తెలంగాణలో చలి పంజా
ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక
తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. చలికి గజగజ వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి చెప్పారు. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్ర, శనివారాల్లో శీతల, అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లుండి నుంచి పొగ మంచు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శీతల గాలులు, పొగ మంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.