ఉమ్మడి నల్గొండలో బిసి సర్పంచులు 39 శాతం పైనే !

ఇది దేనికి సంకేతం? బి.సి. ల రాజకీయ ఐకత్యకా? కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తి నా?

Update: 2025-12-21 06:18 GMT

(పి. చైతన్య)

స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బి.సి లకు 42 శాతం కల్పించక పోయిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన బి. సి. సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ శాతానికి దగ్గరగా ఉన్నారు. అనేక జనరల్ స్థానాలలో బి.సి అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించారు. దీనికి కాంగ్రెస్ ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్ స్ఫూర్తినా లేక బి. సి. ఐక్యతకు నిదర్శనమా?
కోర్ట్ తీర్పుతో బి.సి. లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించలేక పోయినా జనరల్ స్థానంలో బి.సి. లకు కాంగ్రెస్ అవకాశం కల్పిస్తుందని ముఖ్య మంత్రి హామీ ఇవ్వటంతో ప్రతిపక్ష బి. ఆర్ .ఎస్ కు కూడా దానిని అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1779 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా, సర్పంచి గెలిచినా అభ్యర్థులలో 696 సర్పంచులు అంటే 39 శాతం మంది బి.సి. సామజిక వర్గంకు చెందినవారే. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బి..సి. లకు 18 శాతం రిజర్వేషన్ కల్పించటం జరిగింది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 335 బి.సి. రిజర్వుడ్ సర్పంచ్ స్థానాలతో పాటు 361 జనరల్ స్థానాలలో బి.సి. అభ్యర్థులు పోటీ చేసి గెలిచారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ జిల్లాలో మొత్తం 866 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా 145 బి.సి. రిజర్వుడ్ సర్పంచ్ స్థానాలతో పాటు, 189 జనరల్ స్థానాలలో బి.సి. లు పోటీ చేసి 334 సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. జిల్లాలో 377 జనరల్ స్థానాలలో, 165 గ్రామ పంచాతీలలో బి.సి. లు సర్పంచులుగా గెలుపొందారు.
సూర్యాపేట జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలకుగాను 76 బి.సి. రిజర్వుడ్ తో పాటు 67 జనరల్ స్థానాలలో బి.సి. అభ్యర్థులు సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో మొత్తం 427 గ్రామ పంచాయతీలకు గాను 114 బి.సి. రిజర్వుడ్ స్థానాలతో పాటు 105 జనరల్ స్థానాలలో బి.సి. అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారు. దీనితో బి.సి.లు 51 శాతం సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బి.సి. ల తరువాత ఎస్.టి. లు అత్యధిక 26 శాతం సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. 352 ఎస్.టి. రిజర్వుడ్ సర్పంచ్ స్థానాలతో పాటు 100 జనరల్ స్థానాలలో ఎస్.టి. అభ్యర్థులు గెలుపొందారు.
ఓ.సి. అభ్యర్థులు 268 సర్పంచ్ పదవులు గెలుపొంది (15 శాతం) అన్ని వర్గకంటే సంఖ్యా పరంగా కింది స్థానంలో ఉన్నారు. రానున్న రోజులలో కుల సమీకరణలలో మార్పు వచ్చి రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. బి.సి. లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే డిమాండ్ పై రాజకీయ పార్టీలపై వత్తిడి పెంచుతుందనటంలో సందేహం లేదు.
బి.సి. సంక్షేమ సంఘం నాయకులు ఐటగొని జనార్దన్ ది ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ రాజ్యాధికారం దక్కించుకోవటాని బి.సి. లు మరింత ఐక్యతతో పనిచేసి ముందుకు పోయేందుకు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్ఫూర్తినిస్తాయి అనటంలో సందేహంలేదు. బి.సి. అభ్యర్థులు అధిక శాతం సర్పంచ్ పదవులు పొందటం ఆ సమాజక వర్గం వారు జనరల్ స్థానాలలో పోటీచేయటం వల్లనే సాధ్యం అయ్యింది. దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు జనరల్ స్థానాలు అంటే ఓ.సి. పోటీకి కేటాయించినవే అనే భ్రమను ప్రజలలో కల్పిస్తూ వచ్చాయి. ప్రముఖ ఎస్.సి. ఎస్.టి నాయకులను సైతం రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేసారు. కారణం ఎవరైనా, ఏదైనా కావచ్చు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బి.సి.ల రాజకీయ సత్తా ఏమిటో నిరూపించబడింది అని అయన అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News