రేవంత్‌ను కలిసిన అఖిలేష్, కలవని కేసీఆర్ !

త్వరలో మళ్ళీ కలుద్దామని చెప్పిన కేసీఆర్. ఫోన్‌లో కూడా మాట్లాడకుండానే.

Update: 2025-12-12 15:47 GMT
హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని, కేటీఆర్‌ను కలిసిన అఖిలేష్ యాదవ్

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్బంగానే ఆయన తెలంగాణ సీఎం రేవంత్‌ను కలిశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా కలవాలని భావించారు. కానీ అఖిలేష్‌ను కలవడానికి కేసీఆర్ ఇష్టపడలేదు. త్వరలో మళ్ళీ కలుద్దామంటూ కేటీఆర్ ద్వారా కబురు పంపారు. ఈ అంశం ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. రేవంత్‌ను కలిసిన తర్వాత తనను కలవడానికి వచ్చారన్న కారణంగానే కేసీఆర్.. అఖిలేష్‌ను కలవడానికి ఇష్టపడలేదా? మరేమైనా కారణాలు ఉన్నాయా? అన్న చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా అఖిలేష్‌తో కేసీఆర్ కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడకుండా.. కేటీఆర్ ద్వారా ‘మళ్ళీ కలుద్దాం’ అన్న మెసేజ్ పంపి ఊరుకోవడం కీలకంగా మారింది.

రేవంత్‌తో భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్.. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై రేవంత్‌తో చర్చించారు.

సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం రేవంత్ వివరించారు. ఈ సందర్భంగా, యాదవులు ఘనంగా జరుపుకునే సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ అభినందించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా యాదవ సమాజం రేవంత్‌ను గుర్తుంచుకుంటుందని అన్నారు. అంతేకాకుండా యాదవులకు ఇచ్చిన ప్రాధాన్యతకు అఖిలేష్ ధన్యవాదాలు తెలిపారు.

మళ్ళీ కలుద్దామన్న కేసీఆర్: కేటీఆర్

అఖిలేష్ యాదవ్‌కు బీఆర్ఎస్ నేతలు ఆతిథ్యం ఇచ్చారు. ఈ క్రమంలోనే అఖిలేష్‌కు శాలువా కప్పి కేటీఆర్ స్వాగతించారు. ఈ సందర్భంగానే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ త్వరలోనే సమావేశం అవుతారని కేటీఆర్ వెల్లడంచారు.

‘‘ఈసారి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్‌కి మేమే స్వాగతం పలుకుతామంటే ఆయనే స్వయంగా వచ్చి కలుస్తాను, మీతో చర్చిస్తాను అన్నారు. ఈరోజు మా పార్టీ నేతలు అఖిలేష్ యాదవ్‌కి సాదరంగా స్వాగతం తెలిపారు. మాతో సమయం గడిపినందుకు అఖిలేష్ యాదవ్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని చెప్పారు.

‘‘ఒకప్పుడు శాసనసభలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్లో తక్కువ సీట్లు సాధించినా, ప్రజల వెంట నిలబడినందుకు అఖిలేష్ యాదవ్ పార్టీ ఇప్పుడు 37 మంది ఎంపీలను గెలిపించుకొని దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అఖిలేష్ యాదవ్ పార్టీ స్ఫూర్తితో మా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో ముందుకు సాగుతుంది. ప్రజల వెంట నిలబడి మరోసారి తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు పొందుతాము’’ అని అన్నారు.

కేసీఆర్ ఎందుకు కలవలేదు..

ఈ నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ ఎందుకు కలవలేదు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రేవంత్‌ను కలిసి తన దగ్గరకు వచ్చినందుకా? లేక ఆరోగ్యం సహకరించలేదా? మరేదైనా కార్యక్రమంలో బిజీగా ఉన్నారా? ఇలా అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడు వచ్చిన అఖిలేష్ యాదవ్‌ను కలవకపోవడం ఒక ఎత్తు అయితే.. ఫోన్‌లో కూడా మాట్లాడకుండా కేటీఆర్ ద్వారా మెసేజ్ పంపడం మరిన్ని సందేహాలకు తావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News