ట్రంప్ తో మోదీ స్నేహం క్రమంగా బీటలు వారుతోందా?
భారత్ కు వ్యతిరేకంగా ట్రంప్ ఎందుకు ప్రకటనలు ఇస్తున్నాడు..!;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-17 11:17 GMT
(మూలం.. పెర్నీత్ సింగ్)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తనకు గొప్ప స్నేహం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తరుచుగా చెబుతుంటారు. 2020 ఎన్నికలకు ముందు హౌడీ మోడీ కార్యక్రమంలో ‘ అబ్ కీ బార్, ట్రంప్ సర్కార్’ అనే నినాదం ఇచ్చి ప్రవాస భారతీయుల నుంచి ఆయనకు మద్దతు కూడగట్టడానికి ప్రయత్నించాడు.
అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో పరిస్థితులు అప్పటిలా లేవు అన్నది నిజం. గత కొన్ని నెలలుగా కాలం చాలా వేగంగా మార్పు చెందింది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ సమయం, సుంకాల విధింపులో ఇది చాలా స్పష్టంగా కనిపించింది.
ట్రంప్ 2.0 తో క్షీణిస్తున్న సంబంధాలు..
గత ఏడాది సెప్టెంబర్ లో అమెరికా ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అమెరికాను సందర్శించినప్పుడూ ఇద్దరు నాయకుల మధ్య సంబంధాలలో ఒక మలుపు తిరిగింది. వారు కలుస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. స్వయంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. కానీ మోదీ మాత్రం కలవలేకపోయారు.
తరువాత ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన మొదటి పదవీకాలానికి పూర్తి విరుద్దంగా ఉంది. 2019 లో హ్యూస్టన్ లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ ర్యాలీకి అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ను మోదీ ఆహ్వానించారు. అక్కడ 50 వేల మంది జనసమూహం ట్రంప్ ను ఆకట్టుకుంది.
ఆ తరువాత 2020 లో ట్రంప్ భారత పర్యటన జరిగింది. ఇక్కడ ఆయన కోసం అహ్మాదాబాద్ లో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించారు. మోదీ పేరు మీద కొత్తగా నిర్వహించిన స్టేడియంలో లక్ష మంది ప్రజలు కిక్కిరిపోయారు.
2019 లో హ్యూస్టన్ లో జరిగిన కార్యక్రమంలో మరోసారి ట్రంప్ ఎన్నికవ్వాలని ఆయన కోరుకున్నట్లు కనిపించారు. ఇది కొంచెం విమర్శలకు దారితీసింది. హౌడీ మోడీ, అబ్ కీ బార్, ట్రంప్ సర్కార్ పదబంధాలను భారతీయ- అమెరికన్ మద్దతుదారులు రూపొందించారు.
ఈ ప్రవాసులు తరుచుగా ఇద్దరు నాయకుల మధ్య సారూప్యతలను బలమైన, దృఢమైన వ్యక్తులుగా చూస్తారు. కొంతమంది అమెరికన్ వ్యాఖ్యతలు కూడా ప్రధాని మోదీ 2020 లో రెండవసారిట్రంప్ కు మద్దతు ఇచ్చారని తెలిపారు. అయితే అప్పటి ఎన్నికల్లో జో బైడెన్ గెలిచారు. వాషింగ్టన్ లో డెమోక్రాట్ల పాలన పట్ల న్యూఢిల్లీ తన విధానాన్ని పున: సమీక్షించుకోవాల్సి వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
సుంకాలు.. వాణిజ్య యుద్ధం..
ఈ సంవత్సరం ఫిబ్రవరి లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సమయంలో ఆయన ట్రంప్ వాణిజ్యం, సుంకాలు, రక్షణ సంబంధాలపై దృష్టి సారించారు. ట్రంప్ గతంలో సుంకాలు విధిస్తామని బెదిరించినప్పటికీ ఇద్దరు నాయకులు చర్చలకు సై అనడంతో రెండు వైపులా ఉన్న ప్రజలకు రాయితీలు లభిస్తాయనే ఆశలు రేకెత్తాయి.
ఏప్రిల్ 5న ట్రంప్ తన సుంకాల యుద్దానికి హఠాత్తుగా విరామం ఇచ్చారు. అన్ని దేశాల నుంచి దిగుమతులపై పదిశాతం సుంకాలు విధించారు. ఇది అమెరికా విస్తరిస్తున్న వాణిజ్య లోటును పరిష్కరించడానికి, అన్యాయంగా అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్న వారికి శిక్ష విధించే చర్యగా అభివర్ణించారు. ప్రపంచంలోని 90 దేశాలను లక్ష్యంగా దూకుడుగా సుంకాలు విధించారు. ఇందులో భారతీయ వస్తువులు అమెరికాలో 26 శాతం సుంకానికి గురయ్యాయి.
ఇది 2019 లో ఇరు దేశాల మధ్య రద్దు చేయబడిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ కింద మునపటి వాణిజ్య నిబంధనల నుంచి గణనీయమైన పెరుగుదల.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై పరస్పర సుంకాలను ప్రకటించినప్పుడూ, అమెరికా అధ్యక్షుడు భారత్ పై 26 శాతం విధించారు. తమ వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తున్నారని ఆరోపించారు. అయితే ట్రంప్ తరువాత పరస్పర సుంకాలపై 90 రోజుల విరామం ప్రకటించారు.
అమెరికా, భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, రెండు దేశాల మధ్య మొత్తం వస్తువుల వ్యాపారం 2024 లో 129.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2024 లో అమెరికా భారత్ నుంచి 87.4 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంది. 2023 తో పోలిస్తే 4.5 శాతం పెరిగింది.
90 రోజుల తరువాత ట్రంప్ 26 శాతం సుంకాన్ని పునరుద్దరిస్తే భారత దిగుమతి చేసుకున్న వస్తువులు అమెరికాలో బాగా ఖరీదైనవిగా మారతాయి. దీనివలన వినియోగదారులు వేరే వాటికి మారే అవకాశం ఉంది. ఇది భారతీయ వ్యాపారాలు, ఉద్యోగాలకు గణనీయంగా హాని కలిగించవచ్చు.
భారత్ ను పాకిస్తాన్ తో ముడిపెట్టడం..
రాజకీయాల్లో వారం రోజులు చాలాకాలం అని వాదన ఉంది. గతవారం రోజులుగా ట్రంప్ చేసిన ప్రకటనలు ముఖ్యంగా భారత్ లోని కాషాయదళం దిగ్భాంతికి గురి చేశాయి. భారత్- పాక్ కాల్పుల విరమణ ప్రకటన, కాశ్మీర్ సమస్య, ద్వైపాక్షిక వాణిజ్యం కావచ్చు. శాంతిదూతగా నటించే ప్రయత్నంలో ట్రంప్, భారత్ ను పాకిస్తాన్ తో సమానం అని ముగించారు.
మే 10 న సాయంత్రం 5.35 గంటలకు ట్రూత్ సోషల్ భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ గురించి ట్రంప్ ప్రకటించిన తరువాత ఇది ప్రారంభం అయింది. ‘‘ అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సుదీర్ఘ రాత్రి చర్చల తరువాత, భారత్, పాకిస్తాన్ లు తక్షణ విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
ఈ ప్రకటన తరువాత కొద్దినిమిషాలకే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక వివరణాత్మక ప్రకటన చేస్తూ, రెండు దేశాల అగ్ర నాయకత్వం డీజీఎం లు ఎన్ఎస్ఏలతో వరుస సంప్రదింపులకు తనదే కారణమని పేర్కొన్నాడు.
అయితే భారత్ ఈ విషయాన్ని ఖండించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ టెలివిజన్ లో ఒక కఠినమైన ప్రకటనలో పాకిస్తాన్ వైపు నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన ప్రత్యక్ష హాట్ లైన్ నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు.
కాల్పుల విరమణ అనేది ద్వైపాక్షిక నిర్ణయం అని ఆయన అన్నారు. ట్రంప్ లేదా రూబియో గురించి ఆయన ప్రస్తావించలేదు. భూమిపై, నీటిపై, ఆకాశంలో రెండు వైపులా నిలిపివేయాలని మా మధ్య ఒప్పందం కుదిరిందని మిస్రీ అన్నారు. పాకిస్తాన్ తో వ్యవహరించడంలో మూడవ పక్షం జోక్యం ఉండకూడదనే భారత్ వైఖరిని నొక్కి చెప్పారు.
రెండు దేశాలు తటస్థ వేదికలపై ఇరు దేశాలు కలవడానికి అంగీకరించాయనే రూబియో చేసిన వాదనను కూడా భారత్ తిరస్కరించింది. అయితే ట్రంప్ తరువాత రోజు చేసిన మరో ట్వీట్ లో వేయి సంవత్సరాల తరువాత కాశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందో లేదో చూడటానికి భారత్, పాకిస్తాన్ లతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు పోస్ట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది.
ప్రధాని మోదీ, భారత దౌత్యానికి ఒక ఎదురుదెబ్బ తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇది కాశ్మీర్ సమస్యలో మూడో పక్షం జోక్యాన్ని స్పష్టంగా తోసిపుచ్చే భారత వైఖరికి విరుద్దంగా ఉంది.
వాణిజ్య ప్రొత్సహాకాలను తగ్గించాలా?
రెండు రోజుల తరువాత మే 12, రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్న కొద్ది నిమిషాలకు ముందు, ఉద్రిక్తతలను తగ్గించడానికి న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ రెండింటికి వాణిజ్య ప్రొత్సహాకాలను అందించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
‘‘రండి మేము మీతో వ్యాపారం చేయబోతున్నాం’’ అని ట్రంప్ అన్నారు. ‘‘మీరు ఆపితే మేము వ్యాపారం చేస్తున్నట్లే. మీరు ఆపకపోతే మేము ఎటువంటి వ్యాపారం చేయబోము.
మేము పాకిస్తాన్ తో చాలా వ్యాపారం చేయబోతున్నాం. మేము భారత్ చాలా వ్యాపారం చేయబోతున్నాం. మేము ప్రస్తుతం భారత్ తో చర్చలు జరుపుతున్నాము. త్వరలో పాకిస్తాన్ తో చర్చలు జరపబోతున్నాం’’ అని ఆయన ప్రకటించారు.
ఒకరోజు తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య శాంతిని నెలకొల్పనడంలో అమెరికా కీలకపాత్ర పోషించినట్లు చెప్పుకొచ్చారు. ‘‘అణు క్షిపణులను వ్యాపారం చేయవద్దు. మీరు చాలా అందంగా తయారు చేసే వస్తువులను వ్యాపారం చేయండి’’ అని రెండు వైపులా చెప్పానని అన్నారు.
టారిఫ్ లు లేవు..
ఇవే కాదన్నట్లుగా ట్రంప్ గురువారం మరో ఆశ్చర్యకరమైన వాదన చేస్తూ భారత్ సుంకాలు లేని వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించిందని అన్నారు.
దోహాలో సుంకాలు, వాణిజ్యం గురించి మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్.. ‘‘భారత్ లో అమ్మడం చాలా కష్టం. వారు మాకు ఎటువంటి సుంకాలు వసూలు చేయడానికి సిద్దంగా ఉన్న ఒప్పందాన్ని అందిస్తున్నారు’’ అని అన్నారు. భారత్ లో పెట్టుబడి పెట్టడానికి తయారీకి ఆపిల్ ప్రణాళికలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధాన వాణిజ్య భాగస్వాములకు సుంకాల పెంపుపై ఏప్రిల్ 9న ట్రంప్ ప్రకటించిన 90 రోజుల విరామంలోపు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని న్యూఢిల్లీ ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ప్రకటన వచ్చింది.
2026 చివరి నాటికి అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగాన్ని భారత్ లోని తయారు చేయాలని అమెరికా కంపెనీ యోచిస్తున్నందున ఉత్పత్తిని భారత్ కు మార్చడం గురించి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తో తాను మాట్లాడానని, చైనాలో అధిక సుంకాలను విధించడానికి ఆ ప్రణాళికలను వేగవంతం చేస్తున్నానని ట్రంప్ అన్నారు.
‘‘టిమ్, మేము నిన్ను చాలా బాగా చూసుకున్నాము. నువ్వు చైనాలో నిర్మించిన అన్ని ప్లాంట్లను సంవత్సరాలుగా మేము సహించాము. నువ్వు భారత్ నిర్మించడంలో మాకు ఆసక్తి లేదు.
భారత్ తమను తాము చూసుకోలేదు. అవి చాలా బాగా పనిచేస్తున్నాయి. నువ్వు ఇక్కడ నిర్మించాలని మేము కోరుకుంటున్నాము’’ అని ట్రంప్ తాను కుక్ తో చెప్పుకున్నట్లు గుర్తు చేసుకున్నారు.
ట్రంప్ తీరుపై భారత్ ఎలా స్పందిస్తుంది?
పాకిస్తాన్ చట్టవిరుద్దంగా ఆక్రమించిన భూభాగాన్ని విడిచిపెట్టడం మాత్రమే రెండు రెండు దేశాల మధ్య ఉన్న ఏకైక సమస్య అని చెబుతూ భారత్ మధ్యవర్తిత్వాన్ని తోసిపుచ్చింది.
అమెరికా తో వాణిజ్య ఎప్పుడూ చర్చల కోసం రాలేదని, పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలపై భారత్ దాడి చేయడంతో ఇస్లామాబాద్ తిరిగి వచ్చిందని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా భారత్ తోసిపుచ్చింది.
‘‘ఏదైనా వాణిజ్య ఒప్పందం పరస్పర ప్రయోజనకరంగా ఉండాలి. అది రెండు దేశాలకు పనిచేయాలి. ఏదైనా వాణిజ్య ఒప్పందం నుంచి మేము ఆశించేది అదే. అది జరిగే వరకూ ఏదైనా అసంపూర్ణంగా ఉంటుంది’’ అని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. అటువంటి చర్చలు సంక్లిష్టమైనవి, సమయం పడుతుందని మంత్రి అన్నారు. అన్ని జరిగే వరకూ ఏమి నిర్ణయించబడదన్నారు.