ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్ట్‌లు లొంగుబాటు..
మిగిలిన వారూ జనజీవనస్రవంతిలో కలవండని పిలుపిచ్చిన ఆశన్న.
మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్ట్‌లు పోలీసుల ముందు లొంగిపోయారు. తమ ఆయుధాలను విడిచిపెట్టారు. ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, హోంమంత్రి విజయ్ శర్మ సమక్షంలో వారు తమ ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారు పురుషులు 98 మంది, మహిళలు 110 మంది ఉన్నారు. వారు మొత్తం 153 ఆయుధాలను అప్పగించారు. వాటిలో ఏకే-47 రైఫిల్లు 19, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు-17, ఇన్సాస్‌లు 23, ఇన్సాస్ ఎల్ఎంజీ 1, రైఫిళ్లు 303, బీజీఎల్ 11, కార్బైన్‌లు నాలుగు, బోర్ షాట్‌గన్‌లు 41, పిస్తోళ్లు కూడా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా ఆశన్న మాట్లాడుతూ.. తమది లొంగుబాటు కాదని, ప్రభుత్వం పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమయ్యామని ఆశన్న చెప్పారు. అంతేకాకుండా మిగిలిన మావోయిస్ట్ పార్టీ సభ్యులకు ఆయన కీలక సూచన చేశారు.
‘‘ఈ నిర్ణయం క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్నాం. హింసా మార్గాన్ని వదిలి, జనజీవన స్రవంతిలోకి రావాలని నేను, మా సహచరులు నిర్ణయించుకున్నాం. ఇది లొంగుబాటు కాదు, శాంతియుత పోరాటానికి మార్పు మాత్రమే. ప్రభుత్వం మా షరతులతకు అంగీకారం తెలిపింది. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మాది లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలవడం అని ప్రభుత్వం ఒప్పుకుంది. ఉద్యమంలో ఎందరో అమరలయ్యారు. వారందరికీ జోహార్లు’’ అని ఆశన్న తెలిపారు. “అడవులు ఇక మనను రక్షించలేవు, ఇప్పుడు తిరిగి జీవనాన్ని పునర్నిర్మించుకుందాం” అని ఆయన అన్నారు.
ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్టుల లొంగుబాటును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వాగతించారు. నక్సల్స్ నుంచి అబూజ్‌మఢ్, ఉత్తర బస్తర్ ప్రాంతాలు విముక్తి పొందాయని అన్నారు. దక్షిణ బస్తర్‌లో కూడా శాంతిని స్థాపిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్ట్‌లు ఒకేసారి పోలీసుల ముందు లొంగిపోవడం, ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవడానికి మందుకు రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ లొంగుబాటు సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది.
ఎవరీ ఆశన్న..
తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న.. తెలంగాణాలోని ములుగు జిల్లా పొలోనిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన అతను ఐటీఐ, పొలిటెక్నిక్ చదివారు. చదువు పూర్తి చేసిన తర్వాత 1991లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు. గత 30 ఏళ్లుగా ఆయన మావోయిస్ట్ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. అనేక మావోయిస్ట్ మిషన్స్‌లో ప్రధాన పాత్ర పోషించారు. 1999లో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర హత్య, 2000లో మాజీ హోం మంత్రి ఆలిమినేటి మాధవరెడ్డి హత్య, 2003లో చంద్రబాబు నాయుడు మీద అలిపిరి దాడి వంటి ప్రముఖ కేసుల్లో పాత్ర పోషించాడు .
ఆశన్న లొంగివేతను “చారిత్రాత్మక క్షణం”గా అధికారులు పేర్కొన్నారు. దీనితో దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు నెట్‌వర్క్ తీవ్రంగా బలహీనపడనుందని భావిస్తున్నారు. ఆశన్న లొంగివేత మావోయిస్టు కేంద్ర కమిటీలో పెద్ద మార్పుకు దారితీసే సూచనలు ఉన్నాయి. ఇటీవల రెండు నెలల్లో మావోయిస్టులపై ప్రభుత్వం జరిపిన ఆపరేషన్లు, మరికొందరు నాయకుల లొంగిపోయే పరిణామాలతో బస్తార్ ప్రాంతం వేగంగా నక్సల్-ముక్త ప్రాంతంగా మారుతోంది . ఈ లొంగివేత చత్తీస్గఢ్‌లో నక్సలిజం క్షీణించడానికి కీలక మలుపుగా పరిగణిస్తున్నారు.