ఢిల్లీ క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్: మెరుగుపడిన గాలి నాణ్యత..
53 ఏళ్ల తర్వాత కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన క్లౌడ్ సీడింగ్‌తో వర్షం కురవకపోయినా..గాలినాణ్యత కాస్త మెరుగుపడింది.
ఢిల్లీ(Delhi) లోని బీజేపీ(BJP) ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టింది. దేశ రాజధానిలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో 53 ఏళ్ల తర్వాత.. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఢిల్లీ అక్టోబర్ 28న క్లౌడ్ సీడింగ్(Cloud seeding) ట్రయల్స్ నిర్వహించింది. వర్షం కురవకపోయినా.. బుధవారం (అక్టోబర్ 29) ఉదయం ఢిల్లీలో కాలుష్య స్థాయిలు తగ్గాయి.
కృత్రిమ వర్షాన్ని (Artificial rain) కురిపించే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం ఐఐటి-కాన్పూర్‌తో కలిసి క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహించింది. ప్రయోగంలో భాగంగా విమానం నుంచి సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ సమ్మేళనాలను విడుదల చేశారు. ఈ ప్రయోగ వివరాల గురించి పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా వివరించారు.
‘‘ఢిల్లీ ప్రభుత్వం బురారి, కరోల్ బాగ్, మయూర్ విహార్ బద్లి సహా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈ ట్రయల్స్ నిర్వహించింది. రాబోయే రోజుల్లో మరికొన్ని ట్రయిల్స్ జరుగుతాయి. ట్రయల్స్ విజయవంతమైతే ఫిబ్రవరికి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేస్తాం. కాలుష్యాన్ని తగ్గించడానికి దేశంలో ఇదే మొదటి శాస్త్రీయ అడుగు అవుతుందని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు.
తగ్గిన కాలుష్యం.
అక్టోబర్ 28 సాయంత్రం ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించిన ప్రదేశాలలో పార్టిక్యులేట్ మ్యాటర్ (PM) తగ్గిందని అందులో పేర్కొన్నారు. "క్లౌడ్ సీడింగ్‌కు ముందు మయూర్ విహార్, కరోల్ బాగ్ బురారిలో PM 2.5 స్థాయి వరుసగా 221, 230, 229 గా నమోదయ్యింది. మొదటి సీడింగ్ తర్వాత వరుసగా 207, 206, 203గా రికార్డయ్యింది. రెండో సారి క్లౌడ్ సీడింగ్ తర్వాత మయూర్ విహార్, కరోల్ బాగ్ బురారిలో 207, 206, 209 నుంచి వరుసగా 177, 163, 177కు తగ్గింది" అని నివేదికలో పొందుపర్చారు.
నిపుణుల ఆందోళన..
నగరంలో పెరుగుతున్న కాలుష్యానికి దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడంపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ట్రయల్స్ పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. పర్యావరణవేత్తలు ఈ క్లౌడ్-సీడింగ్ ట్రయల్‌ను స్వల్పకాలిక చర్యగా అభివర్ణించారు. ఇది తాత్కాలికంగా కాలుష్యాన్ని తగ్గించవచ్చు కానీ రాజధానిలో క్షీణిస్తున్న గాలి నాణ్యతకు మూల కారణాలను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు.
మెరుగుపడిన గాలి నాణ్యత..
క్లౌడ్ సీడింగ్ తర్వాత బుధవారం ఉదయం ఢిల్లీ గాలి నాణ్యత కొద్దిగా మెరుగుపడింది. అక్టోబర్ 28న సాయంత్రం 4 గంటలకు నగరంలో AQI 294గా నమోదయ్యింది. CPCB ప్రకారం.. సున్నా నుంచి 50 మధ్య AQI "మంచిది". 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరం. 101 నుంచి 200 మధ్య ఉంటే మధ్యస్థం, 201 నుంచి 300 మధ్య ఉంటే పేలవం. 301 నుంచి 400 మధ్య ఉంటే చాలా పేలవం, 401 నుంచి 500 మధ్య ఉంటే "తీవ్రంగా" పరిగణిస్తారు.