గుబులు పుట్టిస్తున్న గిబ్లి స్టైల్ ఆర్ట్..

అందరికీ పిచ్చెక్కిస్తున్న ఈ ట్రెండ్.. అందరి ప్రైవసీని ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు అంటున్నారు.;

Update: 2025-04-10 07:21 GMT

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గిబ్లీ ఆర్ట్స్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను ఈ స్టైల్‌లోకి కన్వర్ట్ చేసేసుకుని.. వచ్చిన ఆర్ట్ స్టైల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ కొన్ని రోజుల నుంచి మరీ విపరీతంగా మారుతోంది. కానీ ప్రస్తుతం అందరికీ పిచ్చెక్కిస్తున్న ఈ ట్రెండ్.. అందరి ప్రైవసీని ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు అంటున్నారు. మన ఫొటోలను ఆర్ట్‌గా మార్చుకోవడం వల్ల మనకే చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటే వారికి అవగాహన కల్పించాలని నిపుణులు చెప్తున్నారు.

అసలు గిబ్లీ స్టైల్ ఆర్ట్ ఎలా చేస్తారు..

గిబ్లీస్టైల్ ఫొటోలు చేసుకునే ఫీచర్ చాట్‌జీపీటీ, గ్రాక్ వంటి వాటిల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మొన్నటి వరకు ఈ స్టైల్ ఆర్ట్ కోసం ప్రత్యేక యాప్ ఒకటి ఉంది. ‘గిబ్లిస్టైల్ ఏఐ ఇమేజ్’ అనే యాప్ ద్వారా మన ఫొటోలను ఈ స్టైల్‌లోకి మార్చుకోవచ్చు. ఇందులో ఫొటోలు 1990, 2000 సమయంలో జపనీస్ యనిమేషన్ స్టైల్ బొమ్మలా ఉంటుంది. దాంతో పాటుగా 1965 తరం ఆర్ట్, స్కెచ్ స్టైల్ ఇలా మరికొన్ని రకాల స్టైల్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ స్టైల్‌లో ఫొటో కోసం.. ముందుగా మన ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన స్టైల్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అంతే ఒక 30 సెకన్లలో గిబ్లీ స్టైల్ ఆర్ట్ ఫొటో వచ్చేస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని మీకు నచ్చిన చోట షేర్ చేసుకోవచ్చు. దీనిని చాలా సెలబ్రిటీలు కూడా వాడుతున్నారు. ఇది ఇటీవల చాట్‌జీపీటీలో కూడా ఫ్రీగా అందుబాటులోకి రావడంతో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది.

దీని వల్ల తిప్పలు తప్పవా..!

టెక్నాలజీ పరంగా ప్రపంచం పరుగులు పెడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మానవుడి జీవనవిధానాన్ని సులభతరం చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని, రోజుకో కొత్త ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు పురుడు పోస్తున్నారు. అందులో కృత్రిమ మేధా కూడా ఒకటి. ఈ టెక్నాలజీ పెరగడం వల్ల మానవుడి జీవనం ఎంత సులభతరం అయిందో, కమ్యూనికేషన్ ఎంత మెరుగుపడిందే అంతే చెడు ప్రభావాలు కూడా అధికంగా ఉన్నాయి. టెక్నాలజీని చెడు పనులకు వినియోగిస్తున్న వారి సంఖ్య అధికం అవుతోంది. దీంతో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నాయి. కానీ ప్రజల్లో అవగాహన రావడం లేదు. సోషల్ మీడియా ఖాతాల్లో కూడా మీ పర్సనల్ ఫొటోలు, ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేసుకోవద్దని నిపుణులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు తమ సమాచారాన్ని నేరుగా ఏపెన్ ఏఐకి అందిస్తున్నారు. తమ ఫేసిషియల్ ఇన్ఫర్మేషన్‌‌ను తల్లి చిన్న పిల్లాడికి గోరుముద్దలు తినిపించినట్లు తీసుకెళ్లి ఓపెన్ ఏఐకి అందించేస్తున్నాం. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో ఫొటోలను వాడి మరీ అన్ని యాంగిల్స్‌లో మన ఫేసిషియల్ ఇన్ఫోని ఏఐ పరం చేస్తున్నాం. ఇలా ఎక్కడ జరుగుతుందని అనుకుంటున్నారా.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇందుకు ప్రత్యేక నిదర్శనం.

 

ఈ ట్రెండ్‌తో మన ఇన్ఫర్మేషన్‌నే కాకుండా.. మన పక్కన ఉండేవాళ్లు, మన పిల్లలు, స్నేహితులు, కావాల్సిన వారిన ఫేసిషియల్ ఇన్ఫర్మేషన్‌కు కూడా ఏఐకి అందించేస్తున్నాం. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. మన ఫొటోలను వాడి గిబ్లి స్టైల్ ఫొటోలను క్రియేట్ చేయడం సైబర్ క్రైమ్ ప్రమాదాన్ని తీవ్రంగా అధికం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇలా మనం ఏఐకి ఇచ్చిన ఫొటోలను అనేక విధాలుగా వినియోగించే ప్రమాదం ఉందని, ఒక్కసారి ఆ సంస్థ డేటా బ్రీచ్ అయిందంటే.. అప్పటి వరకు అందులో ట్రెండ్ కోసం ఫొటోలు అప్‌లోడ్ చేసిన ప్రతి యూజర్ ఫేషియల్ డాటా అంగటి సరుకులా మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒక్కసారి మన ఫేషియల్ డాటా బ్లాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందంటే దాంతో డీప్‌ఫేక్స్, ఐడెంటిటీ చోరీ, ఆఖరికి మన ఫేషియల్ ఇన్ఫోతో కొత్త ఫేస్‌ను తయారు చేసి.. దానిని ఎలాగైనా వినియోగించే ప్రమాదం ఉంది. ఓపెన్ ఏఐ సహాయంతో ఈ గిబ్లీ స్టైల్ ఫొటోలు చేసుకునే వారు రిస్క్‌లో ఉన్నట్లేనని నిపుణులు అంటున్నారు. మరికొందరయితే భారీ మొత్తంలో యూజర్ డాటా, ఇన్‌పుట్స్ తీసుకోవడం కోసం ఈ గిబ్లీ స్టైల్ ట్రెండ్ అనేది ఒక ప్లాన్ అని అంటున్నవారు కూడా ఉన్నారు. తమ ఏఐని ట్రైన్ చేసుకోవడానికి ప్రత్యేక ట్రైనర్లను పెట్టుకుంటే భారీగా ఖర్చవుతుందని, అదే ఇలా ఒక ట్రెండ్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తే ఫ్రీగా ఊహించిన దానికంటే ఎక్కువ సమాచారం అందతుందని, తద్వారా తమ ఏఐ ట్రైనింగ్ అనేది సులభతరం అవుతుందని కొన్ని సంస్థలు ఆలోచించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే గిబ్లీ ట్రెండ్‌తో యూజర్స్ తమకు తెలియకుండానే తమ సమాచారాన్ని, ఫేషియల్ ఇన్ఫర్మేషన్‌ను ఏఐకి అందిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. చాలా వరకు ఏఐ సంస్థలు తమ ప్రైవసీ పాలసీలో మనం అందించే డాటాను తమ ఏఐ ట్రైనింగ్‌కు వినియోగిస్తామని రాసి ఉంటుందని, కానీ దానిని గమనించకుండానే యూజర్లే ఓకే చేసేస్తారని, ఆ తర్వాత మన ఏ ఫొటో అప్‌లోడ్ చేసిన దానిని ఆ సంస్థ ఎలాగైనా వినియోగించే హక్కులు మనమే వారికి ఇచ్చేస్తున్నమాని నిపుణులు చెప్తున్నారు. GDPR నిబంధనల ప్రకారం అయితే ఓపెన్ ఏఐ సంస్థలు తమ దగ్గర ఫొటోలను డిలీట్ చేసేయాల్సి ఉంటుంది. అదనపు భద్రతా చర్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. కానీ యూజర్స్ తమ ఫొటోలను అప్‌లోడ్ చేసే సమయంలో వచ్చిన ప్రతి పాప్‌ నోటిఫికేషన్‌ను చదవకుండానే ఓకే లేదా అప్రూవ్ చేసేస్తారు. దాంతో ఆ ఫొటోలను సదరు సంస్థ ఎలాగైనా వినియోగించే హక్కులు చట్టబద్ధంగా మనమే వారికి ఇచ్చేస్తున్నాం. ఒక్కసారి ప్రైవసీ పాలసీకి ఓకే చెప్పేసిన తర్వాత అప్‌లోడ్ చేసిన ఫొటోను వినియోగంపై నియంత్రణను మనం పూర్తిగా కోల్పోతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఓపెన్ ఏఐ ప్రైవసీ పాలసీ ప్రకారం.. వినియోగదారుడి అంగీకారం లేకుండా వారి ఫొటోలను ఏఐ ట్రైనింగ్ కోసం వినియోగించడానికి కుదరదు. వినియోగదారుడిని నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటి నుంచి వారు అప్‌లోడ్ చేసే ప్రతి ఫొటోను సదరు సంస్థ ఎలాగైనా వినియోగించుకోవచ్చు. అందువల్ల ట్రెండ్ వెనక పరిగెడుతూ వినియోగదారులు తమ గోప్యతను, సమాచారాన్ని ఏఐ పాలు చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన డేటాను దుర్వినియోగం చేస్తే వాటికి బాధ్యలం మనమే అవుతాము తప్ప మరెవరూ కారు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

సైబర్ క్రైమ్ పోలీసులు కూడా మనకు సంబంధించిన ఏ చిన్న సమాచారాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్న గిబ్లీ స్టైల్ వంటి ట్రెండ్‌ల వల్ల సైబర్ క్రైమ్స్ మరింత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, ఇదే ట్రండ్‌తో ఎవరైనా ఫేక్ యాప్‌ తయారు చేసి విడుదల చేస్తే.. దానిని వినియోగించిన ప్రతి ఒక్క యూజర్‌కు సంబంధించి సమాచారం మొత్తాన్ని సైబర్ క్రిమినల్స్ విచ్చలవిడిగా తమ నేరాలకు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనిని నివారించాలంటే వినియోగదారులకు స్వీయనియంత్రణతోనే సాధ్యమని అంటున్నారు.

Tags:    

Similar News