పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య సీజ్ ఫైర్

మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, టర్కీ

Update: 2025-10-19 11:20 GMT
పాకిస్తాన్, తాలిబన్ ప్రతినిధులు

ఖతార్ లోని దోహాలో జరిగిన శాంతి చర్చల తరువాత పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందని ఖతార్ విదేశాంగమంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో ఈ శాంతి చర్చలు ఫలప్రదం అయ్యాయి. గతవారం రోజుల నుంచి రెండు దేశాల మధ్య తీవ్ర సరిహద్దు ఘర్షణలు జరిగాయి.

సంక్షోభాన్ని పరిష్కరించడానికి చర్చల కోసం ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రతినిధులు దోహాలోనే ఉన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా తమ రక్షణ మంత్రులను చర్చల కోసం పంపాయి.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాదులు పాక్ లోకి ప్రవేశించి, విధ్వంసానికి పాల్పడుతున్నారని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి శాంతి, స్థిరత్వాన్ని పునరుద్దరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
శాశ్వత శాంతి..
కాల్పుల విరమణను కొనసాగించడానికి, దాని అమలును పర్యవేక్షించడానికి రాబోయే రోజులలో తదుపరి సమావేశాలను నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. అమెరికా నిష్క్రమణ తరువాత కాబూల్ ను తాలిబన్లు 2021 నుంచి అప్రహాతితంగా పాలిస్తున్నారు.
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఇది అత్యంత తీవ్రమైన ఘర్షణగా గుర్తింపు పొందింది. ఆప్ఘన్ రక్షణమంత్రి ముల్లా మహ్మద్ యాకుబ్ నేతృత్వంలోని బృందం దోహాలో చర్చలకు నాయకత్వం వహించినట్లు తాలిబన్ ప్రతినిధులు ప్రకటించారు.
ఆప్ఘన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని, ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలో హింస చెలరేగకుండా ఉండాలని, ముఖ్యంగా ఆప్ఘన్ లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
రెండు దేశాలలో అపనమ్మకం..
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలను తాలిబన్లు తోసిపుచ్చారు. పాకిస్తాన్ తప్పుడు వాదనలను వ్యాప్తి చేయడానికి బదులుగా ఇస్లామిక్ స్టేట్ ను ఎగదోయడం ఆపివేయాలని హెచ్చరించింది.
అయితే ఈ ఆరోపణలను పాక్ ఖండిస్తోంది. ఉగ్రవాదులు ప్రభుత్వాలను కూల్చి కఠినమైన ఇస్లామిక్ పాలనను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
శుక్రవారం పాక్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీ(ఫె)ల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, పాకిస్తాన్ లో దాడులు చేయడానికి ఆప్ఘన్ భూభాగాన్ని ఉపయోగిస్తున్న ప్రాక్సీ గ్రూపులను అరికట్టాలని ఆప్ఘన్ అధికారులను కోరారు.
పాక్ లో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్ వైమానిక దళం ఆప్ఘన్ లోని సాధారణ ప్రజలపై బాంబుల వర్షం కురిపించింది. ఇందులో ముగ్గురు క్రికెటర్లు సహ కనీసం 10 మంది మరణించారు.
Tags:    

Similar News