‘సీఎంఎస్-03’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
బాహుబలి శాటిలైట్ ను జీటీఓలోకి మోసుకెళ్లిన ఎల్వీఎం-3- ఎం5
By : The Federal
Update: 2025-11-02 12:54 GMT
ఇస్రో మరో భారీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లో ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు ఎల్వీఎం3-ఎం5 వాహనం 4,410 కిలోల బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ ను జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్(జీటీఓ) కి ప్రవేశపెట్టింది.
సీఎంఎస్- 03 ఉపగ్రహం ఇప్పటి వరకూ ఇస్రో ప్రయోగించిన అతిబరువైన శాటిలైట్ అని సంబంధిత అధికారులు తెలిపారు. ఇది స్వదేశీ తయారీ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఇంతకుముందు ఇలాంటి భారీ ఉపగ్రహాలను ఫ్రెంచ్ గయానాలోని కౌరు కేంద్రం నుంచి ప్రయోగించేవారు.
చివరగా 2018 డిసెంబర్ 5 న ఏరియన్ -5 వీఏ 246 రాకెట్ ద్వారా అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం అయిన జీశాట్-11 ప్రయోగించింది. దీని బరువు 5,854 కిలోలు. ప్రస్తుతం సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని 43.5 మీటర్ల పొడవైన ఎల్వీఎం-3- ఎం5 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. ఈ శాటిలైట్ బరువు కారణంగా దీన్ని బాహుబలిగా అంతా అభివర్ణిస్తున్నారు.
ప్రయోగ వాహానాన్ని పూర్తిగా సమీకరించి అంతరిక్ష నౌకతో అనుసంధానించామని, ప్రయోగానికి ముందు కార్యకలాపాలను చేపట్టడానికి దానిని శ్రీహరి కోటలోని రెండో ప్రయోగ వేదికకు తరలించామని అంతరిక్ష సంస్థ తెలిపింది.
‘‘శనివారం సాయంత్రం 5.26 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ సజావుగా సాగింది. ఎల్వీఎం- 3 లాంచ్ వెహికల్ ఇస్రో కొత్త రేసు గుర్రం. ఇది నాలుగువేల కిలలో బరువును సునాయాసంగా కక్ష్యలోకి మోసుకెళ్తుంది.
ఈ ఉపగ్రహంలో సైనిక నిఘా ట్రాన్స్ పాండర్లు కూడా ఉన్నాయని సమాచారం బయటకు వస్తున్నప్పటికీ ఇస్రో మాత్రం అధికారికంగా ఏ విషయాన్ని ధృవీకరించలేదు. సీఎంఎస్-03 మాత్రం బహుళ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం, ఇది భారత భూభాగంతో సహ విస్తృత సముద్ర ప్రాంతాలలో కూడా సేవలందిస్తుందని మాత్రమే ఇస్రో తెలిపింది.