భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం: పాక్
పాక్ ఆక్రమిత కశ్మీర్, ఉగ్రవాదంపై చర్చకు మాత్రమే సిద్ధమన్న భారత్..;
భారత్‌తో శాంతి చర్చలు జరపడానికి పాకిస్థాన్(Pakistan) ప్రధాని షహెబాజ్ షరీఫ్ (PM Shehbaz Sharif) సంసిద్ధత వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ సమస్య, సింధూ జలాల ఒప్పదం, వాణిజ్య సంబంధాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా టెహ్రాన్‌కు చేరుకున్న షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తుర్కియే నుంచి ఇరాన్ రాజధానికి విమానంలో చేరుకున్న షరీఫ్‌కు అక్కడ టెహ్రాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించాక పెజెష్కియాన్‌తో చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఇటు భారత్ తమ వైఖరిని స్పష్టం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, ఉగ్రవాద సమస్యపై మాత్రమే పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతామని భారత్ పేర్కొంది.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రమూకల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సాయుధ దళాలు దాడులు చేశాయి. ఆ తర్వాత మే 8, 9,10 తేదీలలో భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాక్ ప్రయత్నించింది. పాక్ చర్యలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది.
మే 10 వ తేదీన రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన చర్చల తర్వాత కాల్పులను విరమించిన విషయం తెలిసిందే.