తెలంగాణ బీజేపీలో లుకలుకలు, ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈటల
తెలంగాణ బీజేపీలో తనపై కుట్రలు జరుగుతున్నాయని, అన్ని విషయాలను బయట పెడతానంటూ హెచ్చరించిన ఈటల రాజేందర్.
తెలంగాణ బీజేపీలో లుకలుకలు బయపడుతున్నాయి. పార్టీలో తనపై కుట్రలు జరుగుతున్నాయని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కొందరు అవగాహన లేకుండానే ఇలాంటి పనులు చేస్తున్నారని, వాటిని పట్టించుకోనని అన్నారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తానని, అన్నీ బహిర్గతం చేస్తానంటూ హెచ్చరించారు. కేంద్ర సహాయక మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పీఆర్ఓ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు పెట్టారు. వాటిపైనే తాజాగా ఈటల స్పందించారు. తాను కూడా కొన్ని పోస్ట్‌లను చూశానని, తాను ఏ పార్టీలో ఉండాలనేది నిర్ణయించేది ప్రజలు, పార్టీ హైకమాండ్ అని అన్నారు. కమలాపూర్‌లో ఆయన శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్‌లపై స్పందించారు.
ఇలాంటి పోస్ట్‌లను తాను పట్టించుకోనన్నారు ఈటల. అసలు అవగాహన ఉన్నవారు ఇటువంటి పోస్ట్‌లు పెడతారా? అని ప్రశ్నించారు. ఎవరు ఏం చెప్తున్నారనేది ప్రజలకు అర్థం అవుతుందని, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలను బహిర్గతం చేస్తానని అన్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇటీవల జరిగిన అన్ని పరిణామాలను తాను వివరిస్తానని అన్నారు.
పంచాయతీ ఫలితాలపై కాంగ్రెస్‌పై విమర్శలు
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లను కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఈటల ఆరోపించారు. “కాంగ్రెస్‌పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఫలితాలే చెబుతున్నాయి” అని వ్యాఖ్యానించారు.
సింగరేణి అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. “సింగరేణి కార్మికుల క్వార్టర్స్ బాగుచేయడానికి డబ్బులు లేవా? కానీ అదే సింగరేణి నిధులతో సీఎం రేవంత్‌రెడ్డి తన ఫుట్‌బాల్ ట్రైనింగ్ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏంటి?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని కవిత ఆరోపిస్తున్నారని కూడా గుర్తు చేశారు.
“పేదల ఇళ్లనే కూలుస్తారా?”
ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల నిలదీశారు. “జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని సీఎం చెబుతున్నారు. ఇలా అయితే తెలంగాణ రాష్ట్రం వల్లకాడులా మారే ప్రమాదం ఉంది” అని విమర్శించారు.
“ప్రజా ప్రభుత్వం అంటే పేదల ఇళ్లను కూల్చడమా? పెద్దల ఆస్తులను కాపాడడమా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామాల అభివృద్ధిలో తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు.
తనను తొక్కేయాలన్న ప్రయత్నం
తన స్వగ్రామం కమలాపూర్‌లో తనను తొక్కేయాలని కొందరు ప్రయత్నించారని ఈటల ఆరోపించారు. “నా గురించి మాట్లాడిన వాళ్లను ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్పారు” అని అన్నారు. నిస్వార్థంగా పనిచేసిన తమ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
“సీఎం ఈవెంట్ మేనేజర్‌లా మారారు”
సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. “డబ్బులు లేవని చెబుతూనే, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మీడియాలో మేనేజ్ చేయడం తప్ప ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు” అని ఎద్దేవా చేశారు.