జీఎస్టీ కౌన్సిల్ పన్ను విధానాన్ని పూర్తిగా సవరించినట్లు ప్రకటన చేయడం దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమకు పెద్ద ఊపు తెచ్చింది. ప్రస్తుతం నాలుగు స్లాబ్ లలో ఉన్న పన్నులు నవరాత్రి మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22 నుంచి రెండు స్లాబ్ లలోకి మారనున్నాయి.
ఇప్పుడు పన్ను స్లాబ్ లను 5 నుంచి 18 శాతానికి పరిమితం చేయడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నిపుణుల ప్రకారం.. క్యాపిటల్ గూడ్స్ రంగంలో ముఖ్య భాగమైన ఆటో రంగానికి వ్యూహాత్మక ప్రొత్సాహాన్ని ఇస్తుంది.
ముఖ్యంగా పండగ సీజన్ నుంచి దీపావళి లో దీని ప్రభావం కనిపించబోతోంది. వినియోగ పన్నును తగ్గించే నిర్ణయం రాష్ట్రాల మంత్రులతో కూడిన కౌన్సిల్ ఏకగ్రీవంగా తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఈ సంస్కరణల రేట్లను హేతుబద్దీకరించడం గురించి మాత్రమే కాకుండా నిర్మాణాత్మక సంస్కరణల గురించి కూడా అని ఆమె వివరించారు.
ఏ వాహానాలు ప్రయోజనం..
పన్ను సంస్కరణల ప్రకారం.. 1200 సీసీ కంటే తక్కువ సామర్థ్యం, 4000 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పొడవు లేని పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలు అలాగే 1500 సీసీ వరకూ 4 000 మిల్లీమీటర్ల పొడవు గల డీజిల్ వాహనాలు ప్రస్తుత 28 శాతానికి బదులుగా 18 శాతం పన్నురేట్ల పరిధిలోకి చేరాయి. సంస్కరణల ప్రకారం.. 350 సీసీ వరకూ ఇంజిన్లతో నడిచే బైక్ ల వరకూ కూడా 18 శాతం పరిధిలోనే ఉంటుంది.
ఖరీదైన వాహనాలు, బైక్ లపై 40 శాతం..
1200 సీసీ కంటే ఎక్కువ ఇంజన్లు కలిగి ఉండి, 4 వేల మిమి కంటే ఎక్కువ కొలతలు ఉన్నఅన్ని వాహనాలు రేసింగ్ కార్లు, 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్ లపై 40 శాతం పన్నులు ఉండబోతున్నాయి. లగ్జరీ ఆటోమేకర్లు ఈ మార్పును ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది.
ఈవీలపై భారీ లాభం..
ఎలక్ట్రిక్ వాహానాలపై ఐదుశాతం సుంకాలు విధించబోతున్నారు. రాయితీ జీఎస్టీతో ఈవీ రంగం భారీ లాభాలను ఆర్జించనుంది. కొత్తతరం వాహనాలు ధరలు తగ్గడమే ఇందుకు కారణం. ఇది దేశం గ్రీన్ మొబిలిటీ మిషన్ కు మద్దతు ఇస్తుందని కూడా భావిస్తున్నారు.
ప్రజల స్పందన కోసం ఈవీ పరిశ్రమ వేచి చూస్తోంది. ఆటో విడిభాగాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. ఇది కూడా వినియోగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఇది తయారీదారులు, సరఫరాదారులకు ఖర్చు తగ్గిస్తుంది.
ఆటో స్టాక్స్..
సెన్సెక్స్ లో ఆటోస్టాక్ లు 2.2 శాతం పెరిగి 11 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. వాస్తవానికి అత్యంత ముఖ్యమైన కౌన్సిల్ సమావేశం జరగడానికి ముందే స్టాక్ లు ఆరుశాతం వరకూ ర్యాలీ చేయడం ప్రారంభించాయి.
నిఫ్టీ 50 బెంచ్ మార్క్ లో ఆటో మొబైల్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ఇది 0.7 శాతం అధికంగా ట్రేడవుతోంది. బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 1.70 శాతం పెరిగి 58,712.10 కి చేరుకుంది.
ఆటోమోటివ్ ఇండెక్స్ లోని మెజారిటీ స్టాక్ లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్ లాభాలలో ముందంజలో ఉన్నాయి. ఈ స్టాక్ లు వరుసగా ఎనిమిది, ఐదు శాతం పెరిగాయి.
మారుతి సుజుకీ షేర్లు 0.6 శాతం, హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు ఒక శాతం, హీరో మోటోకార్ప్ 1.3 శాతానికి, టీవీఎస్ మోటార్ 1.7 శాతం పెరిగాయి. బీఎస్ఈలో టీవీఎస్ మోటార్ కంపెనీ షేర్లు 4.2 శాతం, హీరో మోటోకార్ప్ షేర్లు 3.56 శాతం పెరిగాయి. ఎంఆర్ఎఫ్ స్టాక్ 3.39 శాతం, బజాజ్ ఆటో 2.5 శాతం, అపోలో టైర్స్ 2.49 శాతం టాటా మోటార్స్ 2 శాతం పెరిగాయి.
ఈక్విటీ మార్కెట్ లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్ లో 888.96 పాయింట్లు పెరిగి 81,456.67 వద్ద ముగిసింది.
పరిశ్రమ ఎలా స్పందించింది..
దేశీయ ఆటో మోటివ్ పరిశ్రమ ఇప్పటికే మందగమనంలో ఉంది. జీఎస్టీ సంస్కరణలు వీటికి ఊపు తెచ్చే అవకాశం కనిపిస్తోంది. మెర్సిడెజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతోష్ అయ్యార్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించాలనే ఆటోమోటివ్ పరిశ్రమ దీర్ఘకాల డిమాండ్ ను ప్రభుత్వం ఇప్పటికి విన్నట్లు చెప్పారు. ఈ సవరణ సరైనదని, దేశీయ వినియోగాన్ని పెంచుతుందని, భారత ఆర్థిక వ్యవస్థకు పల్స్ కు ఉన్న ఆటోమోటివ్ పరిశ్రమకు ఊతం ఇస్తుందని ఆయన అభివర్ణించారు.
‘‘చమురు దిగుమతులను తగ్గిస్తూ డీకార్భనైజ్డ్ భవిష్యత్ కు వేగంగా మారేలా బీఈవీల జీఎస్టీ రేట్ ను మార్చకుండా ఉంచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని అయ్యర్ అన్నారు.
జీఎస్టీ సంస్కరణల కారణంగా 2025 ద్వితీయార్థంలో భారత ఆటోమొబైల్ రంగం బలహీన పునరుజ్జీవనం పొందడం చూడవచ్చని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ హిసాషీ టకేయుజీ అన్నారు.
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ చర్యను ప్రశంసించారు. ఆయన గురువారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘వినియోగం, పెట్టుబడులను పెంచడానికి మరింత వేగవంతమైన సంస్కరణలు కచ్చితంగా ఓ మార్గం’’ అని అన్నారు.
‘‘అది ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తుంది. ప్రపంచంలో భారత స్వరం పెంచుతోంది’’ అని ఆయన అన్నారు. స్వామి వివేకానంద మాటలను గుర్తు చేసుకున్న మహీంద్రా.. ‘‘లేవండి, మేల్కొండి, లక్ష్యాన్ని చేరుకునే వరకూ ఆగకండి’’ అని అన్నారు. మరిన్ని సంస్కరణల కోసం కూడా ఆయన కోరారు.
మహీంద్రా గ్రూప్, గ్రూప్ సీఈఓ అండ్ ఎండీ డాక్టర్ అనిష్ షా ఒక ప్రకటనలో మాట్లాడారు. ‘‘తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు’’ సరళమైన, న్యాయమైన, మరింత సమ్మిళితమైన పన్ను వ్యవస్థ వైపు దేశం చేస్తున్న అన్వేషణలో ఒక నిర్ణయాత్మకమైన క్షణాన్ని సూచిస్తాయని అన్నారు.
‘‘మహీంద్రాలో మేము ఈ సంస్కరణలను పరివర్తనాత్మకమైనవిగా చూస్తాము. పరిశ్రమలు ఎక్కువ విశ్వాసంతో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తాయి. పౌర కేంద్రీకృత, భవిష్యత్ కు సిద్దంగా ఉన్న భారత్ ను నిర్మించాలనే గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ సాహసోతమైన అడుగు’’ అని ఆయన అన్నారు.
ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీలో లైట్ వెహికల్ ప్రొడక్షన్ ఫోర్కాస్ట్ అసోసియేట్ డైరెక్టరేట్ గౌరవ్ వంగల్ మాట్లాడుతూ.. చిన్నకార్లపై జీఎస్టీ రేట్ల తగ్గింపు ఆటో రంగానికి ‘‘వ్యూహాత్మక ప్రొత్సాహం’’ అన్నారు.
ఉత్సవాలకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ తయారీదారుల అధ్యక్షుడు శైలేష్ చంద్ర స్వాగతించారు. భారత్ లోని వినియోగదారులను ప్రొత్సహించడానికి ఆటో మోటివ్ రంగాన్ని పునరుద్దరించడానికి ఇది సకాలంలో తీసుకున్న నిర్ణయమని అన్నారు.
మొదటిసారి కొనుగోలు చేసేవారు మధ్య ఆదాయ కుటుంబాలు ప్రయోజనం పొందుతారని ఆయన అన్నారు. ఈవీలపై ఐదు శాతం రేటును కొనసాగించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని ఆటో భాగాలను ఏకరీతి రేటు కిందకు తీసుకురావాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీదారుల సంఘం డైరెక్టర్ జనరల్ విన్నీ మొహతా మాట్లాడుతూ.. అన్ని ఆటో భాగాలపై 18 శాతం రేట్లు కిందకు తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మా సంఘం స్వాగతిస్తోంది. ఇది పరిశ్రమ దీర్ఘకాలిక డిమాండ్’’ అన్నారు.
సియామ్ నివేదిక ప్రకారం.. జూన్ మధ్యలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత దేశ ప్రయాణీకుల వాహానాల అమ్మకాలు 1.4 శాతం తగ్గి.. 10,11,882 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి 10,26000 వేలుగా ఉన్నాయి.
ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో మొత్తం ద్విచక్ర వాహానాల అమ్మకాలు కూడా 6.2 శాతం తగ్గి, 46,74,562 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇవి 49,85,631 యూనిట్లుగా ఉన్నాయి.
వాణిజ్య వాహన విభాగంలో అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 2,24,575 యూనిట్లుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 0.6 శాతం తగ్గి 2,23,215 యూనిట్లకు చేరుకున్నాయి.