మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి గ్రామ సమీపంలో శనివారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందిన లింగమయ్య, ఆయన భార్య సాయమ్మ, కుమారుడు సాయిలు, మనవరాలు మానస ఎన్నికల ఓటింగ్ కోసం ద్విచక్ర వాహనంలో బయల్దేరారు. కోలపల్లి గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఢీకొట్టిన వేగానికి నలుగురు రోడ్డుపైనే పడిపోగా, తీవ్ర గాయాల వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పెద్ద శంకరంపేట ఎస్‌ఐ ప్రవీణ్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో బయల్దేరిన కుటుంబం ఇలా ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. మాగీ గ్రామంలో శోకసంద్రం అలుముకోగా, మృతుల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ దుర్ఘటనతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.