శరత్ నవలలు ఇప్పటికీ ఎందుకు చదవాలి?

స్వాతంత్య్ర పోరాటంలో శాంతియుత మార్గాన్ని అనుసరించిన ఇటు గాంధీజీతో, అటు సాయుధ పోరాట మార్గాన్ని అనుసరించిన విప్లవ కారులతోను శరత్ సన్నిహితంగా మెలిగాడు.

Update: 2023-12-27 05:31 GMT
"శరత్ సాహిత్యాన్ని నేటికి అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఏమిటి?" పుస్తక ఆవిష్కరణ


సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యూనిస్టు)(ఎస్ యుసిఐ(సి) కేంద్రకమిటీ కార్యదర్శి ప్రవాష్ ఘోష్ రాసిన ‘శరత్ సాహిత్యాన్నినేటికి అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఏమిటి?’ అన్న పుస్తకాన్ని మంగళవారం సాయంత్రం తిరుపతి అంబేద్కర్ భవన్లో సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ ఆవిష్కరించారు. ఆ విష్కరణ సభ విశేషాలు:

‘మనిషి మరణానికి బాధపడను. మానవ విలువల పతనానికి మాత్రమే బాధపడతాను’ అని ప్రకటించిన శరత్ నవలలు బెంగాల్ సమాజాన్నే కాదు, దేశం మొత్తాన్ని ఆలోచింపచే శాయి. ఫ్యూడల్ కట్టుబాట్లు ఉన్న రోజుల్లో, స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో శరత్ సాహిత్యం వచ్చింది.

అలాంటి సాహిత్యాన్ని ఇప్పటికీ ఎందుకు చదవాలన్న ప్రశ్న ఉదయిస్తున్న నేపథ్యంలో శరత్ సాహిత్యం మళ్ళీ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. బెంగాలీ భాషలో రాసిన ఈ పుస్తకాన్ని 2013లో ఆచ్చువేయగా, అది 2017లో ఇంగ్లీషులోకి అనువాదమై, ఇప్పుడు తెలుగులోకి వచ్చింది.

ఈ పుస్తక ఆవిష్కరణ సభ కాళయ్య అధ్యక్షతన జరిగింది.

సభలో రాఘవ శర్మతో పాటు (ఎస్ యుసిఐ(సి) రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎస్.గోవిందరాజులు, మానవ వికాస వేదిక కన్వీనర్ సాకం నాగరాజు, రిటైర్డ్ జిల్లా జడ్జి పి.గుర్రప్ప, ఎస్వీ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ సి.డి.గోవిందులు, ఆచార్య చక్రవర్తి రాఘవన్, ఏ.ఎన్. పరమేశ్వరరావు, కుమార్ రెడ్డి, నిర్మల, ముషీర్ అహ్మద్ తదితరులు శరత్ సాహిత్యం గురించి ప్రసంగించారు.




 


‘‘పంతొమ్మదవ శతాబ్దంలో ఉన్న ఫ్యూడల్ సమాజంలో స్త్రీల పరిస్థతి చాలా దారుణంగా ఉంది. సతీసహగమనం,బాల్యవివాహాలు, నిర్బంధ వైధవ్యం వంటి దురాచారాలతో పాటు వితంతు పునర్వివాహాలకు అవకాశం లేదు. పాత సమాజం నుంచి ఆధునిక సమాజంలోకి మారడానికి పెనుగులాడుతున్న కాలం అది. అలాంటి సమయంలో రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వంటి సంఘసంస్కర్తలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. ఈ సంధి దశలో బంకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్ బాబు వంటి ముగ్గురు మహారచయితలు ఉద్భవించారు.

"మతవిశ్వాసాలున్న బంకించంద్ర చటర్జీ పాత సమాజంలోని మంచిని పునరుద్ధరించాలని తపించాడు. రవీంద్రుడు మార్మికతతో అద్భుత నైపుణ్యం కల కవిత్వాన్ని సృష్టించాడు. పీడితుల పట్ల, ముఖ్యంగా స్త్రీల పట్ల సానుభూతితో వారి దుస్తితిని చిత్రీకరించిన శరత్ వారి పట్ల సానుభూతితో సాహిత్య సృష్టి చేశాడు. ముఖ్యంగా స్త్రీలకు ఒక ప్రవక్తలా పని చేశాడు. తండ్రి మరణంతో బాల్యంలో దారుణమైన దారిద్య్రా న్ని చవిచూచిన శరత్ చదువు మానేసి కుటుంబ పోషణ కోసం రంగూన్ వెళ్ళాడు.

"ఆయన అతి చిన్న వయసులోనే అక్కడి నుంచే చాలా నవలలు రాశాడు. రంగూన్ నుంచి తిరిగి వచ్చాక స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్య్ర పోరాటంలో శాంతియుత మార్గాన్ని అనుసరించిన ఇటు గాంధీజీతో, అటు సాయుధ పోరాట మార్గాన్ని అనుసరించిన విప్లవ కారులతోను శరత్ సన్నిహితంగా మెలిగాడు.స్వాతంత్య్ర సమర యోధులకు, ముఖ్యంగా విప్లవ కారులకు ఎంతో సహాయం చేశాడు.

"ఆరోజుల్లో శరత్ సాహిత్యాన్ని చాలా రహస్యంగా చవివేవారు. ‘మహేశ్వరి’ అన్న చిన్న కథతో శరత్ కరుణ రసంతో రచనా వ్యాసాంగాన్ని మొదలు పెట్టాడు. బడిదీది, దేవదాసు, చరిత్రహీనులు, శేష ప్రశ్న, ఫతేర్ ధాభి(భారతి) వంటి అనేక అద్బుతమైన నవలలు రాశాడు. నోబెల్ బహుమతి రావలసిన 'శేష ప్రశ్న' నవల అని ఎంఎన్ రాయ్ కొనియాడారు. విప్లవ కారులు ఎదుర్కొంటున్న కఠినమైన జీవితం గురించి రాసినందుకు ‘ఫతేర్ ధాభి’(భారతి)ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది.

"ఈ నవల వల్లే శరత్ కు నోబెల్ బహుమతి చేజారింది. దానికాయన ఎన్నడూ బాధపడలేదు. ‘ఫతేర్ ధాభి’(భారతి) నిషేధాన్ని ఖండించమని శరత్ కోరినప్పటికీ, తాను ఖండిస్తే ఆనవలకు ప్రాచుర్యం లభిస్తుందని రవీంద్రుడు ఖండించ లేదు. దీంతో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు పొడచూపాయి.

"శరత్ పైన మార్క్స్, ఎంగెల్స్ ప్రభావం బలంగా ఉంది. శరత్ జీవించిన కాలం నాటి ఫ్యూడల్ సమాజం ఇప్పుడు లేకపోయినా, వేరే వేరే రూపాలలో పీడన మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించినా, ఆచరణలో వారికి అందడం లేదు. ఈ నేపథ్యంలో శరత్ స్మృతులను నెమరేసుకుంటున్నాం.మంచి సాహిత్యం ఉంటేనే సమాజం బాగుపడుతుంది.’’ అని వక్తలు శరత్ సాహిత్యాన్ని, ఆయన జీవితాన్ని మననం చేసుకున్నారు.

రచయిత జీవించిన కాలాన్ని ద్రుష్టిలో పెట్టుకుని అతని రచనలను విశ్లేషించాలని విమర్శకులకు వక్తలు హితవుపలికారు.

‘‘ప్రపంచ మానవాళితో కలిసిపోతున్న సమయంలో నీ అస్తిత్వాన్ని కోల్పోతే తప్పేమిటి’’ అన్న శరత్ మాటలను వక్తలు గుర్తు చేశారు.

Tags:    

Similar News