కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలి
మంత్రి ఫరూఖ్ కు విజ్ఞప్తి చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు.;
కృష్ణానది(Krishna river) యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు అయ్యేందుకు కృషి చేస్తానని న్యాయ, మైనార్టీ వెల్ఫేర్ శాఖా మంత్రి NMD ఫరూఖ్ (Farooq)తెలిపారు. శనివారం నంద్యాలలో మంత్రి ఫరూఖ్‌ను రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శివరామపురం రవి, కొమ్మా శ్రీహరి ల బృందం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేసేదిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో మాట్లాడతానని సమితి నాయకులకు ఫరూఖ్ హామీ ఇచ్చారు.అంతకుముందు సమితి నాయకులు KRMB ఆవశ్యకతపై మంత్రికి వివరించారు. సాగునీటి రంగంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు అయ్యేందుకు కృషి చేయాలని ఫరూఖ్‌ను కోరారు.
శ్రీశైలం రిజర్వాయర్ (Srisailam Reservoir) నిర్వహణను చట్టబద్దంగా చేపట్డకపోవడం వలన మరింత అధికంగా నష్టపోతున్నదని, ఈ నష్ట నివారణకు శ్రీశైలం ప్రాజెక్టు వున్న కర్నూలులో KRMB కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ ప్రాంతం చట్టబద్ద హక్కులను పొందుతుందని.. ఆదిశగా ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి మీద ఒత్తిడి తెచ్చి KRMB కార్యాలయం కర్నూలులోనే ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని మంత్రిని కోరారు.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్(Nagarjuna Sagar) ద్వారా కృష్ణా డెల్టాకు విడుదల చేయాల్సిన 80 టిఎంసి కృష్ణా జలాలకు బదులుగా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా పొందుతున్నది. దీనితో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చెయ్యాల్సిన అవసరం లేదని వివరించారు.
గోదావరి(Godavari) జలాల మళ్లింపుతో శ్రీశైలం రిజర్వాయర్‌లో ఆదా అయిన కృష్ణా జలాలు రాయలసీమ ప్రాజెక్టులకు వినియోగించాలనీ, ఈ అదా అయిన కృష్ణా జలాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులకు ప్రధానంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల, తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అత్యంత కీలకంగా మారిందని తెలిపారు.
రాయలసీమ భవిష్యత్తుకు ముడిపడిన KRMBని కర్నూలులో ఏర్పాటు అయ్యేలా ముఖ్యమంత్రి గారిని ఒప్పించాలని వారు మంత్రి ఫరూఖ్‌ను కోరారు. మరోవైపు KRMB కర్నూలులో ఏర్పాటు సాధన కోసం రాయలసీమ సాగునీటి సాధన సమితి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టారు. సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపు మేరకు రాయలసీమ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మండల తహసీల్దార్లకు ఆయా మండల సమితి కార్యవర్గ సభ్యులు వినతిపత్రాలను ఇస్తూ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను చేపడుతున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేసేలా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే.