Tirupati stampede | టీటీడీ పేరాశ, పాలిటిక్స్ భక్తుల దుఃఖానికి బాట

ఏప్రిల్ 2022లో తిరుపతిలో ఉచిత టోకెన్ల పంపిణీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటనను ప్రస్తుత టీటీడీ పాలక మండలి విస్మరించిందని పలువురు భక్తులు పేర్కొన్నారు.;

Update: 2025-01-10 08:19 GMT
తిరుపతిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాటలో గాయపడిన భక్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి ప్రతిష్ట మరోసారి దెబ్బతింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన ఒక టోకెన్ పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందడంతో ఈ విషయం నిరూపితమైంది. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై గతంలో పెద్ద వివాదమే జరిగింది. ఈ ఘటన కూడా టీటీడీ నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టింది.

అసలు ఈ దుర్ఘటన ఎలా జరిగింది?

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉచిత టోకెన్లు పంపిణీ చేసేందుకు తిరుపతిలో ఏర్పాటుచేసిన కేంద్రాల వద్ద జనసందోహం అదుపు తప్పడంతో బుధవారం (జనవరి 8) రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. జనవరి 10న ప్రారంభమయ్యే ఈ వేడుకకు వివిధ ప్రాంతాల్లో 90 కౌంటర్లతో పాటు 8 కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది.

బయరాగిపట్టెడ కేంద్రంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఐదుగురు మరణించారు. మరోవ్యక్తి శ్రీనివాసం కౌంటర్ వద్ద మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బయరాగిపట్టెడలో రాత్రి 9 గంటల ప్రాంతంలో టోకెన్ కోసం వేచి ఉన్న ఒక భక్తురాలు అస్వస్థతకు గురికావడంతో ఆమెను బయటకు పంపేందుకు గేటు తెరిచారు. కాని వెనక ఉన్న భక్తులు గేటు తెరిచారని భావించి ముందుకు దూసుకెళ్లారు. కాని వెంటనే సిబ్బంది గేటు మూసేయడంతో జనాలు బయటకు వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బయరాగిపట్టెడ కౌంటర్ వద్ద జరిగిన ఘటనతో పోలిస్తే శ్రీనివాసం కౌంటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన చిన్నదని భక్తులు చెబుతున్నారు.

తొక్కిసలాటకు కారణాలను అధికారులు వెల్లడించలేదు. అయితే తగిన భద్రతా ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని భక్తులంటున్నారు.

టీటీడీ, పోలీసులపై విమర్శలు..

టీటీడీ అధికారులే ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలని తిరుపతికి చెందిన బీజేపీ నేత, ఉద్యమకారుడు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జనవరి 10 నుంచి 19 వరకు జరిగే ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యను ముందుగా అంచనా వేయడంలో టీటీడీ విఫలమైందని ఆయన అన్నారు.

“టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. టీటీడీ బోర్డు, టీటీడీ అధికారులు, పోలీసులు మధ్య సమన్వయలోపమే ఈ దుర్ఘటనకు కారణం,” అని రెడ్డి అన్నారు.

భక్తులు ఒక్కసారిగా కేంద్రం వద్దకు ఎందుకు చేరారు?

రెడ్డి దీనికి కారణాన్ని వెల్లడించారు. “సాధారణంగా తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు టీటీడీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. వారికి తిరుమలలోనే టోకెన్లు అందుతాయి. ప్రతి సంవత్సరం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది వైకుంఠ ద్వార దర్శన కోసం కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. ఈసారి ప్రాధాన్యత టోకెన్లను వారికి నిరాకరించడంతో.. వారు తిరుపతిలోని టోకెన్ల పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం కల్లా భక్తులు కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. సాయంత్రం కల్లా ప్రతి కౌంటర్ జనసందోహంతో నిండిపోవడంతో తొక్కిసలాటకు దారితీసింది.”

“ప్రాధాన్యత టోకెన్ల పంపిణీ చేసి ఉంటే.. జనసందోహం అదుపులో ఉండేదని” రెడ్డి అన్నారు. టీటీడీ గురువారం ఉదయం 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాల్సి ఉంది. సాంప్రదాయంగా వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులపాటు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో నిర్వహిస్తారు. భక్తులు రూ.300 టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని ప్రత్యేక దర్శనం పొందవచ్చు. ఉచిత దర్శనం కోసం వైకుంఠ క్యూకాంప్లెక్స్ ద్వారా నేరుగా సర్వ దర్శనానికి అనుమతిస్తారు.

సంప్రదాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు..

మునుపటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఆదాయం పెంచేందుకు వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలయ్యాయి. అయినప్పటికీ టీటీడీ బోర్డు, పీఠాధిపతులు, స్వామీజీల మద్దతుతో 2022 జనవరి నుంచి 10 రోజుల దర్శనానికి మార్పులు అమలు చేశారు.

గత ఘటనల నుంచి పాఠాలు నేర్వని టీటీడీ..

ఏప్రిల్ 2022లో టోకెన్ల పంపిణీ సమయంలో కొంతమంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అదే విధానం కొనసాగించడంపై కొంతమంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ద్వాదశీ రోజునా వేడుకలు..

చాలా ఏళ్లుగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఒక అధికారి మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనం ఏకాదశి నాడు మాత్రమే జరిపే ఆచారం.. 1863లో ప్రారంభమైందని తెలిపారు. 1949లో దీన్ని ద్వాదశి నాడు కూడా నిర్వహించారు. అయితే దీనికి అధికారిక ఆధారాలు లేవు. డాక్టర్ పామిడికల్వ చెంచు సుబ్బయ్య, డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ రచించిన "వైకుంఠ ఏకాదశి" అనే టీటీడీ పుస్తకంలో తిరుమలలో ఏకాదశి వేడుకల ప్రస్తావన తేలేదు.

ఆదాయంపై దృష్టి

10 రోజుల ఉత్సవానికి వ్యతిరేకంగా కె.ఎస్. కాశీనాథ శర్మ గతంలో రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా, ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఉత్సవాల నిర్వహణకు తెరదీశారని పేర్కొన్నారు. ఇప్పటికే తిరుమల ఆలయం ప్రతిరోజు సుమారు రూ. 3.5-4 కోట్లు ఆర్జిస్తుందని, ఇది ప్రధానంగా భక్తుల సమర్పించిన కానుకల నుంచి వస్తోందని చెప్పారు.

"తిరుమలలో ఉత్తర ద్వారం లేనే లేదు. ఒక చిన్న తలుపును ఉత్తర ద్వారంగా భావిస్తున్నారు. 10 రోజుల పాటు ద్వార దర్శనం కొనసాగించడం ఆధ్యాత్మికతకు విరుద్ధం. ఇది కేవలం ఆర్థిక లాభాల కోసం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం," అని శర్మ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో క్యూ కాంప్లెక్సుల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలున్నా, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 10 రోజుల దర్శనం, టోకెన్ వ్యవస్థను కొనసాగించింది.

ప్రచారం vs సన్నాహాలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దుర్ఘటన టీటీడీ పరిపాలన వైఫల్యాన్ని హెచ్చరిస్తుందని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

"ఈవో (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), చైర్మన్ అనేకసార్లు ఏడున్నర లక్షల మంది భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. టోకెన్ కేంద్రాలలో 50 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, శ్రీవారి సేవకులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్ నియామకం చేశామని ప్రకటించారు. అయినప్పటికీ తొక్కిసలాట జరిగింది. అధికారులు సాధారణ భక్తుల కంటే ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు," అని ఆరోపించారు.

భక్తులకు అరుదైన అవకాశం..

తిరుమల ఆలయంలో గర్భగుడిని ఏడాదిలో వైకుంఠ ఏకాదశి రోజునే మాత్రమే తెరుస్తారు. దీన్ని భక్తులు అరుదైన అవకాశంగా భావిస్తారు. తరువాత రోజు చక్రస్నానంతో గర్భగుడి ద్వారాన్ని మూసివేస్తారు. ఏటా ఒక్కసారి మాత్రమే ఇది జరుగుతుండటమే వైకుంఠ ఏకాదశి సమయంలో భక్తుల సంఖ్య పెరుగడానికి ఇది కూడా ఓ కారణం. ఇలా భారీగా భక్తులు తిరుపతికి తరలివచ్చి టోకెట్ కౌంటర్ల వద్ద తొక్కిసలాటతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

Tags:    

Similar News