాంతి, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత కోసం తమ ప్రాణాలు అర్పించిన భారత శాంతిపరిరక్షక దళం ధైర్య సైనికులకు మేము గుర్తుంచుకుంటాము, వారి అంచంచల ధైర్యం, నిబద్దత మనందరికి స్పూర్తిదాయకంగా ఉన్నాయి’’
మోదీ చర్య అధికారంలో ఉన్న డీఎంకేను కలవరపెడుతోంది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తమిళ టైగర్ల పట్ల సానుభూతి ప్రదర్శించారు. 1990లో శ్రీలంక నుంచి చెన్నైకి ఓడలో వస్తున్న భారతీయ సైనికులను అధికారికంగా స్వీకరించడానికి నిరాకరిచడంతో ఆ పార్టీ జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.
డీఎంకే మద్దతుదారులు అప్పట్లో భారత సైన్యాన్ని ఎగతాళి చేశారు. భారత శాంతి పరిరక్షక దళం అమాయక ప్రజలను చంపే దళంగా అభివర్ణించారు. దీనిని ఎవరూ ఇంకా మరిచిపోలేదు.