NANO-UREA | నానో-యూరియా ఢమాల్, తగ్గిన వరి, గోధుమ దిగుబడి!

నానో- యూరియా పంట దిగుబడులను దెబ్బతీసిందా? నానో యూరియా వాడకంతో గోధుమ, వరి దిగుబడులు తగ్గాయా? అంటే అవుననే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.;

Update: 2025-01-27 01:30 GMT
image curtesy IFFCO

నానో- యూరియా పంట దిగుబడులను దెబ్బతీసిందా? నానో యూరియా వాడకంతో గోధుమ, వరి దిగుబడులు తగ్గాయా? నానో యూరియా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదా? అంటే అవుననే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా రెండేళ్ల కిందట మార్కెట్ కి విడుదల చేసిన నానో యూరియాపై పంజాబ్, లూధియానా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వ్యవసాయ రంగ నిపుణులు నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి.

నానో-యూరియాపై దీర్ఘకాలిక పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు చెప్పిన నిజమేమిటంటే ఇది దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపింది.
పంటల దిగుబడులపై నానో-యూరియాకు ఉన్న ప్రభావాన్ని విశ్లేషించే భారతదేశంలోని అతిపెద్ద పరిశోధనలలో ఒకటైన ఈ అధ్యయనం ప్రస్తుతం దేశంలో కలకలం సృష్టించింది. నానో యూరియా వినియోగం వల్ల వరి, గోధుమ దిగుబడులు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ రెండు పంటలు భారతదేశ ఆహార ధాన్య ఉత్పత్తిలో సుమారు 70% వాటా కలిగి ఉన్నాయి.
నానో- యూరియాను IFFCO సంస్థ అభివృద్ధి చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం కల్పించింది. ఇఫ్కో సంస్థ సూచించిన విధానంలో నానో యూరియాను ఉపయోగించడం వల్ల వరిలో 35%, గోధుమ ఉత్పత్తిలో 24% ప్రోటీన్ శాతం తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది.
పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, లుధియానాకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని Plant Soil అనే పత్రికలో ప్రచురించారు. వారు పేర్కొన్నదేమంటే, "ఇలాంటి నత్రజని నిర్వహణ పద్ధతులను ఆచరణలో పెట్టడంలో జాగ్రత్తలు అవసరం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతుల ఆర్థిక ప్రయోజనాలు, జీవనోపాధి ప్రమాదంలో పడవచ్చు."
యూరియా వినియోగంలో కీలక అంశాలు
భారత వ్యవసాయ రంగంలో యూరియాకు ప్రాధాన్యం ఉంది. దేశానికి ప్రతి ఏటా 350 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, దానిలో 40 లక్షల టన్నులు దిగుమతి చేయాల్సి వస్తుంది. బస్తా యూరియాపై ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. 45 కిలోల బస్తా విలువ ₹3,000 అయినప్పటికీ, రైతులకు ₹242కే అందిస్తోంది. 2023-24లో ప్రభుత్వం యూరియాపై ₹1.3 లక్షల కోట్ల వ్యయం చేసింది. ఒక బస్తా యూరియా సుమారు 20 కిలోల నత్రజని అందిస్తుంది.
500 మిల్లీలీటర్ల నానో-యూరియా ద్రావణం 4% (w/v) నత్రజని కలిగి ఉంటుంది. అంటే 20 గ్రాముల నత్రజని. IFFCO ప్రకారం, నానో-యూరియా స్ప్రే వల్ల ఒక హెక్టారుకు 52 కిలోల నత్రజనిని భర్తీ చేయగలదని ప్రకటించింది. నానో-యూరియా, సాంప్రదాయ యూరియా మాదిరిగా వేళ్లకు కాకుండా (రూట్స్‌కు కాకుండా) పొట్ట దశ, కంకిఎల్లడం, గింజ పాలుపోసుకునే దశల్లో ఆకుపై స్ప్రే చేస్తారు.
దీనివల్ల, రైతులు హెక్టారుకు రెండు బస్తాల యూరియా అవసరం కాగా ఒక బస్తా యూరియాకు బదులుగా ఒక నానో-యూరియా బాటిల్ ఉపయోగించి అదే దిగుబడిని పొందవచ్చు. నానో-యూరియా బాటిల్ ధర ₹260 మాత్రమే. దీని వల్ల మొత్తం యూరియా వినియోగాన్ని తగ్గించి, దిగుమతి వ్యయాలను తగ్గించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.
సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా, నానో-యూరియాను ప్రవేశపెట్టారు. 500 మిల్లీలీటర్ల నానో-యూరియా ద్రావణంలో 4% నత్రజని ఉంటుంది. IFFCO లెక్క ప్రకారం, ఒక్క స్ప్రేతో సాంప్రదాయ యూరియా వినియోగాన్ని తగ్గించవచ్చు. పంట పొట్ట విప్పి గింజ పాలుపోసుకునే దశల్లో ఆకుపై స్ప్రే చేయడం వల్ల నత్రజని ని మొక్క బాగా పీలుస్తుందని, తద్వారా భూమిలో నత్రజని శాతం మెరుగవుతుందని కూడా కంపెనీ ప్రచారం చేసింది.
రైతులు హెక్టారుకు రెండు బస్తాల యూరియాను వాడతారు. ఒక్క నానో యూరియా బాటిల్ ద్రావణం ఒక బస్తా యూరియాతో సమానమని ఇఫ్కో ప్రచారం చేసింది.
సమీక్షా ఫలితాలు ఎలా ఉన్నాయంటే...
2022లో నానో-యూరియా వాణిజ్య మార్కెట్ కి విడుదలైంది. అప్పటి నుంచి దీని ప్రభావంపై నిర్ధిష్ట ప్రయోగాలు, పరీక్షలు ఏమీ జరగలేదు. “IFFCO గత పరీక్షల్లో సానుకూల ఫలితాలు చూపించినప్పటికీ, మా పరిశోధనల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినందున దీర్ఘకాలిక పరిశీలన అవసరం," అని అధ్యయనానికి నేతృత్వం వహించిన వ్యవసాయ శాస్త్రవేత్త రాజీవ్ సిక్కా తెలిపారు.
ఈ పరిశోధన కూడా IFFCO ఆర్ధిక సాయంతోనే సాగింది. ఫలితాల్లో ప్రతికూల ప్రభావం కనిపించింది. పంటలు బలంగా నిలదొక్కుకునే వేరు (రూట్స్) వ్యవస్థ, పోషక శాతం తగ్గడం వెల్లడైంది. “నానో-యూరియాతో పంటలకు అవసరమైన నత్రజని అందుబాటులో లేకపోవడం వల్ల దిగుబడులు తగ్గాయి," అని ప్రొఫెసర్ సిక్కా వివరించారు.
సవరణలు అవసరం..
IFFCO రూపొందించిన కొత్త నానో-యూరియా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని పరిశోధకులు తేల్చారు. అయితే, ఆ ఫలితాలను పూర్తిగా ప్రచురించలేదు. ఈ పరిశోధన, నానో-యూరియాపై ఉన్న అంచనాలను సమీక్షించి దీర్ఘకాలిక ప్రయోజనాలను పునర్నిర్వచించాల్సిన అవసరాన్ని సూచించింది.
Tags:    

Similar News