మెస్సీ పైకి కుర్చీలు, వాటర్ బాటిళ్ళు విసిరిన అభిమానులు
మెస్సీ మీద ఆగ్రహంతో స్టేడియంలో నుండి జనాలు కుర్చీలు, వాటర్ బాటిళ్ళను గ్రౌండ్ లోకి విసిరికొట్టారు.
ప్రపంచ సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ రాక సందర్భంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కోల్ కత్తా స్టేడియంలో జరిగిన ఘటనలను హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కోల్ కత్తాలో జరిగిన ఘటనలు హైదరాబాదులో పునరావృతం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే పోలీసులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకీ కోల్ కత్తాలో ఏమి జరిగింది ? హైదరాబాదు పర్యటనపై అనుమానాలు ఏమిటి ?
ఇంతకీ విషయంఏమిటంటే మెస్సీ తన ఇండియా పర్యటనను కోల్ కత్తాతో మొదలుపెట్టాడు. కోల్ కత్తాలో 70 అడుగుల తన విగ్రహాన్ని మెస్సీనే ఆవిష్కరించుకున్నాడు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమం తర్వాత మెస్సీ కోల్ కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంకు చేరుకున్నాడు. అసలే అది కోల్ కతా, అందులోను ఫుట్ బాల్ అంటే చచ్చేంత అభిమానం జనాలకు. స్టేడియంలోకి వచ్చింది ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ. ఇక జనాలు ఆగుతారా ? మెస్సీని చూడటానికి జనాలు స్టేడియంలో విరుగబడ్డారు. అయితే స్టేడియంలో మెస్సీ పట్టుమని పదినిముషాలు కూడా ఉండలేదు. స్టేడియంలోకి మెస్సీ ఇలా వచ్చి వెంటనే బయలుదేరేశాడు. దాంతో ఫ్యాన్స్ కు మండిపోయింది.
అందుకనే మెస్సీ మీద ఆగ్రహంతో స్టేడియంలో నుండి జనాలు కుర్చీలు, వాటర్ బాటిళ్ళను గ్రౌండ్ లోకి విసిరికొట్టారు. అలర్టయిన భద్రతాదళాలు వెంటనే మెస్సీకి రక్షణవలయంగా నిలబడి స్టేడియం బయటకు తీసుకెళ్ళిపోయారు. దాంతో స్టేడియం చుట్టుపక్కల ఉద్రిక్తపరిస్ధితులు నెలకొన్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే మెస్సీలో కోల్ కత్తా నుండి నేరుగా హైదరాబాదుకు చేరుకుంటున్నాడు. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో కూడా మెస్సీ కోల్ కత్తాలో వెళ్ళిపోయినట్లే వెళ్ళిపోతే ఇక్కడ కూడా జనాలు గొడవలు చేస్తారన్న అనుమానం పోలీసుల్లో టేన్షన్ పెంచేస్తోంది. అందుకనే ముందుజాగ్రత్తగా స్టేడియంలోకి వాటర్ బాటిళ్ళను నిషేధించే యోచనలో ఉన్నారు. ఎందుకైనా మంచిదని స్టేడియం లోపలా, బయట కూడా పోలీసులతో అదనపు భద్రతను ఏర్పాటుచేస్తోంది ప్రభుత్వం. ఇక్కడ ఏమవుతుందో చూడాలి.