విద్యార్థులు రాజకీయాలు మాట్లాడితే తరిమేస్తామంటున్న విద్యాసంస్థ

ఇకముందు కళాశాలలో అడ్మిషన్లు పొందాలంటే ఫలనా పని చేస్తాం అనే హమీ బదులు.. చేయకూడదు అనే నిబంధనలు ఎక్కువవుతాయి కావచ్చు. ముంబాయిలోని ఓ కళాశాలలో..

Update: 2024-09-04 06:16 GMT

మా విద్యా సంస్థలల్లో చేరితే కల్చరల్ ఆక్టివిటీస్ ఉంటాయి.. లేదా స్పోర్ట్స్ కి ప్రత్యేక శిక్షణ ఇస్తాం.. లేదా మా దాంట్లో 6 తరగతి నుంచి సివిల్స్ పాఠాలు చెబుతాం... జేఈఈ మెయిన్స్ చెబుతాం అన్నవి చూశాం... కానీ మా కళాశాల్లో చేరితే రాజకీయ ఆందోళనలు చేయకూడదు.. దేశ వ్యతిరేక చర్యలకు ఊతమివ్వద్దు, ఎలాంటి ధర్నాలకు ఆస్కారం ఇవ్వకూడదు, రాజకీయ చర్చలు ఉండకూడదు, సామాజిక సమస్యలపై గళం లేవనెత్తకూడదు లేదా తరగతుల నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడరాదు అనే షరతులు విధించడం చూశారా?

ఇలా విద్యార్థుల నోటికి తాళం ఎందుకు వేస్తున్నారు. దీని వల్ల ఏం సాధించాలని అనుకుంటున్నారు. అసలు ఇలాంటి నిబంధనలు విధించిన సంస్థ ఎక్కడుంది అనుకుంటున్నారా?
ముంబాయిలో టాటాల ఆధ్వర్యంలో నడిచే ‘‘ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) ’’ మాత్రం ఇలాంటి నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఇక్కడ విద్యార్థులు అడ్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా ఈ షరతులకు ఒప్పుకోవాల్సిందే. లేకపోతే అడ్మిషన్ ప్రక్రియ ఇక అక్కడితో ముగిసినట్లే. ఒకవేళ ముందు అన్ని కండిషన్లకు ఒప్పుకుని కళాశాల్లో చేరిన తరువాత ఇలాంటి చర్యలకు పాల్పడితే తమపై కఠిన చర్యలకు తీసుకోవచ్చని సంబంధిత పత్రంలో విద్యార్థులు అంగీకరించాలి. దీనిని ఇక్కడ ‘హానర్ కోడ్’ పేరుతో పిలుస్తుంటారు.
టిస్ ఆధ్వర్యంలో నడిచే సంస్థలో ఇంతకుముందు కొన్ని దేశ వ్యతిరేక చర్యలు జరిగినట్లు కలకలం రేగింది. ముఖ్యంగా గుజరాత్ జరిగిన కరసేవకుల సజీవ దహనం తరువాత చెలరేగిన మత ఘర్షణల్లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఉందని ‘ బీబీసీ’ చేసిన డాక్యుమెంటరీని ఈ కళాశాల్లో ప్రదర్శించడం తీవ్ర కలకలం రేపింది. గుజరాత్ అల్లర్ల పై వివిధ కమిషన్లు, భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాని నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చాయి. కానీ బ్రిటిషు మీడియా మాత్రం దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు ఈ డాక్యుమెంటరిని ప్రసారం చేసింది.
ఇదే కేసులో హక్కుల కోసం పోరాడుతున్న అని తనని తాను ప్రకటించుకున్న తీస్తా సెతల్వాడ్ పై కేసు నమోదు చేయాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అమాయకులను కేసులో ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిన కారణంగా తీస్తాపై పలు సెక్షన్ల కింద ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇవేవీ డాక్యుమెంటరీలో లేకుండా బ్రిటిషు మీడియా జాగ్రత్త పడింది. దీనిని కొంతమంది మేధావులు.. వెస్ట్ అనుసరించే రెజీమ్ ఛేంజ్ పాలసీకి అనుకూలంగా ఉందని విమర్శలు గుప్పించారు.
ఈ డాక్యుమెంట్ ప్రదర్శనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కొంతమంది దీనిని క్యాంపస్ లో ప్రదర్శించారు. తరువాత ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇవే కాకుండా నిషేధిత పీఎస్ఎఫ్ ఇక్కడ తన కార్యకలాపాలను చురుకుగా నిర్వహించింది. దీనికి సంబంధించిన కీలక విద్యార్థినేత అయిన కే ఎస్ రామదాస్ ను రెండు సంవత్సరాలు కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. చట్ట వ్యతిరేక, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడనే అభియోగంతో టిస్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ సస్పెన్షన్ నిర్ణయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
ప్రస్తుతం ఈ కళాశాల కేంద్ర విద్యాశాఖతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. మొదట్లో ఈ సంస్థ కేవలం టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో మాత్రమే ఉండేది. వాళ్లే ఓ నిర్వహకుడిని నియమించే వారు. బోర్డులో వారి వ్యక్తే చైర్ పర్సన్ గా ఉండేవారు. తాజాగా సవరించిన నిబంధనలు ప్రకారం ఇప్పుడు టిస్ కేంద్ర విద్యాశాఖ పరిధిలోకి వెళ్తుంది.
ఈ విషయంపై ఓ విద్యార్థి మాట్లాడుతూ.. హనర్ కోడ్ కింద ప్రతి సంవత్సరం నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. నిబంధనలు విధింపు సరే.. కానీ ఇవన్నీ కూడా రాజ్యంగ సూత్రాల ప్రకారం ఉన్నాయా? అని విద్యార్థి నాయకుడు ప్రశ్నించాడు. ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లు కాదా? వీటిని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఒక వేళ వీటిని ఉల్లంఘిస్తే శిక్ష పడే అవకాశం ఉందని వివరించారు.
హనర్ కోడ్ విధించడంపై ప్రముఖ హక్కుల కార్యకర్త మేధా పాట్కర్ స్పందించారు. ‘‘ విద్యార్థులను ఇలా కట్టడి చేయడం సమంజసం కాదు. ఇలాంటివి విద్యార్థులు, అడ్మినిస్ట్రేషన్ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించలేవు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ విద్యార్థులను తప్పనిసరిగా ఇందులో సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుంది’’ అన్నారు. టిస్ పూర్వ విద్యార్థులు శాంతి, అహింసకు ప్రసిద్ధి చెందారు. అలాగే కళాశాల యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్యవర్తులుగా పని చేశారని మేథా పాట్కార్ అభిప్రాయపడ్డారు.
ఇదే అంశానికి సంబంధించిన ఓ ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ఫెడరల్ తెలంగాణతో మాట్లాడారు. ‘‘ కళాశాలలు రానురాను విద్యాకేంద్రాలుగా కాకుండా కేవలం రాజకీయ పునరావాసాలుగా మారుతున్నాయి. ఇక్కడ కేవలం విద్యా మాత్రమే నేర్చుకోవాలి. మిగిలిన విషయాలు ఏమన్నా ఉంటే బయట చూసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
’’  ముఖ్యంగా విద్యార్థుల ఏకాగ్రత దెబ్బ తీసే అంశాలు ఎక్కడ జరగకూడదని అభిప్రాయపడ్డారు. ‘‘ రాజకీయా అభిప్రాయాలను పున: నిర్మించుకోవడానికి వీటిని వాడుతున్నారు. మీకో ఉదాహారణ చెబుతాను. మన పొరుగుదేశం బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ ఉద్యమం జరిగింది. ఇది మంచిదే. కానీ అక్కడ పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యంగా ఉద్యమం విద్యార్థులు చేతుల నుంచి మతాధికారుల చేతిల్లోకి వెళ్లింది. ఈ మధ్య ఈ మత సంస్థ విద్యార్థులపై దాడులకు దిగింది’’  కొంతమంది తమ స్వార్థ రాజకీయ అజెండా కోసం విద్యార్థులనే వాడుకుంటున్నారు’’ అని అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News