కేసీఆర్ కు ‘ట్యాపింగ్’ సమస్యలు తప్పవా ? బీఆర్ఎస్ కు గడ్డుకాలమేనా ?

సిట్ కస్టడీలో తమదైన స్టైల్లో విచారణ జరిగితే ప్రభాకరరావు టెలిఫోన్ ట్యాపింగ్ లో అసలు సూత్రదారుడు ఎవరో చెప్పేసే అవకాశముంది

Update: 2025-12-12 08:17 GMT
Allegation around KCR on Telephone Tapping

టెలిఫోన్ ట్యాపింగులో కీలకపాత్రదారుడు ఇంటెలిజెన్స్ మాజీ బాస్ టీ ప్రభాకరరావు శుక్రవారం నుండి సిట్ అధికారుల విచారణను ఎదుర్కుంటున్నాడు. ఇన్నినెలలుగా సిట్ కస్టడీకి ఇవ్వకూడదన్న ప్రభాకరరావు విజ్ఞప్తిని గురువారం విచారణలో సుప్రింకోర్టు తోసిపుచ్చింది. వారంరోజులు కస్టడీలోకి తీసుకుని ప్రభాకరరావును విచారించేందుకు సిట్ అధికారులకు సుప్రింకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. ఎందుకంటే సిట్ విచారణకు ప్రభాకరరావు ఏమాత్రం సహకరించటంలేదని గడచిన ఆరు నెలలుగా సిట్ తరపు లాయర్ సుప్రింకోర్టు విచారణలో చెబుతున్నాడు. ప్రభాకరరావును కస్టడీకి ఇస్తేనే అన్నీవిషయాలు వెలుగుచూస్తాయని వాదించారు. ఆరునెలలు సిట్ లాయర్ వాదనతో ఏకీభవించని ద్విసభ్య ధర్మాసనం చిట్టచివరకు గురువారం విచారణలో ప్రభాకరరావును సిట్ కస్టడీకి ఇస్తున్నట్లు ప్రకటించింది.

సిట్ కస్టడీలో తమదైన స్టైల్లో విచారణ జరిపితే ప్రభాకరరావు టెలిఫోన్ ట్యాపింగ్ కు అసలు సూత్రదారుడు ఎవరో చెప్పేసే అవకాశముంది. ఇదేసమయంలో తననుతాను కాపాడుకునేందుకు ప్రభాకరరావు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్రూవర్ గా మారుతారనే ప్రచారం కూడా పెరుగుతోంది. ట్యాపింగ్ అరాచకంలో కీలకపాత్రదారుడు ప్రభాకరరావు, కీలక సూత్రదారుడు కేసీఆరే అని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చాలామంది ఇప్పటికే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సిట్ విచారణలో సూత్రదారుడు ఎవరన్న విషయాన్ని ప్రభాకరరావు చెప్పేస్తే అప్పుడు కేసీఆర్ కు కష్టాలు మొదలవుతాయనటంలో సందేహంలేదు. సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, బీఆర్ఎస్ ప్రత్యర్ధులు, జర్నలిస్టులే కాకుండా చివరకు జడ్జీలతో పాటు వాళ్ళ కుటుంబసభ్యుల వేలాది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసింది. కన్నకూతురు కవిత భర్త అనీల్ ఫోన్ను కూడా కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేయించటంకన్నా అరాచకం ఏముంటుంది ? ఈ విషయాన్ని స్వయంగా కవితే మీడియా సమావేశంలో బయటపెట్టింది.


కల్వకుంట్ల కవితే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని బయటపెట్టింది కాబట్టి బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేమికావాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మావోయిస్టు మద్దతుదారులు లేదా సానుభూతిపరులు అనే ముద్రవేసి బీఆర్ఎస్ హయాంలో వేలాదిమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఈ విషయం 2023 ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే ఆధారాలతో సహా బయటపడింది. దాంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాపింగ్ ఆరోపణలపై విచారించేందుకు ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటుచేసింది.

ట్యాపింగును అంగీకరించిన అధికారులు

దొరికిన ఆధారాలను బట్టి సిట్ అధికారులు ట్యాపింగులో కీలకంగా వ్యవహరించిన డీసీపీ రాధాకిషన్ రావు, అడిషినల్ ఎస్పీలు మేకల తిరుపతయ్య, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ రావును అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ విచారణలోనే తాము ఎన్నిఫోన్లను ట్యాపింగ్ చేసింది, ట్యాపింగ్ చేసిన విధానాన్ని వివరించటమే కాకుండా బాస్ ప్రభాకరరావు ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. ఇవే విషయాలను తర్వాత కోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్లలో పై నలుగురు అధికారులు ఒప్పుకున్నారు. అందుకనే సిట్ అధికారులు ఏడాదికి పైగా ప్రభాకరరావును అమెరికా నుండి రప్పించేందుకు నానా అవస్తలు పడింది. మొత్తానికి ప్రభాకరరావు అమెరికా నుండి హైదరాబాదుకు రావటమే సుప్రింకోర్టు రక్షణతో వచ్చారు.


సుప్రింకోర్టు రక్షణ ఏమిటంటే ప్రభాకరరావును అరెస్టుచేయకూడదని. అరెస్టుచేసి తమదైన స్టైల్లో విచారించకపోతే నిందితులు ఎవరైనా తాముచేసిన తప్పును అంగీకరిస్తారా ? అరెస్టుచేయకూడదన్న సుప్రింకోర్టు రక్షణ కారణంగా ప్రభాకరరావు సిట్ అధికారులకు విచారణలో ఏమాత్రం సహకరించలేదు. ఇదేవిషయాన్ని సిట్ సుప్రింకోర్టులో చెప్పి ప్రభాకరరావుకు ఉన్న రక్షణను తొలగించాలని మేనెల విచారణనుండి పదేపదే కోరుతోంది. ఇదే విషయమై గురువారం జరిగిన విచారణలో ప్రభాకరరావు సిట్ అధికారులకు సహకరించటంలేదని ద్విసభ్య ధర్మాసనం అర్ధంచేసుకున్నది. అందుకనే కస్టడీ విచారణకు సుప్రింకోర్టు అంగీకరించింది. దీనిలో భాగంగానే శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో ఎసీపీ వెంకటరత్నం ముందు నిందితుడు లొంగిపోయారు. వారంరోజుల పాటు సిట్ కస్టడీలో విచారణ జరుగుతుంది.

ప్రభాకరరావే కీలక పాత్రదారి

ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏమిటంటే ట్యాపింగ్ జరిగింది నిజం. ట్యాపింగ్ చేసిన నలుగురు పోలీసు అధికారులే ఆవిషయాన్ని అఫిడవిట్ల రూపంలో అంగీకరించారు. ట్యాపింగు చేయాల్సిన ఫోన్ నెంబర్లను మొబైల్ సర్వీసు ప్రొవైడర్లకు ప్రభాకరరావు ఆఫీసు నుండే ఆదేశాలు అందేవి. అందుకు సంబంధించిన సాక్ష్యాలను మొబైల్ సర్వీసు ప్రొవైడర్లు సిట్ అధికారులకు అందించారు. అప్పట్లో ట్యాపింగ్ కోసం ఉపయోగించిన 27 హార్డ్ డిస్క ల్లో చాలావాటిని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిల్లో ఎలాంటి సమాచారం లేదు. ప్రభాకరరావు ఆదేశాల ప్రకారమే తాము హార్డ్ డిస్కుల్లోని సమాచారాన్ని ధ్వంసంచేసినట్లు నలుగురు పోలీసు అధికారులు అంగీకరించారు.


సో, ఈ సాక్ష్యాల ప్రకారంచూస్తే ట్యాపింగులో కీలక పాత్రదారి ప్రభాకరరావే అన్నది అర్ధమవుతోంది. ఎవరి ఆదేశాల ప్రకారం ప్రభాకరరావు ట్యాపింగ్ చేయించారు అన్నదే తెలాలి. అంటే ట్యాపింగ్ లో కీలక సూత్రదారి ఎవరన్నది ప్రభాకరరావే బయటపెట్టాలి. ఎవరెవరి ఫోన్లను, ఎప్పుడెప్పుడు ట్యాపింగ్ చేయాలన్నఆదేశం ఎవరు ఇచ్చేవారు అన్న విషయం తెలియాలంటే ప్రభాకరరావు నోరిప్పాలి. మామూలుగా అయితే ఇంటెలిజెన్స్ బాస్ గా ఎవరున్నా నేరుగా ముఖ్యమంత్రికి మాత్రమే రిపోర్టుచేస్తారు. అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రభాకరరావు ఎవరికి రిపోర్టుచేసేవారు అన్నది తెలీదు. నిందితుడు ఎవరికి అయితే తాను రిపోర్టు చేసేవాడో వాళ్ళనుండే ట్యాపింగ్ ఆదేశాలు అందే అవకాశాలున్నాయి. ట్యాపింగులో కీలక సూత్రదారు ఎవరన్న విషయాన్ని సిట్ అధికారులు ప్రభాకరరావుతో వారం రోజుల విచారణలో చెప్పించగలరా ? అన్నదే పాయింట్.


అప్రూవర్ గా మారితే కష్టమేనా ?

ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు ను పోలీసులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశించడం తో కేసీఆర్ కు గడ్డు కాలం మొదలైందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నిసార్లు విచారణకు పిలిచినా నోరు మెదపని ప్రభాకర్ రావు ఈ సారి అప్రూవర్ గా మారవచ్చు అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే తనను తాను కాపాడుకోవాలంటే అప్రూవర్ గా మారటం ఒకటే ప్రభాకర్ రావు ముందున్న ఆప్షన్. అదే జరిగితే కల్వకుంట్ల కుటుంభానికి రాజకీయంగా చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇప్పటికే కేసీఆర్ పైన కాళేశ్వరం అవినీతి, కేటీఆర్ మీద ఫార్ములా కార్ రేసు కేసు విచారణ జరుగుతోంది.

తండ్రి, సోదరుడు ఎప్పటికైనా కేసుల్లో ఇరుక్కోక తప్పదన్న విషయం తెలిసే కవిత పార్టీలో నుండి బయటపడిందా అనే ప్రచారం కూడా మొదలైంది. అయితే కవిత ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఆరుమాసాలు తీహార్ జైలులో ఉండి బెయిల్ మీద బయట తిరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.


లొంగిపోయిన పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. ఇక్కడే రేవంత్ కాస్త తెలివిగా వ్యవహరించాడు. నేరుగా పోలీసులతో విచారణ జరిపి అరెస్టులు చేయించకుండా విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటుచేశాడు. ప్రభాకరరావు చెప్పిన విషయాల ఆధారంగా సిట్ అధికారులు యాక్షన్లోకి దిగితే అప్పుడు ఎవరు కోర్టుకు పోయినా పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారితే తెలంగాణలో BRSకు గడ్డుకాలం మొదలైనట్లే అనుకోవాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ లో అగ్రనేతలంతా కేసుల్లో ఇరుక్కున్నవారే. కేసీఆర్, హరీష్ రావు కాళేశ్వరం విచారణలో ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని మూడునెలల క్రితమే సిఫారసు చేసింది. అయితే కేంద్ర హోంశాఖ నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఇక కేటీఆర్ ఫార్ములా కేసులో ఇరుక్కున్నాడు. ఏసీబీ, ఈడీలు కేటీఆర్ పైన కేసులు నమోదుచేసి విచారించిన విషయం తెలిసిందే. ఏదోరోజు కేటీఆర్ మీద ఏసీబీ యాక్షన్ కు దిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కూతురు కవిత లిక్కర్ స్కాములో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్ళొచ్చారు. బెయిల్ రద్దయితే మళ్ళీ తీహార్ జైలుకు వెళ్ళాల్సిందే.

ఈ నేపధ్యంలో అందరిపైనా దర్యాప్తుసంస్ధలు ఏదోరకమైన యాక్షన్ కు దిగితే అప్పుడు బీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటి ? అన్నదే ఆసక్తిగా మారింది. తెలంగాణ కోసం చావునోట్లో తలపెట్టానని చెప్పుకునే కేసీఆర్ చివరకు అవినీతి కేసుల్లో విచారణలను ఎదుర్కొని అరెస్టు భయంతో గడపాల్సి రావటమే విచిత్రం.

వెంటనే కేసీఆర్ ను అరెస్టుచేయాలి : కూరపాటి

‘‘టెలిఫోన్ ట్యాపింగుకు మించిన ద్రోహం ఇంకోటి ఉండదు’’ అని కాకతీయ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అభిప్రాయపడ్డారు. ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతు ‘‘అధికారాన్ని అడ్డంపెట్టుకుని కేసీఆర్ అండ్ కో పెద్ద క్రిమినల్ యాక్టవిటీకి పాల్పడ్డారు’’ అని ఆరోపించారు. ‘‘టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై రిచర్డ్ నిక్సన్, రామకృష్ణ హెగ్డే లాంటివాళ్ళే పదవులు కోల్పోయారు’’ అని గుర్తుచేశారు. ‘‘టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రత్యర్ధి రాజకీయనేతలపై కేసీఆర్ అండ్ కో పెద్ద కుట్రచేశారు’’ అని మండిపడ్డారు. ‘‘రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అతిక్రమించి, ప్రజల వ్యక్తిగత జీవితంలోకి చొరబడటం చాలా పెద్ద నేరం’’ అని అన్నారు. ‘‘రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను వదిలిపెట్టకూడదు’’ అని కోరారు. ‘‘కాలం గడిచేకొద్దీ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను శిక్షించే ఉద్దేశ్యాలు ప్రభుత్వాలకు ఉన్నాయా’’ అన్న అనుమానం వ్యక్తంచేశారు. ‘‘కేసీఆర్ అండ్ కో ను తక్షణమే అరెస్టుచేయాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘వేలాదిమంది ఫోన్లను ట్యాపింగ్ చేయటం క్షమించరాని నేరం’’ అని అన్నారు.

శిక్ష పడాల్సిందే : అమరవాది

‘‘టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అనిపిస్తోంది’’ అని సీనియర్ జర్నలిస్టు అమరవాది రవీంద్రశేషు అన్నారు. ‘‘ట్యాపింగ్ లో కీలక పాత్రదారుడు ఇంటెలిజెన్స్ మాజీ బాస్ టీ ప్రభాకరరావుకు కచ్చితంగా శిక్షపడాల్సిందే’’ అన్నారు. ‘‘తనను ఎవరు ఆదేశిస్తే ట్యాపింగ్ కు పాల్పడ్డారనే విషయాన్ని ప్రభాకరరావు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘వారం రోజుల విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయన్నది ఆసక్తిగా మారింది’’ అని అన్నారు.

Tags:    

Similar News