నడిరోడ్డులో రౌడీషీటర్ హత్య
ఒంటిపై బలమైన కత్తిపోట్లు దిగటంతో అమీర్ అక్కడిక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు
నడిరోడ్డులో జనాలందరు చూస్తుండగానే ఒక రౌడీషీటర్ హత్య జరిగింది. విషయం ఏమిటంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ పహడీ షరీఫ్ ప్రాంతంలో షాహీన్ నగర్ ఉంది. ఈ షాహీన్ నగర్లో రౌడీషీటర్ అమీర్ ను రోడ్డుమీద గుర్తుతెలీని వ్యక్తి ఆదివారం కత్తితో పొడిచి చంపేశాడు. ఒంటిపై బలమైన కత్తిపోట్లు పడటంతో అమీర్ అక్కడిక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. అమీర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పొడిచిన వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. నడిరోడ్డుపై ఒక దుండగుడు అమీర్ ను కత్తితోపొడవటంతో భయభ్రాంతులకు గురైన జనాలు అక్కడినుండి పరిగెత్తి పోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్ధలానికి చేరుకుని అమీర్ మృతదేహాన్ని స్వాధీనం చేసకున్నారు. మృతదేహం దగ్గర ఏమన్నా సాక్ష్యాలు దొరుకుతాయేమో అని చూసిన తర్వాత పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జరిగిన హత్యను చాలామంది ప్రజలు చూసినప్పటికీ చంపిన వ్యక్తి ఆనవాళ్ళుమాత్రం చెప్పలేకపోతున్నారు. మృతదేహం దగ్గర దొరికిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ముబారక్ షికారి అనే వ్యక్తి హత్యకేసులో అమీర్ ప్రమేయం ఉందని పోలీసులు చాలాకాలంగా అనుమానిస్తున్నారు. అప్పటికే పోలీసులు అమీర్ పై రౌడీషీట్ తెరిచారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పాతకక్షల వల్లే ఇపుడు రౌడీషీటర్ హత్యకు గురయ్యుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.