ఎంతకాలానికి పార్టీ ఆఫీసుకు కేసీఆర్ సార్ వస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వంవల్ల తెలంగాణకు జరుగుతోంది అంటు కేసీఆర్ గొంతెత్తబోతున్నారు.
ఎంతోకాలానికి కేసీఆర్ సార్ పార్టీ ఆఫీసుకు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ఈనెల 19వ తేదీన పార్టీ ఆఫీసులో (Telangana Bhavan) కేసీఆర్ అధ్యక్షతన కీలకమైన సమావేశం జరగబోతోంది. బీఆర్ఎస్(BRS) శాసనసభాపక్ష సమావేశంతో పాటు రాష్ట్రస్ధాయి కార్యవర్గ విస్తృతస్ధాయి సమావేశం జరగబోతోంది. పై రెండు సమావేశాల్లో(KCR) కేసీఆర్ పాల్గొంటారని పార్టీవర్గాల టాక్. రాబోయే శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే సమావేశం సుదీర్ఘంగానే సాగుతుందని పార్టీవర్గాలు చెప్పాయి.
అనేక అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశా, నిర్దేశం చేయబోతున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరిపైన కేసీఆర్ మాట్లాడబోతున్నారు. అలాగే పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసే అంశంపై సలహాలు, సూచనలు చేస్తారని సీనియర్ నేతలు చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టబోయే ప్రజాఉద్యమాలు, సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరిని కేసీఆర్ ప్రకటించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంవల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై కేసీఆర్ గొంతెత్తబోతున్నారు.
19వ తేదీన పార్టీఆఫీసులో జరగబోయే కీలకమైన సమావేశానికి కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారమే కాని అధికారికంగా ప్రకటించలేదు. సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని అంటున్నా ఎక్కడో తేడాకొడుతోంది. కారణం ఏమిటంటే గతంలో కేసీఆరే స్వయంగా పలనాప్పుడు జనాల్లోకి వస్తాను, ప్రభుత్వాన్ని చీరేస్తాను, చీల్చి చెండాడేస్తాను అంటు ప్రకటించిన విషయం తెలిసిందే. సార్ వస్తాడొస్తాడని జనాలు ఎదురుచూడటమే కాని సార్ మాత్రం ఫామ్ హౌస్ దాటి అడుగు బయటపెట్టిందిలేదు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాని ఇపుడు జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో గాని బీఆర్ఎస్ కు ఓట్లు వేసి గెలిపించమని, పార్టీ మద్దతుదారులకు పంచాయితీల్లో ఓట్లేయమని ఒక్కసారి కూడా కేసీఆర్ ఓటర్లకు విజ్ఞప్తిచేసిందిలేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు జరిగాయని..ఇవే ఆధారాలు అంటు రేవంత్ అండ్ కో బయటపెడుతున్నా కేసీఆర్ తరపున ఒక్క ఖండన కూడా లేదు. ఎవరెన్ని ఆరోపణలైనా చేసుకోండి, ఎంతైనా తిట్టండి నో ప్రాబ్లెం అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. అందుకనే 19వ తేదీ సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారంటే ఎక్కడో అనుమానం ఉందంతే.