అల్లుడి చేతిలో మామ మృతి

మహబూబాబాదులో అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు

Update: 2025-12-12 13:21 GMT

అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఘటనలు ఎక్కువై పోతున్నాయి. అల్లుడిని నిలదీసిన పాపానికి తెలంగాణలో ఓ మామ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్న అల్లుడిని ప్రశ్నించేందుకు వెళ్లిన గార్ల మాజీ ఎంపీపీ లాలూ నాయక్‌పై అల్లుడు దాడి చేయడంతో ఆయనకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం గార్ల మండలం మర్రిగూడెం శివారు బొజ్జ తండాకు చెందిన బానోత్ లాలూ నాయక్ కుమార్తె లహరికి, కురవి మండలం పెద్దతండాకు చెందిన గాంధీ నాయక్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.


అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు రెండేళ్ల నుంచి వేధిస్తుండటంతో లహరి పుట్టింటికి వెళ్లిపోయింది. 16 నెలల తర్వాత పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ పంచాయతీలో పెద్దలు ఇచ్చిన తీర్పు ప్రకారం తిరిగి ఆమెను కాపురానికి పంపించారు. ప్రస్తుతం మహబూబాబాద్ పట్టణంలోని మిలటరీ కాలనిలో నివాసం ఉంటున్నారు. భర్త తనను కొడుతున్నాడని తండ్రి లాలూ నాయక్‌కు లహరి గురువారం రాత్రి ఫోన్ చేసి చెప్పింది. దీంతో లాలూ నాయక్ అతని కుమారుడు ప్రదీప్ వచ్చి ఎందుకు కొడుతున్నావని గాంధీ నాయక్ ను నిలదీశాడు. ఆ నేపధ్యంలో ఇటు గాంధీకి అటు మామతో పాటు బావమరిది ప్రదీప్ కు మధ్య పెద్ద గొడవైంది. రెండువైపులా మాట మాట పెరిగటంతో అల్లుడు మామపై దాడి చేసికొట్డాడు.  లాలూనాయక్ ను నెట్టివేయడంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే లాలూ  మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుని కుమారుడు ప్రదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News