పంచాయితీ ఫలితాలు కేటీఆర్ కు అర్ధంకాలేదా ?
ఓవరాల్ గా కాంగ్రెస్ మద్దతుదారులు 57.32శాతం సీట్లలో గెలిచినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
తొలిదశ పంచాయితీఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటి పంచాయితీల్లో గెలిచారు. 4,230 పంచాయితీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మద్దతుదారులు 2,425 పంచాయితీల్లో గెలిచారు. ఓవరాల్ గా కాంగ్రెస్ మద్దతుదారులు 57.32శాతం సీట్లలో గెలిచినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ మద్దతుదారులు 27.6 శాతం సీట్లతో 1168 పంచాయితీల్లోను, బీజేపీ బలపరచిన అభ్యర్ధులు 4.5 శాతం సీట్లతో 189 చోట్ల, స్వతంత్రులు 9.47 శాతంతో 401 స్ధానాల్లోను, వామపక్షాల మద్దతుదారులు 47 చోట్ల గెలిచారు. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన వాస్తవం ఇలాగుంటే (BRS)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాత్రం అడ్డగోలు లెక్కలతో(Telangana Congress) కాంగ్రెస్ పై బురదచల్లేస్తున్నారు. బహుశా మొదటిదశ ఫలితాలు కేటీఆర్ కు అర్ధమైనట్లు లేదు.
కేటీఆర్ లెక్కలు, వాదనలే చాలా విచిత్రంగా ఉన్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే పంచాయితీ ఎన్నికలతోనే కాంగ్రెస్ పతన మొదలైందట. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంచేసినా కాంగ్రెస్ గెలిచిన సీట్లు 44శాతం దాటలేదని చెప్పటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకతకు పంచాయితీ ఎన్నికల మొదటిదశ ఫలితాలే నిదర్శనమనే పిచ్చి వాదనలు వినిపించారు. మొదటిదశ ఫలితాల్లో కాంగ్రెస్ 57 శాతం సీట్లను గెలుచుకుంటే 44శాతం సీట్లు కూడా గెలుచుకోలేదని కేటీఆర్ చెప్పటమే తనకు ప్రభుత్వంపై పేరుకుపోయిన అక్కసుకు పరాకాష్ట. 4230 పంచాయితీల్లో కాంగ్రెస్ 2,425 పంచాయితీల్లో గెలిచిందంటే మెజారిటి సీట్లు గెలుచుకున్నట్లే అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అలాంటిది అమెరికాలో ఉన్నత చదవులు చదివి ఉద్యోగం కూడా చేసిన కేటీఆర్ మాత్రం 44శాతం సీట్లు కూడా గెలుచుకోలేదని ఎలా చెప్పారో అర్ధంకావటంలేదు.
2,425 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగినట్లా లేకపోతే 27.6శాతంతో 1168 సీట్లకు మాత్రమే పరిమితమైన బీఆర్ఎస్ ను జనాలు పట్టించుకోనట్లా ? అన్నది కేటీఆరే చెప్పాలి. ప్రభుత్వం మీద అక్కసు ఉంటే ఉండచ్చు కాని జనాలు మరీ ఇంత తప్పదోవ పట్టించి ప్రభుత్వంపై బురదచల్లేసేంత స్ధాయిలో ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాలను చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది మెజారిటి సీట్లలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని. అలాగే పంచాయితీ ఎన్నికల ఫలితాలు రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనంగా కేటీఆర్ చెప్పటమే విచిత్రంగా ఉంది. పార్టీల రహితంగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎలాగవుతుంది ?
పంచాయితీ ఎన్నికలంటే ప్రధానంగా గ్రామపోరుగా చూడాలి. గ్రామపోరు అంటే గ్రామంలో ఉండే రాజకీయాలు, సామాజికవర్గాలు విభేదాలు, వ్యక్తులపైన ఉండే వ్యతిరేకత లేదా అనుకూలత, బంధుత్వాలు ల్లాంటి అనేక అంశాల మీద జనాలు అభ్యర్ధులకు ఓట్లు వేయటం లేదా వ్యతిరేకించటం ఆధారపడుంటుంది. ఇలాంటి ఎన్నికల్లో మొదటిదశ ఫలితాలను కూడా రేవంత్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత అని చెప్పటం కేటీఆర్ కు మాత్రమే చెల్లుబాటవుతుంది.