కల్నల్ సోఫియా ఖురేషిపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖలు
కల్నల్ సోఫియా ఖురేషిని టెర్రరిస్టుల సోదరిగా అభివర్ణించిన బీజేపీ మంత్రి;
By : The Federal
Update: 2025-05-13 14:10 GMT
కల్నల్ సోఫియా ఖురేషి (Sophia Qureshi)పై బీజేపీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ బీజేపీకి చెందిన మంత్రి విజయ్ షా ను తక్షణమే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
'ఆపరేషన్ సిందూర్' (Operation sindoor) వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు వివరించడంతో సోఫియా ఖురేషి అందరి దృష్టిలో పడ్డారు. 1999లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్‌లో చేరి క్రమంగా 2016లో మల్టీనేషనల్ మిలటరీ విన్యాసాలకు సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కల్నల్ ఖురేషిని 'టెర్రరిస్టుల సోదరి'గా పేర్కొంటూ ఆమెను కించపరచేలా విజయ్ షా మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. మహులోని (ఇండోర్ జిల్లా) రాయ్‌కుంద గ్రామంలో జరిగిన హల్మా ఈవెంట్‌లో విజయ్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను బీహార్ కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది.
''వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణులు, ఆడకూతుళ్ల సిందూరం తుడిచేసి పారిపోయారు. వారి సొంత సోదరినే వాళ్లకు గట్టి సమాధానం చెప్పమని మనం పంపాం'' అని విజయ్ షా మాట్లాడినట్టు ఆ వీడియోలో ఉంది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. కల్నల్ సోఫియా ఖురేషిని టెర్రరిస్టుల సోదరిగా ఆయన సంబోధించడం ఏమిటని నిలదీసింది. సోఫియా ఖురేషిని చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని, అయినా కొందరు ఆమె గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొంది. ఇది మన వీరజవాన్లను అమానించడమేనని ఆక్షేపించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితుడుగా చెప్పుకునే విజయ్ షాను తక్షణం రాజీనామా చేయాల్సిందిగా బీజేపీ కోరాలని డిమాండ్ చేసింది.
విజయ్ షా వ్యాఖ్యలను వామపక్ష పార్టీలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఆయన్ను బీజేపీ నుంచి బహిష్కరించడంతో పాటు మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి.